మంగళవారం 02 మార్చి 2021
Gadwal - Aug 03, 2020 , 03:36:44

రాఖీ పుష్పాలు

 రాఖీ పుష్పాలు

 ఏమి అన్న ఎట్లున్నవు.. ఫైలమేనా.. అంతబాగానే కదా.. గీ తూరు రాఖీ కడుదామని ఊరొద్దామనుకుంటే గీ కరోనా మాయరోగం వచ్చి పడే.. ఏమీ అనుకోవద్దన్న రాలేకపోతున్న.. అరే గదేమి చెల్లి నీవు రాకుంటే ఏందిరా.. నీ ఆశిస్సులు ఉండాలే గాని గీసోంటి ఎన్ని మాయరోగాలు వచ్చినా మమ్ములను ఏం చేయలేవులే తల్లి.. నీవు ఫైలంగా ఉండు అంతే చాలు..  అంతెందుకురా గిప్పుడు అంత కూడా ఫోన్ల ద్వారా నడుస్తున్నయి కదా.. గీ సారి రాఖీ పండుగను మనం కూడా ఫోన్‌ ద్వారా చేసుకుందాం ఇంకేముంది చెల్లి.. అయితే అనవసరంగా బయట తిరుగమాకు.. మూతికి రుమాలు కట్టుకో.. అధికారులు చెప్పే జాగ్రత్తలు పాటించు.. పానంకన్న ఏదీ ముఖ్యం కాదు.. అందరూ మంచిగుంటే వచ్చే ఏడాది మంచిగా జరుపుకొందాం.. అంటూ ఈ ఏడాది కరోనా వైరస్‌ నేపథ్యంలో అక్కడక్కడ వినిపిస్తున్నాయి గీ మాటలు..

   - గద్వాల టౌన్‌

కాలం మారినా.. దూరం పెరిగినా.. చెరగని బంధం రక్త సంబంధం.. అదే అన్నా చెల్లెళ్ల అనుబంధం. అక్కాతమ్ముళ్ల అనురాగాలకు.. అన్నా చెల్లెళ్ల ఆప్యాయతకు ప్రతీక రాఖీ పండుగ. జీవితంలో తమకు ఎల్లవేళలా రక్షణగా ఉండాలని, సాధక బాధల్లో తోడుగా నిలువాలని అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టడం నాటి పురాణాల నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తున్నది. ఏడాదిపాటు ఎంత బిజీగా ఉన్నా రాఖీ పౌర్ణమి నాటికి అక్కాచెల్లెళ్లు ఇంటికి వచ్చే సమయానికి సోదరి రాకకు ఎదురుచూస్తుంటారు అన్నదమ్ములు. ఎప్పుడూ పుట్టింటికి వెళ్లని ఆడపడుచులు సైతం పయనమవుతారు. కానీ కరోనా భయం అందరినీ వెంటాడుతున్నది. తాము ఎక్కడున్నా తమ అన్నదమ్ములు చల్లంగా, క్షేమంగా ఉండాలని ఈ ఏడాది ఆడపడుచులు కోరుకుంటున్నారు. కొందరు కొరియర్స్‌, పోస్ట్‌ ద్వారా రాఖీలు పంపుతున్నారు. మరికొందరు తమకు తెలిసిన వారికి రాఖీలు ఇచ్చిపంపుతున్నారు. ఫోన్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు.

మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతడితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మీ వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధన్‌ కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుపోతుందనేది పురాణాలు చెబుతున్నాయి.

చరిత్ర నేపథ్యం

గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ ప్రపంచాన్ని జయించాలని మొదటగా పశ్చిమ దిశన భారతదేశంవైపు బయలుదేరి దండయాత్ర చేస్తాడు. మధ్య ఆసియా ప్రాంతంలోని బక్రీం ప్రస్తుత అప్ఘనిస్తాన్‌ క్రీ.పూ 326లో తక్షశీలను పరిపాలిస్తున్న పురుషోత్తముడు యుద్దంలో అలెగ్జాండర్‌తో వీరోచితంగా పోరాడుతున్న సందర్భంలో అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన సోదరునిగా భావించి రాఖీ కడుతుంది. నాటినుంచి ఉత్తర, పశ్చిమ భారతదేశంలో విశేషంగా రక్షాబంధన్‌ జరుపుకొనేవారు. నేడు భారతదేశ వ్యాప్తంగా ఈ పండుగకు ఎంతో విశిష్ఠత ఉంది. 

రక్షాబంధన్‌

నాకు నువ్వు రక్ష.. నీకు నేను రక్ష.. దేశానికి మనమందరం రక్ష. అమ్మలో సగం అ, నాన్నలో సగం న్న.. అన్న చిరకాలం తోబుట్టువుకు చేదోడువాదోడుగా ఉండేందుకే రక్షాబంధన్‌ నిర్వహిస్తారు. 

ఆకట్టుకుంటున్న రాఖీలు

ఈ ఏడాది అనేక రాఖీలు వివిధ డిజైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. పూజా సామగ్రితో కూడిన రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గతంలో కట్టుకునే పువ్వుల రాఖీలు మళ్లీ మార్కెట్లో సందడి చేశాయి. అలాగే నూలు, ఉన్ని రాఖీలు కూడా అందుబాటలో ఉన్నాయి. ఒక్కో రాఖీ డిజైన్‌ను బట్టి రూ.5 నుంచి 200వరకు ధరలు ఉన్నాయి. 

జోరుగా విక్రయాలు

ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో రక్షాబంధన్‌ విక్రయాలు జోరందుకున్నాయి. ఈ ఏడాది నూతనంగా దూది, పత్తితోపాటు పిల్లలను ఆకట్టుకునే చోటాభీమ్‌, హనుమాన్‌జీ, డోరాబుజ్జి లాంటి కార్టూన్‌ బొమ్మలతో కూడిన రాఖీలు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. పిల్లలు కార్టున్‌, పోగో చానల్‌లో చూసిన ప్రతిమలను కొనేందుకు ఇష్టపడుతున్నారు. యువతకు నెమలి ఇతరత్రా రాఖీలు ఆకట్టుకునే విధంగా దర్శనమిస్తున్నాయి. మరికొంత ఆర్థిక స్థోమత ఉన్నవారికి రూ.400 నుంచి రూ.1000 దాకా బ్రేస్‌లెట్‌ రాఖీలు మార్కెట్‌లో లభించనున్నాయి. ఆదివారం, సోమవారం మరింత విక్రయాలు జోరందుకోనున్నాయి. 


VIDEOS

logo