ఆదివారం 24 మే 2020
Gadwal - Feb 23, 2020 , 23:27:02

దశకంఠ వాహనంపై నీలకంఠుడు

దశకంఠ వాహనంపై నీలకంఠుడు
  • పారువేటలో శివపార్వతులు
  • శోభాయమానంగా రావణ వాహన సేవ
  • పురవీధుల్లో ఊరేగిన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరులు

శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరులను ఆదివారం రావణ  వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉత్సవ మూర్తులను పట్టు వస్ర్తాలతో అలంకరించి పురవీధుల్లో తిప్పారు. భగవంతుడే తమ ఇండ్ల ముందుకొచ్చినట్లు భక్తులు పులకించిపోయారు. ఆది దేవుడైన పరమేశ్వరుడికి సాయంత్రం అశ్వవాహనసేవ నిర్వహించారు. అమావాస్య సందర్భంగా శివాలయం లో అర్చకులు రుద్రహోమం, జోగుళాంబ ఆలయంలో చండీహోమం నిర్వహించారు. 

- అలంపూర్‌, నమస్తే తెలంగాణ


అలంపూర్‌, నమస్తే తెలంగాణ : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరులను రావణ వాహనంపై ఊరేగించారు. ఉదయం నుంచి నిత్య పూజా హోమం, బలిహరణలు నిర్వహించి అనంతరం స్వామి, అమ్మవార్లను రావణ వాహనంపై ఊరేగించారు. ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో అలంకరించారు. పుర వీధుల్లో రథోత్సవాన్ని భక్తులు కనులార తిలకించారు. ఓం నమశివాయః అంటూ ఓంకారం జపిస్తున్న భక్తుల భగవాన్‌ నామస్మరణల మధ్య రథం ముం దుకు సాగింది. ఆది దంపతులు పురవీధుల గుండా విహరిస్తుంటే భక్తులు చూసి తరించిపోయారు. సాక్షాత్తు భగవంతుడే తమ ఇళ్లకు వచ్చినంత ఆనంతదాన్ని, సంతృప్తిని పొందారు. శివనామ స్మరణలతో కాలనీల్లో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొన్నది.


అశ్వవాహన సేవ

శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సా యంత్రం ఆది దేవుడైన పరమేశ్వరుడిని అర్చకులు, భక్తులు అశ్వవాహనంపై ఊరేగించారు. ప్రత్యేకంగా అలంకరించిన చిన్న రథంపై ఉత్సవమూర్తిని  ఉంచి పూలతో  అలంకరించి పురవీధుల గుండా మం గళ వాయిద్యాల మధ్య శివనామస్మరణ చేస్తు ఊరేగించారు. స్వామివార్లకు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. రథం ముందుకు సాగుతుండగా భక్తులు ముడుపులు చెల్లించుకున్నారు.


రుద్ర హోమం, చండీహోమం

శివాలయంలో అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు రుద్రహోమం నిర్వహించారు. శివాలయంలోని నందీశ్వరుడి సన్నిధిలో నిర్వహించిన ఈ హోమంలో భక్తులు ఆలయ ఈవో, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా జోగుళాంబ ఆలయం యాగశాలలో అర్చకులు చండీహోమం నిర్వహించారు. ఆలయంలో ప్రతి అమావాస్య, పౌర్ణమికి చండీహోమం నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించిన హోమంలో 176 మంది భక్తులు పాల్గొన్నారు.  హోమం నిర్వహించడం వల్ల ఆలయానికి సుమారుగా రూ.1.32లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌  తెలిపారు.


logo