గురువారం 25 ఫిబ్రవరి 2021
Gadwal - Jul 09, 2020 , 00:29:57

జులాయిగా తిరుగుతున్నాడని భర్తను కడతేర్చిన భార్య

జులాయిగా తిరుగుతున్నాడని భర్తను కడతేర్చిన భార్య

  • అక్కతో కలిసి గొంతుపై తొక్కి చంపిన శంకరమ్మ

గట్టు: జులాయిగా తిరుగుతూ వేధిస్తున్నాడని భర్తను భార్య, వదిన(భార్య అక్క)తో కలిసి పథకం ప్రకారం కడతేర్చిన సంఘటన మండలంలోని బోయలగూడెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనా ఆలస్యంగా బయటకు పొక్కింది. ఈ మేరకు బుధవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. బోయలగూడెంకు చెందిన కుర్వ జంబన్న (45), శంకరమ్మ భార్యాభర్తలు. వీరి ఇంటికి కొద్ది దూరంలో శంకరమ్మ అక్క కిష్టమ్మ నివసించేది. కాగా జంబన్న ఎటువంటి పనులు చేయకుండా జులాయిగా తిరగడం అలవాటు చేసుకున్నాడు.

వ్యసనాలకు అలవాటు పడి తరచూ భార్యను వేధించేవాడు. కొంతకాలం కిందట ఈ వ్యవహారాన్ని భార్య శంకరమ్మ గ్రామ పెద్దలకు చెప్పగా వారు సర్దిచెప్పారు. అయినా జంబన్న పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో విసుగు చెందిన జంబన్న భార్య శంకరమ్మ, ఆమె అక్క కిష్టమ్మతో కలిసి పథకం రూపొందించింది. సోమవారం అర్ధరాత్రి  నిద్రలో ఉన్న జంబన్నను భార్య, ఆమె అక్క గొంతుపై బలంగా తొక్కారు. దీంతో ఊపిరాడక జంబన్న అక్కడికక్కడే మృతిచెందాడు. తెల్లారిన తరువాత శంకరమ్మ తన భర్త జంబన్నది సాధారణ మృతిగా స్థానికులకు చెప్పుకొచ్చింది. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. అంత్యక్రియల ప్రక్రియ ఆలస్యం కావడంతో జంబన్న నోటి నుంచి నురుగురావడం ప్రారంభమైంది.

దీంతో అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. బెంగళూర్‌లో ఉండే జంబన్న అన్న హుస్సేన్‌ మంగళవారం మధ్యాహ్నం తరువాత బోయలగూడెం చేరుకున్నాడు. ఎటువంటి అనారోగ్యం లేని తన తమ్ముడు ఎలా చనిపోయాడంటూ హుస్సేన్‌ కుటుంబ సభ్యులందరినీ నిలదీశాడు. ఈ క్రమంలోనే అన్న కుమారుడు తిమ్మప్ప(15) ను గట్టిగా ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. నాన్నను అమ్మ, పెద్దమ్మ కలిసి గొంతుపై తొక్కి చంపేశారని తిమ్మప్ప తేల్చిచెప్పాడు. ఈ సంఘటనపై హుస్సేన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అక్కడికి చేరుకుని మరింత సమాచారం రాబట్టారు. సీఐ జక్కుల హన్ముంతు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గద్వాల ఏరియా దవాఖానకు తరలించి మృతుడి అన్న హుస్సేన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోగా సీఐ దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్సై మంజునాథ్‌రెడ్డి వెల్లడించారు.


VIDEOS

logo