గురువారం 26 నవంబర్ 2020
Gadwal - Sep 17, 2020 , 07:59:27

కృష్ణమ్మ పరవళ్లు

కృష్ణమ్మ పరవళ్లు

  • జూరాల ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేత
  • ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలకూ వరద
  • శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్ల ద్వారా దిగువకు..

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. కర్ణాటకలోని ప్రాజెక్టులతోపాటు తెలంగాణలో కురురుస్తున్న వర్షాలతో వరద పెరిగింది. దీంతో జూరాల నిండుకుండను తలపిస్తుండగా.. ప్రాజెక్టు 17 గేట్లను ఎత్తి దిగువకు 1,28,616 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,59,900 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,55,066 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులకుగానూ  ప్రస్తుతం 1044.455 అడుగులకు చేరింది. సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 9.316 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పవర్‌హౌస్‌కు 25,068 క్యూసెక్కులు విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. కుడి, ఎడమ, సమాంతర కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 28,712 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 28,712 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1704.72 అడుగులకు చేరింది. సామర్థ్యం 128.72 టీఎంసీలు ఉండగా 128.19 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 30,896 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 34,583 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ ప్రస్తుతం 1614.40 అడుగులకు చేరగా.. సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా 37.17 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

టీబీ డ్యాం ఇన్‌ఫ్లో @ 28,485 క్యూసెక్కులు

అయిజ : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. తుంగ జలాశయంతోపాటు నదితీర ప్రాంతాల నుంచి 6,076 క్యూసెక్కుల డ్యాంకు వచ్చి చేరుతున్నాయి. డ్యాంలోకి ఇన్‌ఫ్లో 28,485 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 36,182 క్యూసెక్కులుగా నమోదైంది. ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతున్నది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 1633 అడుగుల నీటిమట్టానికిగానూ 1633.00 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు.  

ఆర్డీఎస్‌ ఆనకట్టకు..

కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. 22,484 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 21,800 వేల క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి ప్రవహించాయి. ఆయకట్టుకు 684 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.8 అడుగుల మేరకు నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.  

సుంకేసులకు 

కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

రాజోళి : మండల కేంద్రం సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 22 వేల క్యూ సెక్కులు ఉండగా ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు 21 వేల క్యూసెక్కులు విడుదల చేసినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేసీ కెనాల్‌కు 1000 క్యూసెక్కులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 

శ్రీశైలం 10 గేట్లు ఓపెన్‌

శ్రీశైలం : ఎగువ నుంచి వరద పెరుగుతుండటంతో గంటగంటకూ శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతున్నది. సుమారు 3,98,312 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా బుధవారం సాయంత్రం పది గేట్లను 15 అడుగుల ఎత్తులో తెరిచి దిగువకు 3,76,170 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో పాలసముద్రాన్ని తలపించేలా కృష్ణమ్మ పరవళ్లు తొక్కు తూ మల్లన్న సన్నిధి దాటుకుంటూ సాగర్‌ చెంతకు చేరుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.30 అడుగులకు చేరింది. సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా.. 211.4759 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ ప్రాజెక్టుల నుంచి 2,25,102 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. 30,308 క్యూసెక్కులతో కుడిగట్టులో విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. దీంతో అవుట్‌ఫ్లో 4,06,923 క్యూసెక్కులుగా నమోదైంది. 

కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు 32.6 అడుగులు 

దేవరకద్ర రూరల్‌ : కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు 32.6 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం నమోదైంది. దీంతో బుధవారం ఉదయం 9 గంటలకు 2 గేట్లు తెరిచి 1000 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం వరద తగ్గడంతో 600 క్యూసెక్కులను విడుదల చేసినట్లు డీఈ రవీందర్‌రెడ్డి తెలిపారు. 

రంగసముద్రం మూడు గేట్లు ఎత్తివేత

పెబ్బేరు రూరల్‌ (శ్రీరంగాపురం): శ్రీరంగాపురంలోని రంగసముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు బుధవారం వరద పోటెత్తడంతో అధికారులు 3 గేట్లను ఎత్తారు. ఈ నీరు సమీపంలోని కృష్ణానదికి పరుగులు పెట్టింది. 

సంగంబండ 8 గేట్లు ఎత్తిన అధికారులు

 మక్తల్‌ రూరల్‌ : మండలంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతున్నది. దీంతో ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు ఏఈ సయిద్‌ తెలిపారు. నీటినిల్వ సామర్థ్యం 3.13 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇన్‌ఫ్లో 15000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 15000 క్యూసెక్యులుగా నమోదైంది. 

11 ఏండ్ల తర్వాత దూకిన డిండి

వంగూరు : నాగర్‌కర్నూల్‌-నల్లగొండ జిల్లాల సరిహద్దులోని వంగూరు మండలంలో ఉన్న డిండి ప్రాజెక్టు 11 ఏండ్ల తర్వాత పూర్తిస్థాయిల్లో నిండి దుంకింది. దీంతో పర్యాటకులు తరలివచ్చి ప్రాజెక్టు అందాలను తిలకిస్తున్నారు. 2009లో కేవలం 24 గంటలు మాత్రమే దుంకిన ఈ ప్రాజెక్టు మళ్లీ బుధవారం దుం కింది. ఈ ప్రాజెక్టుకు నీటిని తీసుకొచ్చే దుందుభీ నది పరవళ్లు తొక్కుతున్నది. వంగూరు మండలం జాజాల, పోతారెడ్డిపల్లి, ఉల్పర, మిట్టసదగోడు, డిండి చింతపల్లి, ఉమ్మాపూర్‌ తదితర గ్రామాల్లో నది ప్రవాహం ఉధృతంగా ఉన్నది. 

తెరుచుకున్న సరళాసాగర్‌ సైఫన్లు

మదనాపురం : మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు సైఫన్లు తెరుచుకున్నాయి. 10 సైఫన్లు తెరుచుకోగా దిగువకు నీటి విడుదల కొనసాగుతున్నది. దీంతో పర్యాటకుల సందడి నెలకొన్నది. అదేవిధంగా కొత్తకోట మండలం కానాయపల్లి సమీపంలోని శంకర సముద్రం 5 గేట్లు మీటరు పొడవు ఎత్తారు. దీంతో నీరంతా రామన్‌పాడు జలాశయానికి పరవళ్లు తొక్కుతూ వెళ్లింది. రామన్‌పాడు జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు జేఈ రెనాల్‌రెడ్డి తెలిపారు.