శనివారం 06 మార్చి 2021
Gadwal - Jul 26, 2020 , 06:45:56

అడ్డ‌దారులు

అడ్డ‌దారులు

  • రాష్ట్ర సరిహద్దు  చెక్‌పోస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం
  • పుల్లూరు, పంచలింగాల గ్రామాల మీదుగా ప్రయాణాలు
  • ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు
  • లాక్‌డౌన్‌ మొదలు  ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దందా

హోం క్వారంటైన్‌ స్టాంప్‌ నుంచి తప్పించుకునేందుకు అడ‘దారులు’ వెతుకుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో హైవేలను కాదని.. చెక్‌పోస్టుల వద్ద పోలీసుల కంటపడకుండా వాహనదారులు, ప్రయాణికులు పక్కదారుల మీదుగా ప్రయాణిస్తున్నారు. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు ఈ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు వద్ద జాతీయ రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణికులను చేరవేస్తున్నారు. ఏపీలోని కడప నుంచి రూ.3,500 వసూలు చేసి అధికారుల కంటపడకుండా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రావెల్స్‌ నిర్వాహకులు మాత్రం వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు. 

- జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ


హోం క్వారంటైన్‌ ముద్రల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు అడ్డదారుల్లో ప్రయాణిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో హైవేలను వదిలి చెక్‌పోస్ట్‌ల కంట పడకుండా పక్కదారుల గుండా వెళుతున్నారు. రాష్ట్రంలోని పుల్లూరు, ఆంధ్రప్రదేశ్‌లోని  పంచలింగాల గ్రామాల నుంచి రాష్ట్రంలోకి ప్రయాణిస్తున్నారు. లాక్‌డౌన్‌ నాటి నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమానులు ఈ దందాను కొనసాగిస్తున్నారు. కడప నుంచి రూ.3,500 వసూలు చేసి అధికారుల కంటపడకుండా హైదరాబాద్‌కు ప్రయాణికులను చేరవేస్తున్నారు. ఈ మార్గాల గుండా ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు ప్రమాదాలకుగురై ప్రాణాలు కోల్పోతున్నారు. 

దేశంలోని 44వ జాతీయ రహదారి రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా విస్తరించి ఉంది. సుమారు 3,806 కిలో మీటర్లు పొడవు ఉన్న ఈ రహదారిలో హైదరాబాద్‌ నుంచి ప్రయాణికులు కర్నూలు, కడప, బెంగళూరుకు వెళుతుంటారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే రహదారి కావడంతో సరిహద్దుల్లో ఇరు రాష్ర్టాల చెక్‌పోస్ట్‌లతో పాటు టోల్‌ప్లాజాను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నాటి నుంచి రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు ఈ సరిహద్దుల్లో మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం రాష్ర్టాల్లోకి అనుతిస్తున్నారు. 

క్వారంటైన్‌ తప్పించుకునే ప్రయత్నాలు

జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని జాతీయ రహదారిపై పుల్లూరు గ్రామం వద్ద ప్రభుత్వం చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసింది. ఈ చెక్‌పోస్ట్‌లోనే అధికారులు మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ప్రయాణికుడిని తనిఖీ చేసి చేతులపై హోం క్వారంటైన్‌ ముద్రలు వేసి 14 రోజులు ఇంటిలోనే ఉండాల్సిందిగా సూచించి అనుమతించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వైద్యపరీక్షలను, హోం క్వారంటైన్‌ ముద్రలను వేయడం నిలిపివేసి యథావిధిగా ప్రయాణికులను అందిరినీ అనుమతిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రక్రియను కొనసాగిస్తుండటంతో కర్నూలు సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌లో ఏపీ అధికారులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి వైరస్‌ అనుమానితులకు హోం క్వారంటైన్‌ ముద్రలను వేస్తున్నారు. ఈప్రక్రియను తప్పించుకునేందుకు ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌ డ్రైవర్లు సరిహద్దు గ్రామాల ద్వారా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.

