మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Gadwal - Aug 03, 2020 , 03:58:59

స్వచ్ఛ పల్లెలే లక్ష్యం

స్వచ్ఛ పల్లెలే లక్ష్యం

గద్వాల : స్వచ్ఛపల్లెలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన పడకుం డా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందు లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కం పోస్ట్‌ షెడ్డు నిర్మిస్తుంది. ఒక్కో షెడ్డు రూ.2.50లక్షల వ్యయంతో నిర్మిస్తుంది. వీటితో పాటు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు సేంద్రియ ఎరువులు అందించడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఈ షెడ్ల నిర్మాణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్నారు. జిల్లాలో 255  పంచాయతీలు ఉండగా అందులో 249 పంచాయతీలకు అనుమతులు మంజూరు చేశారు. ఇందులో 222 పంచాయతీల్లో ప నులు మొదలు కాగా సుమారు 70 పంచాయతీల్లో పనులు పూర్తై  ప్రారంభా నికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా ఉండడమే కాకుండా గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపించే అవకాశం ఉండదు.

ఇంటింటి నుంచి చెత్త సేకరణ..

గ్రామాల్లోని ప్రజలకు ఆరోగ్యమైనా జీవితాన్ని అందించడానికి సేంద్రియ ఎరువులు తయారు చేసే షెడ్లను ప్రభుత్వం నిర్మిస్తుంది.గ్రామ పంచాయతీలోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి వాటిని గ్రామాలకు దూరంగా నిర్మించిన కంపోస్ట్‌ ఎరువుల షెడ్డుకు తరలిస్తారు. సేకరించిన చెత్తను తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీ ఒక ట్రాక్టర్‌ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ ట్రాక్టర్ల ద్వారా ప్రతి రోజు ఉదయం ఇండ్ల్ల నుంచి చెత్తను సేకరించనున్నారు. సేకరించిన చెత్తలో తడి చెత్తను కంపోస్ట్‌ ఎరువుగా మార్చనున్నారు. షెడ్డులో పొడి చెత్తలోని వివిధ రకాల ఘన వస్తువులను వేరు చేయనున్నారు.  షెడ్ల నిర్మాణంలో ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. ఘన వ్యర్థాలు నిల్వ చేయడం కోసం షెడ్డులో ప్రత్యేక ర్యాక్‌లు ఏర్పాటు చేశారు.

పనులు వేగంగా జరుగుతున్నాయి

జిల్లాలో కంపోస్టు షెడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో 249 పంచాయతీలకు అనుమతులు లభించగా ఇప్పటి వరకు 222పంచాయతీల్లో పనులు ప్రారంభం కాగా ఇందులో సుమారు 70 వరకు పూర్తయ్యాయి. మిగతా గ్రామాల్లో కలెక్టర్‌ ఆదేశాల మేరకు త్వరలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఆ దిశగా గ్రామ పంచాయతీల్లో పనులు జరుగుతున్నాయి.

- ముసాయిదాబేగం జెడ్పీసీఈవో, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణ  ప్రత్యేక అధికారిlogo