ఆదివారం 07 మార్చి 2021
Gadwal - Jun 21, 2020 , 00:53:39

నకిలీ విత్తన విక్రయదారులపై చర్యలు

నకిలీ విత్తన విక్రయదారులపై చర్యలు

  • కలెక్టర్‌ శృతిఓఝా
  • వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశం

  గద్వాల: పోలీసులు,వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాలో నకిలీ విత్తన విక్రయదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శృతిఓఝా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ రంజన్త్రన్‌కుమార్‌, వ్యవసాయశాఖ అధికారులతో నకిలీ విత్తన విక్రయ దారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు వారిని పట్టుకుని పంచనామా చేయడయం,చార్జ్‌షీట్‌ వేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను పసిగట్టేందుకు డీలర్ల దుకాణాలను తనిఖీ చేయడమే కాకుండా చెక్‌పోస్టుల వద్ద నిఘా పెట్టడం రైతుల ద్వారా సమాచారాన్ని సేకరించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు.ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయానికి పెట్టారని తెలిసిన వ్యక్తి ఎవరైనా సరే 100కాని వ్యవసాయశాఖ అధికారి 7288894377 నంబరుకు గానీ ఫోన్‌ చేయాలని, ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చిన వారి పేరు బయటకు రాకుండా చూడటమే కాకుండా వారికి తగిన పారితోషికం ఇస్తామని కలెక్టర్‌ ప్రకటించారు.ప్రభుత్వం ద్వారా ధ్రువీకరణ పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే రైతులు కొనాలని సూచించారు. జిల్లా ఎస్పీ రంజన్త్రన్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నకిలీ విత్తన విక్రయాలపై 24 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ఇప్పటికే ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఒక బృందాన్ని, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాల సరఫరాదారులు ఎంతటి వారైనా విడిచి పెట్టే ప్రసక్తే లేదన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌నాయక్‌ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అరికట్టి, రైతులు కేవలం ధ్రువీకరణ పొందిన విత్తనాలే వినియోగించేలా అన్ని పంచాయతీల్లో టాంటాం వేయించి  రైతులకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతామని తెలిపారు. ఈ సమావేశంలో ఏడీఏ సక్రియనాయక్‌, ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన వారందరికీ రైతు బంధు..

జిల్లాలో అర్హులైన రైతులందరి ఖాతాల్లో  రైతు బంధు డబ్బు జమ అయ్యే విధంగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతుల పాస్‌పుస్తకం,బ్యాంక్‌ఖాతా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ శృతిఓఝా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మండల వ్యవసాయశాఖ అధికారులతో రైతుబంధు, రైతురుణమాఫీ, జిల్లాలో విత్తనాలు, ఎరువుల నిల్వ, ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలు కల్లాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. . రైతులు తాము పండించిన పంటను సరైన కల్లాలు లేక రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టు కోవడం లేదా తేమ ఉండగానే మార్కెట్‌కు తరలించడం వల్ల రైతులు నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వమే కల్లాలను ఏర్పాటు చేసి ఇస్తుందని వ్యవసాయ విస్తరణ అధికారులు ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు.వానకాలంలో రైతులు మొక్క జొన్న పంట వేయకుండా, దానికి బదులుగా ఇతర పంటను వేసుకునే విధంగా వారిని చైతన్య పర్చాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌నాయక్‌, ఏడీఏ సక్రియనాయక్‌, మండల వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo