133 చెరువులకు కృష్ణాజలాలు

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: జోగుళాంబ గద్వాల జిల్లాలో గొలుసుకట్టు చెరువులు రైతులకు వరంలా మారాయి. సీఎం కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన మిషన్‌కాకతీయ పనులు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయి. నెట్టెంపాడు నీటితో జిల్లాలోని గొలుసుకట్టు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. సీఎం ఆదేశాల మేరకు నెట్టెంపాడు నీటిని చెరువులకు విడుదల చేయడంతో గ్రామాల్లోని చెరువులన్నింటికీ నీరు చేరుతున్నది. జిల్లాలోని ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా 103 గొలుసు కట్టు చెరువులను, జూరాల కుడికాలువ ద్వారా 30చెరువులను నింపుతున్నారు. గతేడాది ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా ఆగస్ట్ 13న నీటిని విడుదల చేయగా ఈ సారి 20 రోజుల ముందుగానే జూలై 24 నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో రెండు పంటలకు ఎలాంటి చీకుచింత ఉండదంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నల శ్రేయస్సే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నది. నడిగడ్డ రైతులకు రెండు పంటలకు సరిపడా నీటిని అందించేందుకు జిల్లాలోని 133 గొలుసుకట్టు చెరువులను నింపుతున్నారు.
ఎగువనున్న కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్‌ల నుంచి వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. జూరాల ప్రాజెక్టుకు చేరుకున్న కృష్ణా నీటిని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో నిర్మించిన మూడు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. వరద సమయంలో 90రోజుల పాటు కొనసాగించేందుకు కృష్ణాబోర్డ్ ద్వారా ప్రభుత్వానికి అనుమతులున్నాయి. వరద ఉధృతి ఉన్నప్పుడు రోజుకు 2,250 క్యూసెక్కుల వరకు ఎత్తిపోసేందుకు అవకాశాలున్నాయి. ఈ నీటిని నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లోని అంతర్భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తున్నారు. 4.5టీఎంసీల కెపాసిటీ గల ర్యాలంపాడు రిజర్వాయర్‌కు ఇప్పటి వరకు 2.4 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. అంచనాలకు తగ్గట్టుగా వరద వస్తుండటంతో నెట్టెంపాడు ద్వారా ఎత్తిపోతలను కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్‌కు చేరుకున్న నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా జూలై 24న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లాలోని 103 గొలుసుకట్టు చెరువుల్లోకి విడుదల చేశారు.
సగానికి పైగా నిండిన 20చెరువులు
ర్యాలంపాడు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2.4టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఈ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కెనాళ్ల ద్వారా రోజుకు 575 క్యూసెక్కుల నీటిని చెరువులకు విడుదల చేస్తున్నారు. జూలై 24నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం 104,105,106 ప్యాకేజీల్లోని దాదాపుగా 20 చెరువుల్లోకి సగానికిపైగా కృష్ణానీరు చేరుకుంది. వరద ప్రవాహం ఆశాజనకంగా ఉండటంతో మరో 30 రోజుల్లో జిల్లాలోని అన్ని గొలుసుకట్టు చెరువులకు నీరు చేరే అవకాశాలున్నాయి. వీటితో పాటు సాధారణ వర్షాపాతం నమోదవుతుండటంతో దాదాపుగా అన్ని చెరువులు అలుగుపారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
నెట్టెంపాడు ద్వారా లక్షా 60వేల ఎకరాలను నీరు
చెరువులతో ఆయకట్టు రైతులకు మేలు చేకూరనుంది. 133గొలుసుకట్టు చెరువులు నిండటంతో రెండు పంటలకు సరిపడా నీరు సమృద్ధిగా అందుతుంది. నెట్టెంపాడు ప్రాజెక్ట్ ద్వారా దాదాపుగా లక్షా 60వేల ఎకరాలకు సాగునీరందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నెల రోజుల్లో పూర్తిగా నింపుతాం
గొలుసుకట్టు చెరువుల్లోకి వరద నీటి సరఫరా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 133 చెరువుల్లో 20 చెరువులకు సాగానికిపైగా నీరు చేరుకుంది. మరో నెల రోజుల్లో అన్ని చెరువులను నింపుతాం. ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా ఇప్పటి వరకు 2.4టీఎంసీల నీటిని నెట్టెంపాడు ద్వారా ఎత్తిపోశాం. ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా రోజుకు 575 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా చెరువులకు నీటిని విడుదల చేస్తున్నాం.
- రహీముద్దీన్, నెట్టెంపాడు ఈఈ
తాజావార్తలు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత