ఆదివారం 07 మార్చి 2021
Gadwal - Aug 01, 2020 , 08:21:10

ప్రతి ఎకరాకు 4 వేల మొక్కలు నాటాలి

ప్రతి ఎకరాకు 4 వేల మొక్కలు నాటాలి

l కలెక్టర్‌ శృతి ఓఝా

మల్దకల్‌ : హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో  ఎకరా ప్రభుత్వ భూమిలో పల్లె ప్రగతి కింద ప్రకృతి వనం ఏర్పాటు చేసేలా ప్రభుత్వం సంకల్పించిందని దీని ఏర్పాటు బాధ్యతలు సర్పంచులు  తీసుకోవాలని కలెక్టర్‌ శృతిఓఝా సూచించారు. శుక్రవారం పెద్దతండా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం కార్యక్రమంలో కలెక్టర్‌  పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రకృతి వనంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత సర్పంచ్‌దే అన్నారు. అలాగే నాటిన ప్రతి మొక్కనూ వరుస క్రమంలో నాటాలన్నారు. మొక్కలు పెరిగి పెద్దవై గ్రామస్తులకు ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పేలా క్రమ పద్ధతిలో మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఎకరాకు 4 వేల మొక్కలు నాటాలని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్డు వివరాలు, డంపింగ్‌ యార్డు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వైకుంఠ ధామం పనులు దాదాపుగా పూర్తయిందని త్వరలోనే పూర్తి చేస్తామని సర్పంచ్‌ వివరించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం అధికంగా ఉన్నందున ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ వ్యాధిని అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ ఉమాదేవి, డీపీవో కృష్ణ, సర్పంచ్‌ తాన్యానాయక్‌, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.


VIDEOS

logo