ఆదివారం 09 ఆగస్టు 2020
Gadwal - Jul 05, 2020 , 02:40:39

నేడు గురుపౌర్ణమి

నేడు గురుపౌర్ణమి

  • వేడుకలకు ఆలయాలు సిద్ధం

గద్వాలటౌన్‌/పెబ్బేరు రూరల్‌/ అయిజ: హిందూ సంస్కృతి,సాంప్రదాయాల్లో గురువుకు అగ్రతాంబూలం ఇచ్చారు..తల్లి తండ్రి తరువాత గురువునే పూజిస్తారు..ఆ తరువాతనే దేవుడిని కొలుస్తారు... సాక్షాత్తు పరబ్రహ్మతో సమానంగా గురువును గౌరవిస్తారు.. శ్రీ రామచంద్రుడు అంతటి వాడే గురువుతో విద్యనభ్యసించాడంటే గురువుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ఇట్టే అర్థమవుతుంది..గురువు లేనిదే జగత్తు లేదన్నది అక్షర సత్యమని చెప్పక తప్పదు..అంతటి ప్రాధాన్యత ఉన్న గురువును కొలిచేందుకు ఓ శుభదినం కావాలి కదా అదే గురుపౌర్ణమి..దీనినే వ్యాస పౌర్ణమి అని కూడ అంటారు...అందుకే నేటి తరం గురువును ఆరాధ్య దైవంగా కొలుస్తూ తరిస్తున్నారు..అందులో..వేదవ్యాసుడు... గురు దత్తాత్రేయుడు...శ్రీ గురు రాఘవేంద్రస్వామి..శ్రీ షిరిడి సాయిబాబ...ఇలా ఎందరినో తమ గురువులుగా కొలుస్త్తూ ఆరాధిస్తున్నారు..

‘గురు’ అనే సంస్కృత పదంలో ‘గు’ అంటే అజ్ఞానమనే చీకటి అని ‘రు’ అంటే  తొలగించే వాడని, అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు గురువని అర్థం. అష్టదశ పురాణాలను భావితరాలకు అందించిన వాడు వ్యాసుడు. వ్యాస మహర్షి జన్మించింది ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు. అందుకే ఈ పౌర్ణమిని వ్యాసపౌర్ణమి అని కూడ అంటారు. బడుల్లో పాఠాలు చెప్పే వారిని మాత్రమే గురువుగా సంభోదించడం పరిపాటి. కాని సిద్ధపురుషులను, కారణ జన్ములను, జీవిత సారాన్ని అందించిన వారిని మాత్రమే గురువులుగా భావిస్తారు. అందుకు వ్యాస మహర్షి నిదర్శనం. 

గురుపౌర్ణమి నేపథ్యం

మహాభారతం ద్వారా జగద్గురువుగా ప్రసిద్ధి చెందారు వ్యాసమహర్షి. వేదాలను విభజించి  వేద వ్యాసుడుగా కీర్తి గడించారు. అజ్ఞానమనే అంధకారం తొలగించి విజ్ఞానమనే వెలుగును ప్రసాదించే వారు సద్గురువు అంటువంటి సద్గురువులకు గురువుగా వ్యాసమహర్షి నిలిచారు. ఆయన ఉన్నతిని మననం చేసుకుంటూ మహర్షి జన్మించిన ఆషాఢ పూర్ణిమ రోజు వ్యాస భగవానుడి జయంతిని గురుపౌర్ణమి పేరుతో నిర్వహించుకోవడం ఆనవాయితి. అదే ఆనవాయితీని నేటికీ కొనసాగిస్తున్నారు.

వ్యాసుడి బాటలోనే..

వేద వ్యాసుడు నుంచి గురు రాఘవేంద్రుడి వరకు, దత్తాత్రేయుడు నుంచి సాయిబాబ వరకు, ఆదిశంకరాచార్య నుంచి రమణ మహర్షి వరకు ఇలా ఎందరో సద్గురువులు జనాలలోని అజ్ఞానాన్ని తొలగించి వెలుగు నింపేందుకు సద్గురువు వేద మహర్షి బాటలో పయనించిన వారే. వారందరిని మననం చేసుకుంటూ గురు పౌర్ణమి నాడు గురుసేవ చేయడం సముచితం. 

గౌరవిస్తేనే ఉన్నతి

సంస్కారం నేర్పడమే కాదు ఆచరించేలా శిష్యుడి మనసును నియంత్రించే విదాత గురువు. గురువును గౌరవించినప్పుడే శిష్యుడికి ఉన్నతి లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. గురువులు కూడ ధనార్జనే విద్యను పరమార్థమనే భావనతో కాకుండా నైతిక విలువలను నేర్పించేలా గురువులు కూడ కృషి చేయాలనేదే గురుపౌర్ణమి పరమార్థమని పండితులు చెప్తున్నారు. 

ప్రత్యేక కార్యక్రమాలు

గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయి మందిరాలతో పాటు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ఏ ఆలయాల్లో కూడా ప్రత్యేక హోమాలు కాని అభిషేకాలు నిర్వహించడం లేదని ఆయా ఆలయాలు అర్చకులు వెల్లడించారు. కేవలం దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అదికూడా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటిస్తేనే అనుమతి ఉంటుందన్నారు. 

పల్లకీ సేవకు ఏర్పాట్లు పూర్తి

అయిజ పట్టణంలోని గద్వాల రహదారిలో కొలువుదీరిన సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం ఆలయంలోని సాయినాథుడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటించి దర్శించుకోవాలని ఆలయ కమిటీ తెలిపింది. అయ్యప్ప, సాయిబాబా దేవాలయంలో ఆదివారం సాయంత్రం 6గంటలకు పల్లకీసేవతో వేడుకలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.logo