సోమవారం 06 జూలై 2020
Gadwal - Jun 04, 2020 , 02:47:08

ఆర్థిక స్వావలంబన దిశగా బల్దియా

ఆర్థిక స్వావలంబన దిశగా బల్దియా

  • మొండి బకాయిలపై దృష్టి 
  • 37శాతం పన్ను వసూలు
  • వందశాతం పన్ను వసూళ్లకు కృషి

పెబ్బేరు : ఆర్థిక స్వావలంబన దిశగా బల్దియా పయనిస్తోంది. పన్నుల చెల్లింపులో ప్రజలను చైతన్యపరుస్తూ ఆదాయ వనరులను పెంపునకు పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి, వ్యాపార, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వందశాతం పన్ను వసూలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మొండి బకాయిలను సైతం వసూలు చేసేలా పక్కా ప్రణాళికలు రూపొందించారు. కమిషనర్‌ కృష్ణయ్య నేతృత్వంలో డిమాండ్‌ నోటీసులు సిద్దం చేసి యజమానులకు అందిస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రాధాన్యతను సంతరించుకున్న పెబ్బేరు సంత టెండర్‌ ముగిసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన సంత టెండర్లు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో మున్సిపాలిటీకి ఘననీయంగా ఆదాయం సమకూర్చే వారంతపు సంత లేక భారీగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గత ఏడాది ఈ సంతకు రూ.2.86కోట్ల ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇంటి, వ్యాపార, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.54, 43,879 వసూలు చేయాల్సి ఉంది. ఈ పన్నులను వందశాతం వసూలు లక్ష్యంగా పెబ్బేరు మున్సిపాలిటీ కృషి చేస్తున్నది. లక్షల్లో పేరుకుపోతున్న బకాయిలతో అభివృద్ధి సాధ్యం కాదని, పుర అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ పన్ను వసూళ్లపై దృష్టి పెట్టారు. 

రూ.54.43లక్షలు వసూలు లక్ష్యం

మే నెల వరకు వసూలైన పన్ను వివరాలు .. పట్టణ పరిధిలో 5,149 గృహాలు, 524 వ్యాపార దుకాణాలు, 133 ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. వీటిలో రూ.52, 87, 469 లు గృహా బకాయిలుండగా రూ.9, 21, 536 వసూలయ్యాయి. రూ.3.33 లక్షలు వ్యాపార దుకాణా బకాయిలుండగా రూ.4వేలు వసూలయ్యాయి. రూ.1.56 లక్షలు ప్రభుత్వ భవనాల బకాయిలుండగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణయ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత 27శాతం పన్నులు వసూలయ్యాయి. మే వరకు 37శాతం పన్ను వసూలైనట్లు పుర అధికారులు తెలిపారు. 

పట్టణాభివృద్ధికి సహకరించండి

ప్రజలు పన్నులు సకా లం లో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. పన్ను వసూళ్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తు న్నాం. వందశాతం పన్ను వసూలు లక్ష్యంగా పని చేస్తున్నాం. ప్రభుత్వ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పన్నులు చెల్లించాలి. ఆస్తి, ఇతర పన్నులను ప్రతి ఒక్కరూ సకాలంలో చెల్లించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.

- ఎద్దుల కరుణశ్రీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, పెబ్బేరు


logo