మంగళవారం 26 మే 2020
Gadwal - May 23, 2020 , 03:26:05

కొండాపూరానికి కొత్తరూపు

కొండాపూరానికి కొత్తరూపు

 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు అనుకూలం

 6,099 మహిళా సంఘాలకు ఉపాధి

 జోగుళాంబ గద్వాల జిల్లాకు కేంద్ర బిందువుగా..

 వెయ్యెకరాల భూసేకరణకు ప్రతిపాదనలు 

 అందుబాటులోకి కల్తీలేని ఆహార ఉత్పత్తులు

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగానే జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపూర్‌ వద్ద ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు నివేదికలు తయారు చేశారు. గ్రామంలోని 106 సర్వే నంబర్‌లో ఉన్న వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 880 ఎకరాల అసైన్డు భూమి ఉన్నది. మరో 200 ఎకరాలు సేకరించనున్నారు. ఇందుకోసం కలెక్టర్‌ శ్రుతి ఓఝా, సంబంధిత అధికారులు బుధవారం స్థల పరిశీలన చేశారు. సర్కారు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నది. రోడ్డు, రైల్వే రవాణాకు అనుగుణంగా ఉండటంతో కొండాపూర్‌ను అధికారులు ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్‌ ఏర్పాటుతో జిల్లాలోని 6,099 స్వయం సహాయక మహిళా సంఘాల్లోని దాదాపు 61వేల మంది మహిళలకు ఉపాధి లభించనున్నది. రాష్ట్రంలో మొదటిసారిగా అతిపెద్ద ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ను రూ. 800 కోట్లతో ఐటీసీ సంస్ధ మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశింది. అందులో భాగంగానే కేటిదొడ్డి మండలం కొండాపూర్‌ గ్రామశివారులో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలాన్ని ఎంపిక చేశారు.

వెయ్యి ఎకరాల్లో యూనిట్‌

మహిళా సంఘాలను స్వయం ఉపాధి కల్పించేందుకు, ముడిసరుకులను సేకరించి కల్తీలేని నాణ్యమైన ఆహార ఉత్పత్తులను తయారు చేసేందుకు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, జిల్లాలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి మండలం కొండాపూర్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 106లో అత్యధికంగా అసైన్డ్‌ భూములు ఒకే చోట ఉండటంతో జిల్లా అధికారులు ఈ ప్రాంతాన్ని గుర్తించారు. ఒకే చోట 880 ఎకరాలున్న  ఈ భూమిని కలెక్టర్‌ శృతి ఓఝా, ఇతర అధికారులు బుధవారం ఈ భూములను పరిశీలించారు. రోడ్డు మార్గానికి,  రైలు మార్గానికి అనువైనదిగా ఉన్నట్లుగా తేల్చారు.  ఈ భూమితోపాటు మరో 200 ఎకరాలను సేకరించి మొత్తంగా 1000 ఎకరాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించనున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలో

6,099 మహిళా సంఘాలు

ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలలోని మహిళలకు ఉపాధి లభించనున్నది. జిల్లాలోని 6,099 స్వయం సహాయక సంఘాలలో దాదాపు 61వేల మంది మహిళలకు ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రభుత్వం మహిళా సంఘాలను ప్రోత్సహించి ఆర్థికంగా భరోసా కల్పించనున్నది. దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేయడం, మహిళలకు ఉపాధి కల్పించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు కార్యరూపం దాల్చనున్నాయి. 

వివిధ రకాల ఆహార ఉత్పత్తులకు అవకాశం

ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు ద్వారా జిల్లాలో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేయనున్నాయి. స్థానికంగా పండించే ఆహార పంటలను ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయించే అవకాశం ఉంటుంది. జిల్లాలో మానవపాడు మండలంలో పండించే మిర్చి పంటను కొనుగోలు చేసి మిర్చి పౌడర్‌, చిల్లీ సాస్‌ తయారు చేయవచ్చు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పండించే టమాట ద్వారా టమాట సాస్‌, పచ్చళ్లను, నిమ్మ ద్వారా నిమ్మరసాన్ని, నిమ్మ పచ్చళ్లను తయారు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి.

ప్రభుత్వానికి నివేదికలు పంపించాం

కేటీదొడ్డి మండలం కొండాపూర్‌ గ్రామ శివారులో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌కు అనువైన ప్రదేశంగా గుర్తించాం. ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వే నంబర్‌ 106లోని ఒకేచోట 880 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉండటంతో ఈ గ్రామాన్ని ఎంపిక చేశాం. ప్రభుత్వం రెండు లేదా మూడు జిల్లాలకు కలిపి ఒక ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాల పరిధిలో స్థానికంగా పండే ఆహారపంటల ద్వారా వివిధ రకాల ఆహారోత్పత్తులు తయారుచేయడం, గోదాంలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌లో చేపట్టనున్నారు. 

- శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌, జోగుళాంబ గద్వాల జిల్లా


logo