ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Jul 08, 2020 , 01:10:04

దళారీ వల

దళారీ వల

  • చెరువులపై సేట్‌లదే పెత్తనం..
  • కిలో చేపలు రూ.60కు కొని..రూ.200కు విక్రయం
  • పెత్తందారి తనంతో నష్టపోతున్న జాలర్లు
  • మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న  సర్కారు
  • దళారుల ప్రమేయంతో తగ్గుతున్న లాభాలు 
  • కోట్లాది చేప పిల్లలు విడుదల చేసినా తగ్గని ధరలు   

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: “భూత్పూర్‌ మండలం పోతులమడుగులోని రెండు కుంటల్లో సర్కారు 40వేల ఉచిత చేప పిల్లలను వదిలింది. ఆ కుంటలపై ఓ దళారి కన్ను పడడంతో రూ.40వేలు ఇస్తా..నాకు గుత్తకు ఇవ్వండని అడిగిండు. అయితే గతంలో దళారిని నమ్ముకున్న మత్స్యకారులు ఈసారి మాత్రం అందుకు అంగీకరించలేదు. తమకు తెలంగాణ సర్కారు ఉచితంగా చేప పిల్లలు..మోపెడ్లు, డీసీఎంలు, మినీ ట్రక్కులు, ఐస్‌ ట్రక్కులు, చేపలు పట్టేందుకు పనిముట్లు కూడా ఇచ్చిందని, తామే చూసుకుంటామని తేల్చిచెప్పేశారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో విడుతల వారీగా చేపలు పట్టి విక్రయించారు. సుమారు 4టన్నుల చేపలు రావడంతో రూ. 5.10 లక్షల ఆదాయం వచ్చింది. దళారీకి గుత్తకు ఇస్తే కేవలం రూ.40వేలే వచ్చేవి. సొంతంగా చూసుకోవడంతో 5లక్షలకుపైగా రావడంతో ఆశ్చర్యపోయారు. దళారుల ఆగడాలను పసిగట్టారు. ఇలా ప్రతి చోట జరుగుతున్నది. చెరువులపై దళారుల కన్నేసి ఇటు మత్స్యకారులకు, అటు కొనుగోలు దారులకు లాభం రాకుండా జేబులు నింపేసుకుంటున్నారు. 

26కోట్ల చేప పిల్లలు దళారుల పాలు

మత్స్యకారులకు ఆర్థికంగా లాభం చేకూర్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 2016 నుంచి ఇప్పటి వరకు సుమారు 26 కోట్ల చేప పిల్లలను అందించింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి 10,500 మోపెడ్లు, 750 మినీ ట్రక్కులు, 100 సంచార వాహనాలు, 54 డీసీఎంలు, 11 ఐస్‌ ట్రక్కులు పంపిణీ చేశారు. వలలు, ఇతర పరికరాలు అందించి చేపలు పట్టేందుకు అవకాశం కల్పించారు. అయితే ఇంత చేసినా దళారులు దూరి మత్స్య సంపదను కారుచౌకగా దోచేస్తున్నారు. చాలా చోట్ల వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అడ్వాన్సులు ఇచ్చి రూ. 60కి కిలో చొప్పున కొనుగోలు చేసి మార్కెట్లో రూ. 300 వరకు విక్రయిస్తున్నారు.  

స్థానికులకు చిక్కని చేప

గ్రామాల్లో చెరువుల నిండా చేపలు ఉన్నా.. అక్కడి ప్రజలకు మాత్రం తినడానికి చేపలు దొరకవు. సంతలు, మార్కెట్‌లకు వెళ్లి కొనాల్సి వస్తున్నది. ఎందుకంటే చెరువుల్లో చేపలు పట్టాలంటే సేట్‌ చెప్పాల్సిందే. ఆయన శనివారం రోజు పట్టించి ఆదివారం పట్టణ మార్కెట్‌లకు తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు. దీంతో గ్రామాల్లో చేపలు ఉన్నా ఆ ఊరి ప్రజలకు చేపకూర కరువవుతున్నది. ప్రభుత్వం చేప పిల్లలను వదిలిన చెరువులను కాపాలా కాస్తున్నది మత్స్యకారులు. చేపలు పెరిగి పెద్దయ్యాకా చెరువులపై మాత్రం సేట్ల పెత్తనం.  

