బుధవారం 02 డిసెంబర్ 2020
Gadwal - Aug 31, 2020 , 04:20:23

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో మొహ‌ర్రం

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో మొహ‌ర్రం

పీర్లను దర్శించుకునేందుకు బారులుతీరిన భక్తులు బందోబస్తు మధ్య నిమజ్జనం


ఊట్కూర్‌: కర్బలా యుద్ధంలో వీర మరణం పొందిన మహ్మద్‌ ప్రవక్త మనుమలు హసన్‌, హుస్సేన్‌ త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకొనే మొహర్రం (పీర్ల పండుగ) వేడుకలకు భక్తజనం పోటెత్తింది. మండల కేంద్రంలో ఆదివారం దశమి సవారీని దర్శించుకునేందుకు భక్తులు కులమత భేదం లేకుండా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చక్కెర, పుట్నాలు, గోధుమ పిండితో తయారు చేసిన మాలీజ భక్తులు హసన్‌, హుసేన్‌లకు నైవేద్యంగా సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు దర్గా వద్ద కందూర్లకు అనుమతించకపోవడంతో భక్తులు తమ మొక్కుబడుల్లో భాగంగా తమ ఇండ్ల వద్దనే గొర్రెలు, మేకలతో కందూర్లు నిర్వహించి విందు భోజనాన్ని ఆరగించారు. ఆచారం మేరకు పలువురు భక్తులు ప్రత్యేక సంతాపదినాలు పాటించి ఉపవాస దీక్షలు చేపట్టారు. పెద్దపీర్ల మజీదు నుంచి మేన్‌బజార్‌, భరత్‌నగర్‌, శివాజీనగర్‌ ప్రాంతాల మీదుగా కొనసాగిన ఊరేగింపులో భక్తులు చిన్న, పెద్ద తారతమ్య బేధం లేకుండా పీర్ల సవారీ వెంట నడిచారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో బొడ్డెమ్మలు వేసి చూపరులను ఆకట్టుకున్నారు. 

వేడుకల్లో ప్రధాన ఘట్టం డోలారోహణం

పీర్ల సవారీ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన డోలారోహణం (తొట్ల) కార్యక్రమం ఆదివారం ఉదయం, సాయంత్రం సమయంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక రుద్రనగర్‌ వీధిలో ఆరెకటిక వంశస్తులు తమ శిశువులను ఊయల వేసి సవారీ చేత నామకరణం చేయించారు. వేడుకలకు హాజరైన భక్తులు పోటీపడి ప్రసాదం దక్కించుకున్నారు. ప్రసాదం దక్కిన వారికి సకల శుభాలు జరిగి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సాయంత్రం స్థానిక పెద్దచెరువు అలుగు కట్టపై పీర్ల అలయ్‌ బలయ్‌ కలయికతో నిర్వాహకులు మొహర్రం వేడుకలకు ముగింపు పలికారు. సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ వసతులను కల్పించారు. నారాయణపేట ఎస్పీ డాక్టర్‌ చేతన భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ మధుసూదన్‌రావు, మక్తల్‌ సీఐ శంకర్‌, ఎస్సై రషీద్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు.

కోయిలకొండలో బీ ఫాతిమా.. 

కోయిలకొండ: మండల కేంద్రంలో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున ప్రభుత్వం నుంచి తాసిల్దార్‌ కార్యాలయం ద్వారా బీ ఫాతిమా పీరుకు సర్కార్‌ చక్కెరను తాసిల్దార్‌ పాండు, సర్పంచ్‌ కృష్ణయ్య, గ్రామపెద్దలు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీ ఫాతిమా పీరును ఖిల్లా కోట నుంచి గ్రామంలో ఊరేగించారు. పాత పోలీస్‌స్టేషన్‌ వద్ద అగ్నిగుండం జరిపించారు. అనంతరం బీ ఫాతిమా పీరును ఉషన్‌పాషా, చాన్‌దూల, గండెల్‌, డాల్‌ సాబ్‌ పీర్ల కలయిక ఆకట్టుకున్నది. సాయత్రం పీర్లు కోయిలకొండ చెరువులో నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించిన పీర్ల పండుగ ఆదివారంతో ముగిసింది. మండలంలోని పార్‌పల్లిలో పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు.