మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Gadwal - Sep 16, 2020 , 00:43:27

అక్షయపాత్రలు ఎత్తిపోతలు

అక్షయపాత్రలు ఎత్తిపోతలు

  • ప్రారంభమైన జోగుళాంబ, క్యాతూరు-2, ఉట్కూరు లిఫ్ట్‌లు
  • కృష్ణ, తుంగభద్ర నీటి ఎత్తిపోత 
  • 8,040 ఎకరాలకు సాగునీరు
  • కళకళలాడుతున్న పంటలు
  • సస్యశ్యామలమవుతున్నఅలంపూర్‌
  • రైతు మోములో సంతోషం

జల సవ్వడి భూతల్లిని పులకింపజేసింది. పొలం కోలా‘హలమై’ మెరిసింది. కృష్ణా, తుంగభద్ర నదులపై జోగుళాంబ, క్యాతూరు-2, ఉట్కూరు ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఈ మూడు ఎత్తిపోతల ద్వారా 40 వేల క్యూసెక్కులు పంపింగ్‌ చేస్తుండటంతో దాదాపు 8,040 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. జోగుళాంబ ఎత్తిపోతల ద్వారా ఏడాదంతా సాగునీరు అందుతోంది. దీంతో ఏ చింత లేకుండా అన్నదాతలు వ్యవసాయం చేస్తూ సిరుల పంటలు పండిస్తున్నారు. అలంపూర్‌ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతోంది. రైతన్న మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. 

ఆర్డీఎస్‌ ఏర్పడినప్పటి నుంచి 2018 ఆగస్టు  వరకు అలంపూర్‌ చివరి ఆయకుట్టు భూములకు సరిగా సాగునీరందిన దాఖలాలు లేవు..  ఈ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.  రైతుల కష్టాలను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోగుళాంబ, క్యాతూరు-2, ఉట్కూరు  ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసింది.. దీంతో ఎత్తిపోతల ద్వారా నియోజకవర్గంలో 8,040 ఎకరాలకు పుష్కలంగా సాగునీరందుతున్నది. ఆర్టీఎస్‌ చివరి ఆయకట్టు ప్రాంతమైన అలంపూర్‌ నియోజకవర్గంలోని భూములకు పుష్కలంగా సాగునీరు చేరుతున్నది. ఈ నెల 6వ తేదీన క్యాతూరు, జోగుళాంబ ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందిస్తుండగా కొత్తగా పూర్తైన ఉట్కూరు లిఫ్ట్‌ను ఈ నెల 12వ తేదీన ప్రారంభించారు.  దీంతో అలంపూర్‌ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతున్నది. 

- జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ

అలంపూర్‌ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నాయి. 40ఏండ్లుగా సాగునీరందక నెర్రెలుబారిన నేలలు ఎత్తిపోతల పథకాలతో సిరులు పండించే మాగానులుగా మారుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు, తుమ్మిళ్ల ప్రాజెక్ట్‌లతోపాటు అలంపూర్‌ నియోజకవర్గంలోని జోగుళాంబ, క్యాతూరు, ఉట్కూరు ఎత్తిపోతల పథకాలు  రైతులకు అక్షయపాత్రలుగా మారాయి. అలంపూర్‌ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు రూ.60కోట్లతో మూడు ఎత్తిపోతల పథకాలను ప్రతిపాధించి వీటిలో జోగుళాంబ, క్యాతూరు పథకాలను 2018లో పూర్తిచేశారు. ఉట్కూరు పంపును ఇటీవల పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తున్నారు. 

40 ఏండ్ల గోసకు చరమగీతం

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలో చుట్టూ కృష్ణ, తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరందక అవస్థలు పడ్డారు. ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టు వరకు ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం జోగుళాంబ, క్యాతూరు-2, ఉట్కూరు-2 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసింది. ఈ పథకాల్లో పంపుల ద్వారా కృష్ణానది నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2009లో మంజూరైన ఈ ఎత్తిపోతల పథకాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక చొరవ కనబరిచి వీటిలో జోగుళాంబ, క్యాతూరు-2 లిఫ్ట్‌లను పూర్తి చేసి 2018 నుంచి సాగునీరు అందిస్తుండగా తాజాగా ఉట్కూరు-2 లిఫ్ట్‌ను పూర్తిచేసి ఇటీవల ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయడంతో 40ఏండ్లుగా రైతులు పడుతున్న కష్టాలకు తెరపడింది. దీంతో అలంపూర్‌ నియోజకవర్గంలో అలంపూర్‌, ఇమాంపురం, బుక్కాపురం, బైరంపల్లి, కోనేరు, క్యాతూరు, భీమారం, ఉట్కూరు తదితర గ్రామాల్లోని శివారు భూములకు సమృద్ధిగా సాగునీరందుతుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకాలతో  అన్నదాతలు సంబుర పడుతున్నారు. రెండు నదుల సంగమం పరిసర ప్రాంతాలన్నీ  సాగునీటితో సస్యశ్యామలం కావడంతో  రైతన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