ధరలు తగ్గాల్సి ఉన్నా..

సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో లక్ష చేప పిల్లలు వదిలిన దాఖలాలు లేవు. కానీ, సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో 26కోట్లకు పైగా ఉచితంగా చేప పిల్లలను వదిలారు. అయితే గతంలో చేపల లభ్యత ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. గ్రామాల్లోనే చేపలు దొరకడం లేదు. చేపల కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు కోకొల్లలు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే  దళారుల వల్లే అని మత్స్యకారులు అంటున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి.. టోకుగా వాహనాల్లో తరలించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్‌లో తక్కువకు తక్కువ కిలో చేపలు రూ.150 నుంచి 200 పైగానే ఉంటున్నాయి. గరిష్టంగా కిలో రూ.1000ల వరకు ఉంటున్నాయి. పాలమూరులో చేపలు నిల్వ చేసేందుకు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కొంత ఇబ్బందిగా మారుతున్నది. అత్యధికంగా చేపలు దిగుబడి అయిన సమయంలో విక్రయాలు కూడా ఒకేసారి కాకపోవచ్చు. ఈ తరుణంలో చేపల నిల్వ చేసేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు మత్స్యకారులు కోరుతున్నారు. ఇలాంటి వాటికి చెక్‌ చెప్పేందుకు సర్కారు మహబూబ్‌నగర్‌లో రూ.2కోట్లతో అత్యాధునిక హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ను మంజూరు చేసింది. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సొసైటీ ఆధ్వర్యంలో అమ్ముతున్నాం

సంగంబండ రిజర్వాయర్‌లో ప్రభుత్వ ప్రోత్సాహకంతో ఈ ఏడాది తొమ్మిది లక్షల చేపపిల్లలు విడుదల చేశాం. నేరడుగం, ఉజ్జెల్లి, మల్లేపల్లి, సోమేశ్వర్‌బండ, గార్లపల్లి, సంగంబండకు చెందిన 600మంది మత్స్య కార్మికులతో గంగాభవాని చేపల సొసైటీని ఏర్పాటు చేసుకున్నాం. చేపల రకాన్ని బట్టి కిలోకు రూ. 50 నుంచి రూ.100వరకు అమ్ముతున్నాం. కొనుగోలుదారులు, వ్యాపారులు రిజర్వాయర్‌ వద్దకే వచ్చి చేపలు కొనుగోలు చేస్తున్నారు. రూ.10లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

- తిప్పన్న, గంగాభవాని, చేపల సొసైటీ అధ్యక్షుడు, నేరడుగం

ఎక్కువగా పెంచుతున్నారు 

ప్రభుత్వం సామాన్యులకు చేపలు అందుబాటు ధరలో ఉంచాలని మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు అందించింది. చెరువుల్లో చేపలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. మత్స్యకారులు చేపలను మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుండగా.. మధ్య దళారులు ధరలను అమాంతం పెంచుతున్నారు. దీంతో సామాన్యులు చేపలు తినే పరిస్థితి లేకుండా పోతుంది. ప్రభుత్వం నేరుగా చేపల మార్కెట్లను ఏర్పాటు చేసి విక్రయిస్తే బాగుంటుంది.

 - తిమ్మప్ప, పులికల్‌, అయిజ మండలం 

ధరలు తగ్గడం లేదు

మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగాలని రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా ఇచ్చి, సబ్సిడీపై వాహనాలు పంపిణీ చేసింది. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో ఉచితంగా వదిలిన చేపల ధరలు మాత్రం తగ్గడం లేదు. సామాన్యులు చేపలు విక్రయించలేకపొతున్నారు.

