ఆదివారం 17 జనవరి 2021
Gadwal - Jun 10, 2020 , 04:22:45

ఐసోలేషన్‌ వార్డులో ఇద్దరు మృతి

ఐసోలేషన్‌ వార్డులో ఇద్దరు మృతి

గద్వాల టౌన్‌ : జిల్లా కేంద్రంలోని దవాఖానలో ఉన్న ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఇద్దరు వృద్ధ మహిళలు మంగళవారం మృతి చెందారు. అయిజ మండలానికి చెందిన అమీనాబి (85) దగ్గు, ఆయాసంతో.. అలాగే ఇటిక్యాల మండలం సాతర్లకు చెందిన గోకారిబీ (68) క్యాన్సర్‌తో సోమవారం దవాఖానలో చేరగా వారిని ఐసోలేషన్‌ వార్డులు ఉంచారు. మంగళవారం మృతి చెందినట్లు ఐసోలేషన్‌ వార్డు ఇన్‌చార్జి పరశురాం తెలిపారు. 

బండరాయిపాకులలో కరోనా కలకలం

రేవల్లి : వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామంలో రిటైర్డ్‌ సైనికుడికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయినట్లు తాసిల్దార్‌ చక్రపాణి తెలిపాడు. గ్రామానికి చెందిన 42 ఏండ్ల రిటైర్డ్‌ ఆర్మీ సైనికుడు హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ గాయత్రినగర్‌లో నివాసం ఉంటున్నాడు. 20 రోజుల కిందట గ్రామంలోని తల్లి, అత్తమ్మను చూడానికి వచ్చి ఈనెల 6న తిరిగి వెళ్లాడు. తర్వాత అస్వస్థతకు గురి కావడంతో సోమవారం బంజారహిల్స్‌లోని మెడికవర్‌ దవాఖానలో చేరగా.. రక్త పరీక్షలు చేయగా మం గళవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని గాంధీ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న తాసిల్దార్‌ చక్రపాణితోపాటు మెడికల్‌ ఆఫీసర్‌ మంజూల, ఎస్‌ఐ నరేందర్‌లు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. రేవల్లిలో 7, బండ రాయిపాకులలో 3 కుటుంబాలను హోంక్వారంటైన్‌ చేశారు.