గురువారం 26 నవంబర్ 2020
Gadwal - Jun 10, 2020 , 04:20:45

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు అప్పగింత

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు అప్పగింత

  • 100 శాతం సేకరణ
  • గద్వాల, అనంతపురం, ఎర్రవల్లి,  అలంపూర్‌,మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి మిల్లులకు తరలింపు

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: పౌర సరఫరాల శాఖ అధికారులు సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసేందుకు లెవీ కేటాయింపులు చేపట్టనున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు అందించి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది 37,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లింగ్‌ చేపట్టేందుకు రైస్‌మిల్లర్లకు ధాన్యాన్ని అప్పగించారు. జిల్లాలోని గద్వాల, అనంతపురం, ఎర్రవల్లి, అలంపూర్‌ ప్రాంతాలతోపాటు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలోని మిల్లులకు కూడా ధాన్యాన్ని అందించారు.

మిల్లింగ్‌కు 100 శాతం ధాన్యాన్ని సేకరించారు. మిల్లర్ల నుంచి ఎలాంటి అక్రమాలు జరుగకుండా అసోసియేషన్‌కు బాధ్యత అప్పగించారు. ప్రభుత్వం నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసేందుకు అధికారులు ప్రైవేట్‌ మిల్లర్లకు అప్పగిస్తారు. ప్రభుత్వం సూచించిన గడువులోగా మిల్లర్‌ యజమానులు తిరిగి బియ్యాన్ని అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. గడువులోగా తిరిగి బియ్యాన్ని అందించక పోయినా, బియ్యాన్ని పూర్తిస్థాయిలో ఇవ్వకపోయినా రాష్ట్ర సివిల్‌ సైప్లె శాఖ కఠిన చర్యలు చేపడుతున్నది. మిల్లింగ్‌ కోసం ధాన్యం తీసుకునే మిల్లులను ఆయా ప్రాంతాల్లోని మిల్లర్స్‌ అసోసియేషన్‌లను బాధ్యులను చేస్తారు. ఏదైనా మిల్లు నుంచి గడువులోగా మిల్లింగ్‌ చేసి బియ్యం ఇవ్వకపోతే మిల్లర్‌ అసోసియేషన్‌ బాధ్యత వహిస్తూ అండర్‌ టేకింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. పలు నిబంధనలు అమలుచేసి మిల్లర్లకు ప్రభుత్వం ధాన్యాన్ని అప్పగిస్తుంది. 

ఈ ఏడాది 37వేల మెట్రిక్‌ టన్నులు

ఈ ఏడాది జిల్లాలో సివిల్‌ సైప్లె శాఖ అన్ని కొనుగోలు కేంద్రాల నుంచి 37,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు మిల్లింగ్‌ చేసేందుకు అప్పగించారు. గద్వాల, అనంతపురం, ఎర్రవెల్లి, అలంపూర్‌ ప్రాంతాలలోని 11 రైస్‌ మిల్లులతోపాటు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలోని మిల్లులకు ధాన్యాన్ని అప్పగించారు. జిల్లాలోని 11 మిల్లులకు 23వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని అందించగా ఇతర జిల్లాలోని మిల్లులకు 14వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అందించారు. మిల్లులకు లారీలు, ట్రాక్టర్ల ద్వారా రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించారు.  

వంద శాతం ధాన్యం సేకరణ 

ప్రభుత్వం అందించిన ధాన్యాన్ని మిల్లుల యజమానులు గడువు కంటే ముందుగానే ధాన్యాన్ని మిల్లింగ్‌ చేపట్టి జిల్లా అధికారులకు అప్పగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం తీసుకునే మిల్లులకు ఆయా ప్రాంతాల్లోని మిల్లర్స్‌ అసోసియేషన్‌ ద్వారా అండర్‌ టేకింగ్‌ తీసుకున్నారు. తద్వారా ఏదైనా మిల్లు యాజమాన్యం సకాలంలో మిల్లింగ్‌ చేసి బియ్యం ఇవ్వకపోతే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు మిల్లర్స్‌ అసోసియేషన్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అసోసియేషన్‌ నుంచి ప్రభుత్వం బియ్యం సేకరిస్తుంది. ఇలాంటి ప్రమాదం ఉన్నందున ధాన్యం తీసుకునే ముందే అసోసియేషన్‌లలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆయా మిల్లులు, యాజమాన్యాల ఆస్తులు ఏంటి..? వారు గతంలో ఏదైనా అక్రమాలకు పాల్పడ్డారా..? అనేది అక్కడే చర్చిస్తారు. ఒకవేళ ఏదైనా మిల్లువారు బియ్యం తిరిగి ఇవ్వకపోతే అసోసియేషన్‌ నుంచి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్నందున వారే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తద్వారా ఏమాత్రం అక్రమాలు జరిగే అవకాశం ఉండకపోగా అధికారులకు కూడా ఇతర పనులు వదిలి మిల్లుల చుట్టూ తిరిగే భారం తగ్గి 100శాతం ధాన్యాన్ని ప్రభుత్వం తిరిగి సేకరించగలిగింది.

ఈ ఏడాది భారీగా సేకరించాం

ఈ ఏడాది భారీగానే ధాన్యాన్ని సేకరించాం. జోగుళాంబ గద్వాల జిల్లాలోని మిల్లులతో పాటు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలోని మిల్లులకు కూడా ధాన్యాన్ని అందించాం. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేసిన 37వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లింగ్‌ చేసేందుకు మిల్లర్లకు అప్పగించాం. ఎలాంటి అవకతవకలు జరుగకుండా సివిల్‌ సైప్లె శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

- శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌,  జోగుళాంబ గద్వాల జిల్లా