ఆదివారం 05 జూలై 2020
Gadwal - Jul 01, 2020 , 01:52:36

ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహకం

ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహకం

వీపనగండ్ల : ఆయిల్‌పామ్‌ సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా తెలిపారు. మంగళవారం మండలంలోని రంగవరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, సర్వారెడ్డి పొలంలో ఆయిల్‌పామ్‌ తోటను సాగు చేసేందుకుగానూ వారు మొదటి మొక్కను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క ఎకరాలో 57 ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటుకునేందుకుగానూ సబ్సిడీ పోనూ రూ. 1,539 చెల్లించాలన్నారు. గతేడాది వనపర్తి జిల్లాలో 137 ఎకరాలను గుర్తించగా, మొదటిసారిగా రంగవరం గ్రామంలో మంగళవారం తోటను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వీపనగండ్ల మండలం రంగవరం గ్రామంలో 20 ఎకరాలు, బొల్లారంలో 14 ఎకరాలు, కల్వరాలలో 50 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటల పెంపకానికి అనుకూలమైన భూమిని గుర్తించామన్నారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 400 ఎకరాలు లక్ష్యం పెట్టుకోగా, 250 ఎకరాలను గుర్తించామన్నారు. ఆసక్తి ఉండి పుష్కలంగా నీరున్న రైతులు ఉద్యానవన శాఖ లేదా ఆయిల్‌ఫెడ్‌ వారిని సంప్రదించాలని తెలిపారు. నల్లరేగడి, చౌడు నేలలు తప్ప అన్ని రకాల భూముల్లో ఈ తోటలను సాగుచేయొచ్చన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా రంగవరం సమీపంలోని ప్రభుత్వ భూ మిలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. సంగినేనిపల్లి గ్రామ తుమ్మల చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు బీమా కాలువ నుంచి నీటిని విడుదల చేసేందుకు రైతులు సహకరించాలని కోరారు. మండలకేంద్రంలో ఐదుగురు లభ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి విజయ భాస్కర్‌రెడ్డి, కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, తూంకుంట సింగిల్‌విండో చైర్మన్‌ రామన్‌గౌడ్‌, సర్పంచులు జయప్రద, శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, కృష్ణయ్య, రాకేశ్‌, సహదేవుడు, సత్యనారాయణగౌడ్‌, బాల్‌చంద్రి, సాయిబాబ, పెద్ద రాజు, మల్లయ్య, యాదయ్య, రాము లు తదితరులు పాల్గొన్నారు.


logo