శనివారం 27 ఫిబ్రవరి 2021
Gadwal - Jul 19, 2020 , 03:39:12

గ్రీన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలి

గ్రీన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలి

  • రాష్ట్ర పంచాయత్‌రాజ్‌, గ్రామీణాభివృద్ధ్దిశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు
  • కొండేర్‌, గోపల్‌దిన్నె, బీచుపల్లిలో పర్యటన

      గద్వాల/ ఇటిక్యాల/ఎర్రవల్లి చౌరస్తా: ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అధికారులు గ్రీన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలని రాష్ట్ర పంచాయత్‌రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సూచించారు. గద్వాల మండలంలోని వీరాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనంను పరిశీలించి మొక్కలు నాటారు.సెగ్రిగేషన్‌ షెడ్డు, వైకుంఠ ధామం పనులు పరిశీలించారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశం హాల్‌లో జిల్లా కలెక్టర్‌ శృతి ఓఝాతో కలిసి జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రైతు వేదికలు, సెగ్రిగేషన్‌ షెడ్డు, ప్రకృతి వనం, హరితహారం, రైతు కల్లాలు, వైకుంఠధామం నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న వివిధ పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ఎఫ్‌టీవోపూర్తి చేసిన వెంటనే నిధులు ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. ప్రకృతి వనం అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా తగిన స్థలం దొరకకపోతే దొరికినంత స్థలంలోనైనా సరే ప్రకృతి వనం కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో చాలా గ్రామ పంచాయతీల్లో ఈడబ్ల్యూఎస్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అకౌంట్లలో నిధులు వచ్చి ఉన్నాయని వాటిని వెంటనే చెల్లింపులు  జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

అనంతరం మల్దకల్‌ మండలంలోని పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం, కొత్తగా నిర్మిస్తున్న రైతు వేదిక భవనాన్ని పరిశీలించారు. ఇటిక్యాల మండలంలోని కొండేర్‌, గోపల్‌దిన్నె గ్రామాలను ఆయన శనివారం సందర్శించారు. బీచుపల్లి పుణ్యక్షేత్రం నుంచి పుల్లూరు వరకు హైవేకు ఇరువైపులా 15 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.యాక్తపూర్‌ శివారులో జాతీయరహదారి పరిసరప్రాంతంలో  కలెక్టర్‌ శృతిఓఝా, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితతో కలిసి  మొక్కలు నాటారు. కొండేర్‌ గ్రామంలో గత సంవత్సరం ఎన్ని మొక్కలు నాటారు, అలాగే ఈ సంవత్సరం ఎన్ని మొక్కలు నాటారని, వాటిలో ఎన్ని బతికాయని అడిగి తెలుసుకున్నారు. మొక్కల రక్షణకు  వాచ్‌అండ్‌ వార్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నాటడానికి ఎన్ని మొక్కలు  అవసరమో జాబితాను సిద్ధ్దం చేసుకోవాలన్నారు. 

సెగ్రిగేషన్‌ షెడ్‌ నిర్వహణపై అవగాహనకు  సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ శృతిఓఝాను ఆదేశించారు. వైకుంఠధామాలు,సెగ్రిగేషన్‌ షెడ్‌ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉంటే వాటి జాబితాను పంపాలని కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో కృష్ణ, డీఎఫ్‌వో బాబ్జీరావు, జెడ్పీ సీఈవో మూషాయిదాబేగం, ఉద్యానవన అధికారి జయరాజ్‌, డీపీడీ డీఆర్డీఏ ఉమాదేవి, తాసిల్దార్‌ శివలింగం, ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడ్డి, సర్పంచులు వీర న్న, రాధాకృష్ణారెడ్డి,  నర్సమ్మసుధాకర్‌రెడ్డి, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.  


VIDEOS

logo