ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Gadwal - Aug 10, 2020 , 03:38:10

కృష్ణా నీటి వాటాను వదులుకోం

  కృష్ణా నీటి వాటాను వదులుకోం

  • ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం

ఇటిక్యాల : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కృష్ణానదిలో తెలంగాణ రాష్ట్ర నీటివాటా కేటాయింపులో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం తేల్చి చెప్పారు. జోగుళాంబ గ ద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొం డేర్‌ గ్రామంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృ ష్ణా, గోదావరి నదిలో ఇరిగేషన్‌ వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సింహభాగం నిధులను నీటి పారుదల రంగానికే కేటాయించిందని తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పేరుతో శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను తరలించుకుపోయేందు కు కుట్ర పన్నుతున్నదని చెప్పారు. ప్రాజెక్టులో నీటిమట్టం 854 ఫీట్లకు దిగువన ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా చుక్క నీరు తీసుకోకూడదనే నిబంధన ఉన్నా.. 850 ఫీట్లు నిల్వ ఉన్నప్పుడే నీటిని తరలించేందుకు సిద్ధమవుతున్నదని ధ్వజమెత్తారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేయడం, అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణా రివర్‌ అథారిటీలోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో కేంద్ర జలవనరుల శాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. ప్రభుత్వం ఇంతా చేస్తున్నా కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం పసలేని వాదనలు చేయడం సరికాదన్నా రు. గతంలో వైఎస్‌ఆర్‌ పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయినప్పుడు ఏమాత్రం స్పందించని నేతలు, హంద్రీనివా ప్రాజెక్ట్‌కు హారతులిచ్చిన వారు నేడు అర్థం పర్థం లేని వాదనలతో ప్రజల దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, వారి ముందు చులకనయ్యే చేష్టలను ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. సమావేశంలో మంద శ్రీనాథ్‌, రామిరెడ్డి, బలరాం, అంజి వీరన్న, యోహాన్‌ పాల్గొన్నారు.


logo