సోమవారం 25 మే 2020
Gadwal - Apr 01, 2020 , 02:23:06

మర్కజ్‌ బుగులు

మర్కజ్‌ బుగులు

మహబూబ్‌ నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్రమంగా కరోనా పంజా విసురుతున్నది. ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేని స్థితి నుంచి ఏకంగా ఆరుకు చేరుకునే దాకా వచ్చింది. ఢిల్లీ మర్కజ్‌ ప్రాంతంలో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కరోనా సోకి ఓ వృద్ధుడు మృతి చెందడంతో ఆందోళన మొదలైంది. 

 నిజాముద్దీన్‌ భయం..

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉన్న మర్కజ్‌ ప్రాంతంలో ప్రార్థనల కోసం దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ఉమ్మడి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ముస్లింలు తరలివెళ్లారు. అనంతరం వారంతా ఇండ్లకు చేరుకున్నారు. వీరిలో మహబూబ్‌ నగర్‌ 34, నాగర్‌కర్నూలు 11, వనపర్తి 10 మంది, జోగుళాంబ గద్వాల ఐదుగురు, నారాయణపేట నుంచి ఇద్దరు.. మొత్తం 62 మంది ఉన్నారు. మర్కజ్‌ ప్రార్థనలకు హాజరైన వారిలో నలుగురికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వారిలో జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లికి చెందిన ముగ్గురు, నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన ఓ యువకుడు ఉన్నారు. 

ఇందులో వడ్డేపల్లికి చెందిన ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఇదిలా ఉండగా జోగులాంబ గద్వాలలో సుమారు 70 మందికి పైగా ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రార్థనలకు వెళ్లివచ్చినట్లు తెలుస్తోంది. వీరి జాబితాను సిద్ధం చేసిన అధికారులు త్వరలో క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది.  వడ్డేపల్లికి చెందిన మృతుని కొడుకు, కోడలుకు సైతం కరోనా పాజిటివ్‌ అని తేలడంతో గాంధీ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. 

క్వారంటైన్‌లో 95 మంది..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 95 మంది అనుమానితులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని కావేరమ్మపేటకు చెందిన వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 50 ఏండ్ల వ్యక్తికి కరోనా సోకింది.ఆ తర్వాత ఆయన తల్లికీ పాజిటివ్‌గా వచ్చింది. వీరిద్దరూ ప్రస్తుతం గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.   

అప్రమత్తంగా అధికారులు...

ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్‌ ప్రబలుతుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. నిజాముద్దీన్‌ వెళ్లివచ్చిన వారి జాబితా తయారు చేయడంతో పాటు వడ్డేపల్లిలో కరోనాతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన వారి జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. వారిని క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా తేలితే గాంధీ దవాఖానకు పంపించి చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా వీరిలో చాలా మందిలో కరోనా లక్షణాలు లేవని తెలుస్తోంది.  


logo