ఆదివారం 24 మే 2020
Gadwal - Feb 22, 2020 , 05:03:50

జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

 జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

ఉండవెల్లి : పత్తి అగ్నికి దగ్ధమైన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని వరసిద్ది వినాయక జిన్నింగ్‌ మిల్లులో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకున్నది. ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం మండలంలో వరసిద్ధి వినాయక జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొన్నసాగిస్తుంది. శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో పత్తిని జిన్నింగ్‌ మిషన్‌ ద్వారా వేరు చేస్తుండగా మిషన్‌లో రాళ్లు పడి, విద్యుత్‌ సరఫరాతో మంటలు చేలరేగాయి. అప్రమత్తం అయిన సిబ్బంది పైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక జిల్లా అధికారి శ్రీదాస్‌ మూడు ఫైరింజన్‌లు, 20 మంది సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో 127 పత్తి బేళ్లు, 2,550 క్వింటాళ్ల పత్తి, 950 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అగ్నికి ఆహుతి అయి దాదాపు రూ.2 కోట్ల నష్టం వాటిళ్లినట్లు కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అబ్రహం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 


అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంపై అనేక గ్రామాల రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా కంపెనీ నిర్వాహకులు ఎక్కడ పత్తి జిన్నింగ్‌ పరిశ్రమలను ఏర్పాటు చేసినా జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలలోనే అగ్నిప్రమాదాలు సృష్టించి ఇన్సూరెన్స్‌ స్వాహా చేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు, రైతులు ఆరోపిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రభుత్వం సీసీఐ ద్వారా రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేస్తున్నది. మూడు నెలలుగా ఈ కంపెనీ నిర్వాహకులు దళారులతో కుమ్మక్కై టోకెన్ల దందా కొన్నసాగిస్త్తూ మార్క్‌ఫెడ్‌ అధికారులతో దళారులు పత్తిని కొనుగోలు చేయించారు.  దీంతో రైతులు రోజుల తరబడి నిరీక్షించి పత్తిని అమ్ముకోలేక ఇంటికి తీసుకెళ్లలేక నిత్యం నరకయాతన అనుభవించారు. ఈ కంపెనీపై రాష్ట్ర ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి కొన్ని రోజుల పాటు దళారుల డబ్బులను నిలిపి వేశారు. దీంతో దళారులు రైతుల పేరుతో బ్యాంక్‌ పాస్‌ బుక్కులు ఇచ్చి జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని స్వాహా చేసినట్లు సమాచారం. త్వరలో కంపెనీపై ఆడిట్‌ జరిగే అవకాశం ఉండటంతో సీసీఐ కొనుగోలు నిలిపివేసిన రోజూ రాత్రి జిన్నింగ్‌ పేరుతో మిషన్‌లను నడపడం, అదే రోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. అగ్ని ప్రమాదంలో కాలిబుడిదైన పత్తి సీసీఐది అని అధికారులు, కాదు తమదే అంటూ నిర్వాహకులు చెబుతున్నారు. మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ సిబ్బందికి కూడా కంపెనీ నిర్వాహకులు సహకరించకపోవడం కోసమెరపు.logo