ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Aug 19, 2020 , 02:49:24

వరద పోటు

వరద పోటు

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. జూరాల ప్రాజెక్టు 39 గేట్లను ఎత్తి 3,14,464 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మంగళవారం ఇన్‌ఫ్లో 3,36,500, అవుట్‌ఫ్లో 3,35,396 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులకుగానూ ప్రస్తుతం 1042.060 అడుగులకు చేరింది. సామర్థ్యం 9.6 టీఎంసీలు ఉండగా.. 8.810 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పవర్‌హౌస్‌కు 18,907 క్యూసెక్కులు విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. కుడి, ఎడమ, సమాంతర కాలువలతో పాటు ఎత్తిపోతల పథకాలకూ నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,66,935 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2,51,922 క్యూసెక్కులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగుకులకు ప్రస్తుతం 1700.52 అడుగులకు చేరింది. సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా.. 106.52 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్‌ ఇన్‌ఫ్లో 2,44,408, అవుట్‌ఫ్లో 2,72,217 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1615 అడుగుకుగానూ ప్రస్తుతం 1607.45 అడుగులు చేరింది. సామర్థ్యం 37.64 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 27.87 టీఎంసీలు ఉన్నాయి. 

తుంగభద్ర 28 గేట్ల ద్వారా..

అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం 28 గేట్లు రెండు అడుగులు ఎత్తి 77,044 క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో ఆర్డీఎస్‌ వైపు పరుగులు పెడుతున్నది. శివమొగ్గ జిల్లాలోని తుంగ డ్యాం నుంచి 38,916 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో టీబీ డ్యాంలోకి ఇన్‌ఫ్లో 77,044, అవుట్‌ఫ్లో 77,044 క్యూసెక్కులుగా నమోదైంది. 100.86 టీఎంసీల సామర్థ్యం గల డ్యాంలో ప్రస్తుతం 98.240 టీఎంసీలు నిల్వ ఉండగా.. 1633 అడుగుల నీటిమట్టానికిగానూ 1632.32 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. 

ఆర్డీఎస్‌ ఆనకట్టకు భారీగా..

అయిజ : టీబీ డ్యాం నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో కర్ణాటకలోని రాజోళి బండ డైవర్సన్‌ స్కీం (ఆర్డీఎస్‌)కు వరద పోటెత్తుతుతోంది. మంగళవారం ఆనకట్టకు 41,318 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 41 వేల క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన పారగా.. ఆయకట్టుకు 383 క్యూసెక్కులు విడుదల చేసినట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం 11 అడుగుల మేర నీటిమట్టం నిల్వ ఉందన్నారు. తుంగభద్ర నదికి వరద పోటెత్తడంతో అయిజ మండలం పులికల్‌ గ్రామ సమీపంలోని నాగల్‌దిన్నె వంతెన వద్ద వరద ఉధృతి పెరిగింది. 

సుంకేసులకు 44వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

రాజోళి : సుంకేసుల బ్యారేజీకి మంగళవారం ఇన్‌ఫ్లో పెరిగింది. ఎగువ నుంచి 44 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. పది గేట్లను తెరిచిన అధికారులు 43వేల క్యూసెక్కులను దిగువన విడుదల చేశారు. కేసీ కెనాల్‌కు 1100 క్యూసెక్కులు విడుదల చేసినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

శ్రీశైలం @ 877.50 అడుగులు

శ్రీశైలం : శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి వేగంగా పెరుగుతున్నది. మంగళవారం సాయంత్రానికి జూరాల నుంచి 3,14,239 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 42,070 క్యూసెక్కులు, హంద్రి నుంచి 117 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా.. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ ప్రస్తుతం 877.50 అడుగులకు చేరింది. 215.807 టీఎంసీల సామర్థ్యం కాగా.. ప్రస్తుతం 175.9226 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రానికి 40,259 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 6 యూనిట్ల ద్వారా 43,162 క్యూసెక్కుల నీటిని వినియోగించి 20.782 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు చీఫ్‌ ఇంజినీర్‌ మేక ప్రభాకర్‌రావు తెలిపారు. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఏడు జనరేటర్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తు 35వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు చీప్‌ ఇంజినీర్‌ నర్సింహారావు తెలిపారు.

కోయిల్‌సాగర్‌కు తగ్గిన వరద 

దేవరకద్ర రూరల్‌ : కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద తగ్గింది. 800 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదవుతుండటంతో మంగళవారం రెండు గేట్ల ద్వారా 800 క్యూసెక్కులు.. తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక్క గేటు ద్వారా 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు డీఈ రవిందర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నీటినిల్వ (2.23 టీఎంసీలు) 32.4 అడుగులుగా నమోదైనట్లు పేర్కొన్నారు. 

VIDEOS

logo