కడప నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ దందా

లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి కడప జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు సరికొత్త దందాకు తెరలేపాయి. తెలంగాణ రాష్ట్రంలోకి అధికారుల కంటపడకుండా ప్రయాణికులను చేరవేసేందుకు హైవే పక్క గ్రామాల ద్వారా తరలిస్తున్నారు. కడప నుంచి హైదరాబాద్‌కు ఒక్కో ప్రయాణికుడిని చేరవేసేందుకు రూ.3500 వసూలు చేస్తున్నారు. 8 నుంచి 9 మంది సీటింగ్‌ కెపాసిటీ ఉన్న వాహనాల ద్వారా ప్రతి రోజు రెండు ట్రిప్పుల ద్వారా ప్రయాణికులను నిత్యం రాష్ర్టాల సరిహద్దులు దాటవేస్తున్నారు. ఈ మార్గాన్ని అనుసరించి మరింత మంది ప్రయాణికులు హైవేను వదిలి గ్రామాల గుండా ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. 

ప్రాణాలు కోల్పోతున్న ప్రయాణికులు

చెక్‌పోస్ట్‌లను తప్పించుకునేందుకు హైవేను వదిలి గ్రామాలగుండా ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల సమీపంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఈ విషయం గమనించకుండా సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణికులు వాగుల్లో ప్రయాణాలు చేసి ప్రమాదాలకు గురవుతున్నారు. ఉండవెల్లి మండలంలో పొంగిపొర్లుతున్న వాగులన్నీ తుంగభద్ర నదిలోకి చేరుకుంటాయి. ఈ వాగుల్లో కొట్టుకుపోయిన వారి ఆచూకీలు వెతకడం కూడా కష్ట తరమవుతుంది.  

సరిహద్దు గ్రామాల ద్వారా ప్రయాణాలు

రాష్ట్ర సరిహద్దులో ఉండవెల్లి మండలంలోని పలు గ్రామాల ద్వారా ప్రయాణికులు చెక్‌పోస్ట్‌ను తప్పించుకొని ప్రయాణాలు చేస్తున్నారు.  కర్నూలు నుంచి హైదరాబాద్‌ వైపునకు వస్తుండగా ఉండవెల్లి మండలంలో హైవేను ఆనుకొని మొదటగా పుల్లూరు గ్రామం ఉంటుంది. ఈ గ్రామం దగ్గరి హైవేపైనే ఇరు రాష్ర్టాలకు చెందిన చెక్‌పోస్ట్‌లు ఉన్నాయి. ఈ చెక్‌పోస్ట్‌లను తప్పించుకునేందుకు పుల్లూరు గ్రామంలోకి ప్రవేశించి అక్కడి నుంచి  కలుగొట్ల గ్రామం ద్వారా పోతులపాడు స్టేజీ వరకు వచ్చి అక్కడి నుంచి నేషనల్‌  హైవేకు చేరుకుంటున్నారు. దాదాపుగా 10కిలో మీటర్ల ఈ మార్గం ద్వారా ప్రయాణికులు ఇరు రాష్ర్టాల చెక్‌పోస్ట్‌ల కంటపడకుండా సులభంగా సరిహద్దులు దాటుతున్నారు. ఇక హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్లేందుకు మరో మార్గం  అలంపూర్‌ చౌరస్తా  ద్వారా ఉంది. అలంపూర్‌ చౌరస్తా నుంచి బైరాపురం, బస్వాపురం, పంచలింగాల గ్రామాల మీదుగా కర్నూలుకు  చేరుకుంటున్నారు. ఈ గ్రామాల ద్వారా దాదాపుగా రోజుకు 100కు పైగా వాహనాలు వెళ్తున్నాయి. ఈ మార్గాల గుండా ఇటీవల చాలా వరకు మద్యం వినియోగదారులు తెలంగాణ మద్యాన్ని తరలిస్తూ పట్టబడ్డారు. 

శానా బండ్లొస్తున్నయ్‌

మా ఊళ్ల నుంచి రోజు వందల బండ్లు..కార్లు వస్తున్నయ్‌.. చెక్‌పోస్ట్‌ తప్పించుకునేందుకు ఇట్ల వస్తున్నరు..కొంతమంది కార్లలో వెళ్లేవారు శానా స్పీడ్‌గా పోతున్నరు. ఊళ్ల రోడ్లు కూడా పాడైతున్నాయ్‌. వేరే రాష్ర్టాల బండ్లను మా ఊళ్ల నుంచి రానివ్వొద్దు. పై అధికారులు చర్యలు తీస్కోవాలె.
- రాములమ్మ, జెడ్పీటీసీ, ఉండవెల్లిVIDEOS

logo