జోగుళాంబ ఎత్తిపోతల పథకం

అలంపూర్‌ నియోజకవర్గంలోని అలంపూర్‌, ఇమాంపురం, బుక్కాపురం, కోనేరు గ్రామాల శివార్లలో సుమారుగా 3,230 ఎకరాలకు సాగునీరందించేదుకు జోగుళాంబ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దాదాపు రూ.18కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తిచేసి 2018 ఆగస్టు 6న ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నదీ సంగమం ద్వారా వచ్చిన కృష్ణ, తుంగభద్ర నీటిని ఎత్తిపోసేందుకు నాలుగు 450 హెచ్‌పీ మోటార్లను అమర్చారు. ఒక మోటారు నుంచి 12గంటల పాటు దాదాపుగా 15వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 365రోజుల పాటు నీటిని ఎత్తిపోసేందుకు ఈ పథకం ఉపయోగపడనున్నది. జూరాల నుంచి వచ్చే కృష్ణానీరు, సుంకేసుల నుంచి వచ్చే తుంగభద్ర నీరు ఏడాది పొడవునా సమృద్ధిగా ఉండే ప్రదేశంలో ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సరిపడా నీటిని పుష్కలంగా అందించవచ్చు. ఆయకట్టు భూముల్లో నీరు పారేందుకు పిల్ల కాలువలను, షటర్లు, డ్రాపులు నిర్మించేందుకు రూ. 1.16కోట్లను ప్రభుత్వం మంజూరు చేసి పనులను చేపట్టింది.


క్యాతూరు-2 ఎత్తిపోతల పథకం

క్యాతూర్‌, భీమారం గ్రామ శివార్లలో 3,460 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చేందుకు క్యాతూరు-2 లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం రూ. 26.52కోట్ల నిధులను కేటాయించి పూర్తిచేశారు. వరద సమయంలో శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను ఎత్తిపోసేందుకు ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్‌ చేశారు. ఈ లిఫ్ట్‌లో 450 హెచ్‌పీ సామర్థ్యం గల నాలుగు పంపులను ఏర్పాటు చేశారు. ఒక పంపు నుంచి రోజుకు 12 గంటల్లో 15,224క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల పొలాల్లోకి పుష్కలంగా నీరు చేరుతుంది. 

ఉట్కూరు-2 లిఫ్ట్‌ 

ఉట్కూరు పాత గ్రామం పరిధిలో ఉట్కూరు-2 పంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా ఉట్కూరు గ్రామం చుట్టూ ఉండే కోనేరు, భీమవరం, కేశవరం తదితర గ్రామాల్లోని 1,350 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్‌ను దాదాపుగా  రూ.15.48కోట్లతో 160 హెచ్‌పీ సామర్థ్యం గల పంపులతో ఏర్పాటు చేశారు. రోజుకూ దాదాపుగా 10వేల క్యూసెక్కుల వరకు నీటిని ఎత్తిపోయనున్నాయి. 

నీటిని ఎత్తిపోస్తున్న మూడు ప్రాజెక్టులు

అలంపూర్‌ మండలంలో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం మూడు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసింది.  ఈ నెల 6 నుంచి జోగుళాంబ, క్యాతూరు-2 లిఫ్ట్‌ను ఎమెల్యే అబ్రహం ప్రారంభించారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా రోజుకు ఒక్కో ఎత్తిపోతల పథకం ద్వారా 15వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 30వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేందుకు తాజాగా పూర్తైన ఉట్కూరు-2 లిఫ్ట్‌ను ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు.  పంట పొలాలకు కావాల్సిన నీరు అందుతుండటంతో  రైతులు సంతోషంగా వ్యవసాయం కొనసాగిస్తున్నారు.  

చివరి ఆయకట్టుకు సాగునీరందిస్తాం

రైతులకు కావాల్సినమేర నీటిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పంటల అవసరాల మేరకు ఈ నెల 6నుంచి జోగుళాంబ, క్యాతూరు-2 లిఫ్ట్‌లను ప్రారంభించాం. కాలువల ద్వారా పంటలకు నీరు చేరుతుంది. వర్షంపై ఆధారపడకుండా రైతులకు ఎప్పుడు సాగునీరు అవసరమైతే అప్పుడు అదించేందుకు మోటార్లను సిద్ధంగా ఉంచాం. చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తాం.

- లక్ష్మీనారాయణ, ఏఈ, క్యాతూర్‌-2లిఫ్ట్‌ 


logo