సోమవారం 08 మార్చి 2021
Gadwal - Jul 29, 2020 , 03:17:40

రైతుల ఇంట పథకాల పంట

రైతుల ఇంట పథకాల పంట

సేంద్రియ సాగుపై శిక్షణ

తెలంగాణ ప్రభత్వం రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ సేంద్రియ ఎరువుల తయారీకి కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్నది. అందులో భాగంగా రాయితీపై జీలుగ, పిల్లిపెసర, జనుము, తదితర విత్తనాలు అందిస్తున్నది. వీటినే పొలాల్లో సేంద్రియ ఎరువులుగా వాడి సాగు చేసే పద్ధతులు తెలియజేస్తున్నది. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి అయ్యే ప్రతి గింజా ఆరోగ్యకరమైనది.

పంటల బీమాతో ధీమా

బీమాతో అకాల పరిస్థితుల వల్ల వచ్చే పంట నష్టం నుంచి రైతులు కోలుకునేందుకు పంట బీమా పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. అధికారులు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని పంటలకు బీమా కల్పిస్తారు. బీమా చేసుకోవడం వల్ల పంటలను కోల్పోయిన సందర్భాల్లో నష్టం కొంత వరకు పూడ్చుకోవచ్చు. పంటలు పూర్తిగా దెబ్బతిని దిగుబడి తక్కువగా వస్తే ఈ పథకం వర్తిస్తుంది.

విత్తనోత్పత్తి

రైతులే తమ విత్తనాలు స్వయంగా విత్తనోత్పత్తి చేసుకొనే ఈ పథకం తీసుకొచ్చింది. వ్యవసాయశాఖ అధికారులు ఎంపిక చేసిన రైతులకు 50శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తారు. రైతు సంఘాల ద్వారా పంట సేకరించిన తర్వాత వాటిని వ్యవసాయ శాఖ అధికారులు శుద్ధి చేయించి అదే గ్రామంలో రైతులకు తక్కువ ధరకు విత్తనాలను అందిస్తారు. అలాగే  తెలంగాణ రాష్ట్ర విత్తనోత్పత్తి కేంద్రం ద్వారా శుద్ధి చేసిన  నాణ్యమైన విత్తనాలు సబ్సిడీ కింద రైతులకు అందజేస్తున్నారు.

యంత్రలక్ష్మి పథకం

నేటి పరిస్థితులకు అనుగుణంగా రోజు రోజుకూ వ్యవసాయంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యాంత్రీకరణ పనిముట్లతో ఖర్చు తక్కువతో అధిక లాభాలను ఆర్జించేందుకు రైతులకు స్ప్రేయర్లు, ట్రాక్టర్లకు వినియోగించే పరికరాలు పైపులు, మోటార్లు, రోటోవేటర్లు, ఇతర చిన్నపాటి యంత్రాలను ఈ యంత్రలక్ష్మి పథకం ద్వారా అందిస్తారు.ఈ పథకం కింద సాగుకు కావాల్సిన యంత్ర పరికరాలను అందిస్తారు. అలాగే చిన్న, సన్నకారు రైతులకు యంత్రాలను అద్దెకు తీసుకొని సాగు చేసుకొనేలా అందుబాటులో తీసుకురానున్నారు. రైతులకు ఆధునిక యంత్రాలు, యంత్ర పరికరాలు, ఆధునిక సాగు పద్ధతులను పరిచయం చేస్తూ.. వాటి వల్ల వచ్చే లాభాలను పథకం ద్వారా వివరిస్తారు. వరి నాటే యంత్రం, డ్రమ్‌ సీడర్‌, నీటి సంరక్షణ కోసం చర్యలు ఇందులో ప్రధానమైనవి. వీటితో సాగు చేసే రైతులకు జింక్‌, డీఏపీ, నుడోమోనాస్‌, వేప నూనె వంటి వాటిని ఉచితంగా అందిస్తారు. 

భూ చేతన పథకం

ఈ పథకంతో పంట సాగుకు ముందు పొలాల్లోని మట్టి నమూనాలు వ్యవసాయ శాఖ అధికారులు సేకరించి భూసారం లోపాలను కనుగొని వాటి లోపలను సరిదిద్దుతారు. దీంతో అవసరమైన మేరకే ఎరువులు వాడి అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందడమే పథకం లక్ష్యం. రైతులకు జీలుగ, జింక్‌, జిప్సం వంటి వాటిని 50 శాతం సబ్సిడీపై రైతులకు ప్రభుత్వం అందిస్తున్నది.

నీటి సమస్యలకు చెక్‌

జాతీయ గ్రామీణ వాటర్‌షెడ్‌ పథకం ద్వారా మెట్ట ప్రాంతాల్లోని పంట పొలాల్లో నీటి నిల్వకు గుంతలను ఏర్పాటు చేయడం ద్వారా నీటి సమస్యను అధిగమించేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. వర్షపు నీటిని నిల్వచేయడానికి ఇవి అనువుగా ఉంటాయి. వీటిపై రైతులకు అవగాహన కల్పించి రైతుల పొలాల్లోని వాలు ప్రదేశాలలో ఈ నీటి గుంతలను ఏర్పాటు చేయిస్తారు. 

పంటపై రుణం 

రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని సరైన ధర వచ్చే వరకు నిల్వ ఉంచేందుకు ప్రభుత్వం గోదాములను నిర్మించింది. రైతులు పండించిన ధాన్యం అందులో నిల్వచేసుకొని తమ పంటకు సరైన మద్దతు ధర వచ్చే వరకు వేచిఉండవచ్చు. అలాగే నిల్వ ఉంచిన ధాన్యం విలువను బట్టి రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు 6నెలల కాలం వరకు వడ్డీ లేని రుణం పొందవచ్చు. నిల్వ చేసిన పంట విలువ పై 75శాతం రుణం పొందే అవకాశం ఈ పథకం ద్వారా రైతులు లబ్ధిపొందవచ్చు.

రైతుబీమాతో ఆసరా

రైతు ఆరుగాలం కష్టపడి పండించే రైతు కుటుంబానికి అండగా నిలిచేందుకు రైతుబీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులు మరణిస్తే  ఆ కుటుంబం రోడ్డుపాలు కావద్దన్న ఆలోచనతో రూ. 5లక్షల బీమా వర్తింపజేస్తుంది. ఒక గుంట పొలం పట్టా ఉన్న రైతుల నుంచి మొదలు..18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలోపు ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.

రైతుబంధుతో భరోసా

రాష్ట్రంలోని పంట పెట్టుబడుల కోసం దళారుల చేతిలో మోసపోవద్దన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏడాదిలో వచ్చే రెండు పంటలకుగానూ రెండు విడుతలుగా ఎకరానికి రూ.5వేల చొప్పున మొత్తం రూ.10వేల పంట పెట్టుబడిని రైతుబంధు పథకం ద్వారా అందిస్తున్నది.

VIDEOS

logo