సోమవారం 30 మార్చి 2020
Gadwal - Feb 22, 2020 , 05:03:50

నేడే నోటిఫికేషన్‌

నేడే నోటిఫికేషన్‌

మహబూబ్‌ నగర్‌ నమస్తే తెలంగాణ, ప్రధాన ప్రతినిధి : రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అడిషనల్‌ రిజిస్ట్రార్‌ గురువారం నాడు డీసీసీబీ, డీసీఎంస్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో నేడు జిల్లా సహకార శాఖ అధికారి స్థానికంగా ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ఈ నెల 25వ తేదీన నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణలు ఉంటాయి. ఈ నెల 28న పోలింగ్‌, అదే రోజు ఫలితాలు సైతం వెల్లడిస్తారు. మరుసటి రోజు పాలక వర్గాల ఎన్నికలు జరుగుతాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లా సహకార సంఘం పరిధిలోని 87 ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు పూర్తవగా.. వనపర్తి జిల్లా నాగవరం పాలకవర్గం ఎన్నిక మినహా 86 పాలక వర్గాలు ఎన్నికైన సంగతి తెలిసిందే. మరోవైపు డీసీసీబీలో 20, డీసీఎంస్‌లో 10 డైరెక్టర్ల స్థానాలకు ఈ నెల 28న పోలింగ్‌ జరుగనుంది. కాగా డీసీసీబీలో 5, డీసీఎంఎస్‌లో 3 డైరెక్టర్‌ పోస్టులకు రిజర్వేషన్ల అభ్యర్థులు కరువయ్యారు. ఈ నేపథ్యంలో రెండు సంఘాల పరధిలో 8 మంది డైరెక్టర్ల కొరత ఏర్పడనుంది.


ఈ నెల 25న ఎన్నికలు..

జిల్లా సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి డీసీసీబీలో 20, డీసీఎంస్‌లో 10 డైరెక్టర్ల స్థానాల ఎన్నికల కోసం జిల్లా సహకార అధికారి రాజేందర్‌ రెడ్డి ఇవాళ ఈ నెల 22న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. 25న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు స్క్రూటినీ, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణలకు అవకాశం ఉంటుంది. 28వ తేదీన ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు డీసీసీబీ డైరెక్టర్ల ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ అయిన వెంటనే కౌంటింగ్‌ ప్రారంభిస్తారు. కౌంటింగ్‌ ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికైన డైరెక్టర్లు ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంస్‌ పాలక వర్గాల ఎన్నికలు జరుగుతాయి. నాగవరం పీఏసీఎస్‌ పాలక వర్గం ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు. ఈ స్థానంలో గెలిచే చైర్మన్‌ అభ్యర్థికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, డీసీఎంస్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటే సేందుకు అవకాశం ఉంటుందో లేదో అధికారులు శనివారం తెలియజేయనున్నారు. 


రిజర్వేషన్‌ అభ్యర్థులేరి...

డీసీసీబీకి సంబంధించి 20 మంది డైరెక్టర్ల కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందులో ఎ క్యాటగిరీ (ప్రాథమిక సహకార సంఘాలు) నుంచి 16 మంది, బి క్యాటగిరీ (ఇతర సంఘాలు) నుంచి నలుగురు డైరెక్టర్లుగా ఎన్నికవుతారు. ఎ క్యాటగిరీలో ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, బీసీలకు 2, జనరల్‌ 10 డైరెక్టర్‌ స్థానాలు కేటాయించారు. ఇక బి క్యాటగిరీలో ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీ 1, జనరల్‌ 1 స్థానాలను కేటాయించారు. డీసీఎంస్‌కు సంబంధించి 10 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉండగా... ఇందులో ఎ కేటగిరీలో ఎస్సీ 1, ఎస్టీ1, బీసీ 1, ఓసీ 3 డైరెక్టర్‌ స్థానాలుంటాయి. ఇక బి కేటగిరీలో ఎస్సీ 1, బీసీ 1, జనరల్‌ 2 స్థానాలుంటాయి. అయితే పాలమూరు డీసీసీబీ పరిధిలో 87 ప్రాథమిక సంఘాలుండగా... అందులో ఒక్కటి కూడా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు లభించలేదు. ఇక బి క్యాటగిరీ కింద జిల్లాలో 35 మంది సభ్యులుండగా అందులో కేవలం ఒక్కరు మాత్రమే ఎస్టీ కేటగిరీకి చెందిన వారున్నారు. దీంతో ఎ కేటగిరీ కింద డీసీసీబీలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 4 డైరెక్టర్‌ స్థానాలు, బి కేటగిరి కింద ఒక్క స్థానం కూడా భర్తీ కాని పరిస్థితి ఏర్పడింది. అలాగే డీసీఎంఎస్‌ పరిధిలో ఎ కేటగిరీ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 2, బి కేటగిరీలో ఎస్సీలకు ఉన్న ఒక్క స్థానం కూడా భర్తీ అయ్యే పరిస్థితి లేదు. అంటే డీసీసీబీలో 20 డైరెక్టర్‌ స్థానాలకు గానూ 5 స్థానాలు, డీసీఎంస్‌లో 10 స్థానాలకు గానూ 3 స్థానాలు భర్తీ అయ్యే పరిస్థితి లేదు. సహకార సంఘాల చట్టం ప్రకారం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ చట్టాన్ని సవరిస్తే తప్ప రిజర్వేషన్లున్నా కూడా డైరెక్టర్‌ స్థానాలు భర్తీ అయ్యే పరిస్థితి ఉండదు. 


logo