మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Feb 21, 2020 , 01:40:53

వైభవంగా ధ్వజారోహణం

వైభవంగా ధ్వజారోహణం

దక్షిణ కాశీగా భాసిల్లుతున్న అలంపూర్‌లో బాలబ్రహ్మేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్‌ శృతి ఓఝా ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం 7.30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.

  • అంలపూర్‌లో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • తొలిరోజు ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్‌ శృతి ఓఝా
  • నేడు నేత్రపర్వంగా ఆకాశ దీపోత్సవం
  • విద్యుద్దీపకాంతులీనుతున్న ముక్కంటి సన్నిధి

అలంపూర్‌, నమస్తే తెలంగాణ : దక్షిణ కాశీగా భాసిల్లుతున్న అలంపూర్‌లో బాలబ్రహ్మేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్‌ శృతి ఓఝా ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం 7.30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్‌వరణం, అఖండ దీప స్థాపన, కలశ స్థాపన, రుద్రహోమాలు నిర్వహించారు. సాయంత్రం వేళ మట్టిలో నవధాన్యాలను ఉంచి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా గోవత్స సహిత ప్రదక్షిణ గావించారు. సర్వతో బద్ర మండలి వద్ద కంకణ ధారణ చేపట్టారు. ఆగమ సంప్రదాయ పద్ధతిలో అర్చకులు పూజాధికాలు నిర్వర్తించారు. సాయం వేళ ధ్వజంపై పరమశివుడి వాహనమైన నందీశ్వరుడి చిత్రపటాన్ని ఉంచి ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌, అర్చకుక స్వాములు పూర్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాములు, తాసిల్దార్‌ మదన్‌మోహన్‌,మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మనోరమ వెంకటేశ్‌, ఆలయ ప్రధాన అర్చకుడు దిండిగల్‌ ఆనంద్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ, త్యాగరాజుశర్మ, వెంకటకృష్ణశర్మ, శ్యామ్‌కుమార్‌శర్మ, కిట్టుస్వామి ,ధనుంజయశర్మ ,ప్రహ్లాదశర్మ తదితరులు పాల్గొన్నారు. 


విద్యుద్దీపకాంతులు, ప్రత్యేక అలంకరణలు

శివరాత్రి ఉత్సవాల సందర్భంగా బాల బ్రహ్మేశ్వరా లయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. శివాలయంలో సాక్షి గణపతి ప్రాంగణంలో అర్చకులు ఆనంద్‌శర్మ, కిట్టుశర్మ ఏర్పాటు చేసిన చతుర్లింగంతో భద్రమండలి, ఏకలింగంతో భద్రమండలి ఆకట్టుకున్నాయి. వాస్తుయంత్రం, నవగ్రహమండపారాధన, శ్రీచక్రం, గణపతి యంత్రాన్ని అలంకరించడం విశేషం. 


మహాశివరాత్రి వేళ..

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించు కొని ఉదయం 5 గంటల నుంచి అభిషేకాలు నిర్వహించనున్నారు. 7.30 గంటలకు నిత్యహోమాలు, 10 గంటలకు రుద్రహోమాలు చేస్తారు. రాత్రి 9.30 గంటల నుంచి యామపూజలు, మహాన్యాస ఏకాదశ రుద్రపారాయణం, లింగోద్భవ సమయంలో లఘు అభిషేకం నిర్వహింస్తారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున ఒంటి గంట వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం చలువ పందిళ్ళు, ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు.

అర్ధరాత్రి శివస్వాములచే నిర్వహించే ఆకాశ జ్యోతి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. భక్తులు ఆలయంలో జాగారం చేసేందుకు వీలుగా పుష్కరఘాట్‌ నందు శుక్రవారం రాత్రి ఉచిత నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 


ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే 

గురువారం సాయంత్రం నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమానికి అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం హాజరయ్యారు. బాలబ్రహ్మేశ్వర ఆలయం ముందు భాగంలో గల ధ్వజస్తంభానికి శివుడికి ఇష్టమైన నంది వాహన చిత్ర పటాన్ని ధ్వజానికి అలంకరించారు. అర్చకులు వేద మంత్రాల మధ్య శివనామస్మరణలతో ధ్వజ జెండావిష్కరణ చేశారు. 


ప్రసాద్‌ స్కీం పథకం స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌

అలంపూరు పర్యాటక క్షేత్రంలో ప్రసా ద్‌ స్కీం సంబంధించి  చేపట్టాల్సిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్‌ శృతిఓఝా పరిశీలించారు. తుంగభద్రానది తీరంతో వంతెన సమీపంలోని ఈ భూమిని ఆమె పరిశీలించారు. ఆర్డీవో రాములు అక్కడ చేపట్టాల్సిన పనులను కలెక్టర్‌కు వివరించారు. వారితో పాటు తాసిల్దార్‌ మధన్‌మోహన్‌, ఆరై శ్రీవాణి ,ఎంపీడీవో మల్లికార్జున్‌, సర్వేయర్‌ ఉన్నారు.


logo
>>>>>>