సోమవారం 01 మార్చి 2021
Gadwal - Jul 16, 2020 , 01:55:05

జూరాల వద్ద నీలవేణి గలగలలు

జూరాల వద్ద నీలవేణి గలగలలు

  • ప్రాజెక్టు 8 గేట్ల ద్వారా నీటి విడుదల 
  • ఇన్‌ఫ్లో 64,000, అవుట్‌ఫ్లో 75,741 క్యూసెక్కులు
  •  ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి
  • ఆల్మట్టి, నారాయణపూర్‌కు కొనసాగుతున్న వరద
  • శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

  ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద జలసరాగం సంతరించుకున్నది. బుధవారం ప్రాజెక్టు గేట్లను తెరవడంతో కృష్ణమ్మ సవ్వడి చేస్తున్నది. ఇన్‌ఫ్లో 64,000, అవుట్‌ఫ్లో 75,741 క్యూసెక్కులుగా నమోదైంది. విడుదలైన నీరు శ్రీశైలం జలాశయానికి పరుగులు పెడుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంల నుంచి వరద వచ్చి చేరుతున్నది. నీలవేణి గలగలలతో జూరాలకు సందర్శకుల తాకిడి మొదలైంది. నదీతీరంలో సెల్ఫీలు దిగుతూ చిన్నాపెద్ద కేరింతలతో  ప్రాజెక్టు పరిసరాల్లో సరదాగా గడిపారు. 

 జోగుళాంబ గద్వాల/నమస్తే తెలంగాణ

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : జూరాలకు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నది. బుధవారం 64 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 75,741 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.336 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఎనిమిది గేట్లను ఎత్తి స్పి ల్‌వే ద్వారా 42,332 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పవర్‌హౌస్‌ ద్వారా 28,749 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. కుడి కాలువకు 285, ఎడమ కాలువకు 700, సమాంతర కాలువకు 800, నెట్టెంపాడు లిఫ్ట్‌కు రెండు మోటార్లు ఆన్‌ చేసి 1500, భీమా లిఫ్ట్‌-1కు 650, భీమా లిఫ్ట్‌-2కు 750, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌కు 630 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్‌లకు వరద కొనసాగుతున్నది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు 27,658 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 46,130 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 94.38 టీఎంసీల నిల్వ ఉన్నది. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు 43,131 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 45,995 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలుండగా ప్రస్తుతం 35.06 టీఎంసీల నిల్వ ఉన్నది. 

తుంగభద్రకు 9,857 క్యూసెక్కుల ఇన్‌ఫ్ల్లో 

అయిజ : కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. టీబీ డ్యాం ఎగువన వర్షాలు తగ్గడంతో తుంగ నదికి వరద స్వల్పంగా చేరుకుంటున్నది. అప్పర్‌ తుంగ ప్రాజెక్టు నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం తుంగభద్ర జలాశయంలోకి 9,857 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 279 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 100.86 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 23.935 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1633 అడుగుల నీటి మట్టానికిగానూ 1603.22 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. 

జూరాలకు  సందర్శకుల తాకిడి

జూరాల ప్రాజెక్టు వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. ఉరక లు వేస్తూ నదిలో పారుతున్న కృష్ణవేణిని తిలకించేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. గేట్లు తెరవడంతో నదిలో పొంగిపొర్లుతున్న కృష్ణమ్మ సుం దర దృశ్యాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివస్తున్నారు. గేట్లను ఎత్తడంతో పర్యాటకులు అక్కడికి చేరుకుని కేరింతలు  కొడుతున్నారు. నది ప్రాంగణంలో సెల్ఫీలు దిగుతూ సోషల్‌మీడియా ద్వారా సంతోషాన్ని పంచుకుంటున్నారు. 

నోరూరించే చేపలు..

ప్రాజెక్టులోకి కొత్తనీరు చేరుకోవడంతో చేపల కోలాహలం మొదలైంది. జూరాలకు వచ్చిన పర్యాటకులు చేపలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో జాలర్లకు చేతి నిండా పని దొరుకుతున్నది. తెప్పల ద్వారా నదిలోకి వెళ్లి చేపలను పట్టుకొస్తున్నారు. తాజా చేపలను కొనుగోలు చేసేందుకు మాంస ప్రియులు క్యూ కడుతున్నారు. అక్కడే వండించుకుని రుచి చూస్తున్నారు. ఇక్కడి చేపల వంటకాలను తినడానికి ఉమ్మడి జిల్లానే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. 


VIDEOS

logo