సోమవారం 01 మార్చి 2021
Gadwal - Jul 06, 2020 , 07:43:08

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

గద్వాలటౌన్‌: జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం గురుపౌర్ణమిని పుర్కరించుకుని జిల్లా కేంద్రంలో ని రాజవీధిలోగల సాయిగీతా మందిరంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గద్వాల కోటలో వెలసిన భూలక్ష్మీచెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక రథంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అలాగే నదీఅగ్రహారం , శంభునాథ మఠంలోని దత్త ఆలయాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నదీ హారతి..

గురుపౌర్ణమిని పురస్కరించుకుని నదీఅగ్రహారంలోని కృష్ణాతీరాన పురోహితులు, వీహెచ్‌పీ కార్యకర్తలు, పూర్ణ నదీహారతి సేవా సంఘం ఆధ్వర్యంలో నదీహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు పూజలు నిర్వహించి వాయనం సమర్పించారు. 

 మార్మోగిన సాయి నామస్మరణ

అయిజ : పురపాలికలో సాయి నామస్మరణ మార్మోగింది. ఆదివారం గురుపౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా, అయ్యప్పస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం సాయిబాబాకు మేలుకొలుపు, హారతి, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, విశేషపూజలు చేసిన వేద పండితులు భక్తులకు సాయిబాబా దర్శనం కల్పించా రు. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని పూజ లు చేశారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా, అయ్యప్పస్వామి ఆలయాలను భక్తులు దర్శించుకుని పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.

 కనుల పండువగా సాయిబాబాకు పల్లకీ సేవ 

గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా ఆలయంలో సాయిబాబాకు పల్లకీ సేవను కనుల పండువగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో సాయిబాబా ఉత్సవ విగ్రహాన్ని ఆశీనులను చేసి బాజా భజంత్రీలు, మేళతాళాల మధ్య, భక్తులు సాయి కీర్తనలు ఆలపిస్తుండగా సాయిబాబా పల్లకీలో విహరించాడు.

శాకాంబరి దేవీ అలంకరణలో.. 

అయిజ పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవీ శాకాంబరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కూరగాయలతో  అలంకరించారు. కార్యక్రమం లో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. 

వడ్డేపల్లి మండలంలో..

వడ్డేపల్లి : మండలంలోని జూలేకల్‌ స్టేజీలోని సాయిబాబా ఆలయంలో, శాంతినగర్‌లోని వాసవీ ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాసవీ ఆలయంలో గోవిందనామ పారాయణం, హనుమాన్‌ చాలీసా పారాయణం చేశారు.

ఉండవెల్లి మండలంలో..

ఉండవెల్లి : మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలోని సాయిబాబా ఆలయంలో, బైరాపురం గ్రామంలోని రాజరాజేశ్వరి దేవి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు పంచామృతాలతో అభిషేకాలు, మహా మంగళహారతి చేశారు. నిత్యభావన ఆశ్రమం స్వామి శ్రీవిద్య శిష్యబృందం ఆలయాల్లో భజన కార్యక్రమాలు నిర్వహించారు.

VIDEOS

logo