- దస్తగిరి, పెబ్బేరు

లూనా ఇచ్చినా లాభం లేదు

తెలంగాణ ప్రభుత్వం చేపల విక్రయించాలనే ఉద్దేశంతోనే నాకు లూనా ఇచ్చింది. ఇక్కడి చేపలను పెద్ద పెద్ద వాహనాల్లో తీసుకుపోతుండ్రు. లోకల్‌గా అమ్ముకుంటామంటే ఇవ్వడం లేదు. సర్కారు అండగా ఉన్నప్పటికీ చేపల విక్రయంలో కొంత ఇబ్బందిగా ఉంది. పెద్ద చెరువుల నుంచి చేపలు మత్స్యకారులకు విక్రయిస్తే ఉపాధి ఉంటుంది. పల్లె ప్రజలకు సైతం తక్కువ ధరకు అందుతాయి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- వీరప్ప, మత్స్యకారుడు, పెద్దదర్‌పల్లి, హన్వాడ మండలం

సర్కారు అండగా నిలిచింది

మాకు ఉపాధి చూపాలని గతంలో ఏ సర్కారు చూడలేదు. మేమే డబ్బులు ఖర్చు చేసి చేప పిల్లలను చెరువుల్లో విడిచే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం చాలా మేలు చేస్తుంది. ఇతర రాష్ర్టాలకు మన చేపలు పోతున్నాయి. అందుకే ఇక్కడ ధరలు తగ్గడం లేదు. కొంతైనా తగ్గిస్తే తక్కువ ధరకు దొరుకుతాయి. 

- భీమప్ప, మత్స్యకారుడు, కోడూరు, మహబూబ్‌నగర్‌రూరల్‌

గిప్పుడిప్పుడే నీళ్లొస్తున్నాయి..

చెరువులు, కుంటలు గిప్పుడిప్పుడే నిండుతున్నాయి. గతంలో చెరువులు నిండలేదు. చేపల పెంపకంలో మం చి లాభాలు ఉంటాయి. అమ్మే సమయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మధ్యవర్తులు కొనుగోలు చేసి ఇష్టానుసారంగా అమ్ముకుంటుండ్రు. మత్స్యకారులకు ఉపయోగం ఉండేలా, మంచి లాభాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. 

- ఆంజనేయులు, మత్స్యకారుడు, హన్వాడ మండలం

రూ. 2.80 లక్షల అప్పుంది

మా గ్రామంతోపాటు, సంకలమద్ది, మూసాపేటకు చెందిన మత్స్యకారులం ఒకే సంఘంలో ఉన్నాం. మా పెద్దల నాటినుంచి సంఘం పేరున రూ.2.80 లక్షల అప్పుంది. ఆ అప్పు మహబూబ్‌నగర్‌కు చెందిన సెట్‌ ఇచ్చిండంట. దీంతో మేము ఆయనకు చేపలు పట్టిస్తున్నాం. అందుకు కిలోకు రూ.60 చొప్పున అప్పుకింద జమ చేసుకుంటున్నాడు. ఆ అప్పు తేరితే మా గ్రామాల్లోనే చేపలు పట్టి అమ్ముకునే అవకాశం ఉంది. 

- శ్రీనివాసులు, మత్స్యకారుడు, నిజాలాపూర్‌, ముసాపేట మండలం

దళారుల జోక్యం లేకుండా..

తెలంగాణ సర్కారు వచ్చాక సీఎం కేసీఆర్‌ దళారీ వ్యవస్థను ఆపేందుకు చేప పిల్లలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం మత్స్యకారులు సొంతంగా చేపలు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దళారీ వ్యవస్థకు ఇప్పుడిప్పుడే బ్రేకులు పడుతున్నాయి. దళారులకు చేపలు విక్రయిస్తే ఆ సంఘాలపై నిషేధం విధిస్తామని చెప్పాం. గ్రామాల్లో అమ్మిన తర్వాతే ఇతర ప్రాంతాలకు వెళ్లి విక్రయించాలని చెబుతున్నాం. త్వరలో పాలమూరులో అత్యాధునిక హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ రాబోతున్నది. దీంతో చేపలను ఏసీ గోదాంలో నిల్వ ఉంచేందుకు అవకాశం ఉంటుంది. మత్స్యకారులను మోసం చేస్తే దళారులపై కేసులు పెడుతాం. 

- ఎం సత్యనారాయణ, మత్స్యసహకార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

VIDEOS

logo