బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Feb 18, 2020 , 23:44:33

నవబ్రహ్మల దివ్యధామం అలంపురం

నవబ్రహ్మల దివ్యధామం అలంపురం

తుంగభద్ర తీరం.. ఐదోశక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్‌ క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవ శోభను సంతరించుకున్నది. కోటిలింగాల క్షేత్రంగా, నవబ్రహ్మల దివ్యధామంగా విరాజిల్లుతున్న హేమలాపురిలో ఈ నెల 20వ తేదీ నుంచి 24వరకు మహాశివరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • బాలబ్రహ్మేశ్వరుడిగా పూజలందుకుంటున్న ముక్కంటి
  • రేపటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ

తుంగభద్ర తీరం.. ఐదోశక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్‌ క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవ శోభను సంతరించుకున్నది. కోటిలింగాల క్షేత్రంగా, నవబ్రహ్మల దివ్యధామంగా విరాజిల్లుతున్న హేమలాపురిలో ఈ నెల 20వ తేదీ నుంచి 24వరకు మహాశివరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాశివరాత్రి పర్వదినాన రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించనున్నారు.  

-అలంపూర్‌, నమస్తే తెలంగాణ 


అలంపూర్‌, నమస్తే తెలంగాణ : దేశంలో ఎక్కడా లేని విధంగా అలంపూర్‌ పుణ్యక్షేత్రంలో నవబ్రహ్మల ఆలయాలున్నాయి. ప్రపంచ చరిత్రలో నవబ్రహ్మల దివ్యధామంగా వెలుగొందుతున్నది. నవ బ్రహ్మలయాల్లో బాలబ్రహ్మేశ్వర ఆలయం ప్రధానమైనది. అందులో శివ లింగం చిన్నదిగా ఉండటం వల్ల బాలబ్రహ్మేశ్వరుడిగా పిలుస్తున్నారు. పూర్వం బ్రహ్మదేవుడు తపస్సు చేయడం వల్ల ఉద్భవించిన కారణంగా బ్రహ్మేశ్వరుడు గోవుపాదం ఆకారంలో శివలింగం ఉండటం చేత గోస్పాద ఆకారం లింగమని, రసాలతో, మూలికలతో తయారు కాబడిన లింగం కావడంతో రసాత్మక లింగం అని రకరకాలుగా పిలువబడుతూ ప్రసిద్దికెక్కింది. బ్రహ్మ తపస్సు చేయడం వల్ల వెలసిన ఆలయాల కాబట్టి ఇక్కడి ఆలయాలు నవబ్రహ్మాలయాలుగా పిలువబడుతున్నాయి. వాటిలో ఆర్క బ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడ బ్రహ్మ, మొదలగు ఎనిమిది ఆలయాలు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉండగా ఒక్క బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మాత్రమే భక్తులకు నిత్య పూజలందుతున్నాయి.


జోగుళాంబ అమ్మవారి శక్తిపీఠం 

అష్టాదశ శక్తి పీఠాల్లో అలంపూర్‌లో వెలసిన జోగుళాంబ ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్నది. పురాణాల గాదల ఆధారంగా దక్ష ప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యజ్ఞం వద్ద ఈశ్వరుడిని అవమానించిన సందర్భంలో సతీదేవి మనస్థాపానికి గురై తన బొటన వేలితో రాపిడి చేసి యోగాన్ని కల్పించుకుని ఆత్మార్పణ చేసుకుంటుంది. అది గమనించిన శివుడు ప్రళయ కాలరుద్రుడై వీరభద్రుడిని సృష్టించి యాగా న్ని నాశనం చేస్తాడు. అనంతరం సతీదేవి పార్థీవదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేస్తాడు. శివుడిని శాంతింపజేసే ప్రయత్నంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సందించడం ద్వార సతీదేవి శరీరం 18 భాగాలుగా విడిపోతుంది. ఒక్కోభాగం పడిన చోట ఒక్కో శక్తిపీఠం ఉద్భవించింది. ఆవిధంగా దేశంలో 18 శక్తిపీఠాలు ఉద్భవించాయి. అలంపూర్‌ క్షేత్రంలో పార్వతీదేవిపై పలు వరుస పడటం వల్ల ఇక్కడ జోగుళాంబదేవి వెలసిందని పురాణ గాధల ద్వా రా చరిత్ర చెబుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం అలంపూర్‌ జోగుళాంబ క్షేత్రం. క్షేత్రంలో మహాశివరాత్రి, వార్షికోత్సవం, నవరాత్రుల్లో ప్రత్యేక ఉత్సవాలు వైభవంగా కొనసాగుతాయి.


దేవదాయశాఖ మంత్రికి ఆహ్వానం 

ప్రముఖ శైవక్షేత్రం అలంపూర్‌లో ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని మంగళవారం హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరన్‌రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ను వేర్వేరు సందర్భాల్లో ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌ అర్చకులతో కలిసి ఆహ్వానించారు. మంత్రి నివాసంలో వారిని కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆనంద్‌శర్మ, జానకిరాంశర్మ, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


పూజా కార్యక్రమాలు ఇలా..

20వ తేదీ గురువారం ఉదయం యాగశాల ప్రవేశం, పుణ్యాహవచనం, మహాగణపతి పూజ, రుత్విక్వరణం, అఖండ దీపస్థాపన, మహా కలశస్థాపన, మృత్‌ సంగ్రహణం, అంకురార్పణ, భేరిపూజ, ధ్వజోరోహణం, బలిహరణ తదితర పూజలు నిర్వహిస్తారు.


21వ తేదీ శుక్రవారం అభిషేకాలు, నిత్య పూజాహోమం, ఏకాదశ రుద్ర పారాయణం, లింగోద్భవం, రాత్రి 12గంటలకు ఆలయ ప్రాంగణంలో శివస్వాములచే అకాశదీప ప్రజ్వళన నిర్వహించబడును. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాలే వీధి నుంచి రామలింగేశ్వర ఆలయం పల్కిలో జ్యోతిని మంగళవాయిద్యాల మధ్య తీసుకొచ్చి బాలబ్రహ్మేశ్రాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి చివరగా బాలబ్రహ్మేశ్వర ఆలయ శిఖరభాగం నుంచి ఆకాశంలోకి పంపుతారు. మహోత్సవం తిలకించడానికి భక్తులు పోటీ పడుతారు.


22వ తేదీన తెల్లవారుజామున 1గంటకు స్వామివార్ల కల్యాణం. నిత్యపూజా హోమం, బలిహరణ, నందివాహనసేవ, రుద్రహోమం, సాయంత్రం హంసవాహన సేవ, రాత్రికి రథోత్సవం నిర్వహిస్తారు.


23వ తేదీన  నిత్య పూజా హోమం, రుద్ర హోమం, రావణ వాహనసేవ నిర్వహిస్తారు. సాయంత్రం అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. రాత్రికి రుద్రహోమం, పూర్ణాహుతి కలశ ఉద్వాసన, అవభృత స్నాపనం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.


24న నిత్య పూజాహోమం, శేషవాహనసేవ, రుద్ర హోమం, పూర్ణాహుతి కలశ ఉద్వాసన, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.సంగమేశ్వర ఆలయంలో..

కృష్ణ-తుంగభద్ర నదుల సంగమం వద్ద గతంలో ముంపునకు గురైన ఎంతో ప్రాశస్థం కలిగిన సంగమేశ్వర ఆలయం అదే తరహాలో, అదే ఆకారంలో, ఆవే రాళ్లతో అలంపూర్‌ క్షేత్రంలో జోగుళాంబ ఆలయానికి పశ్చిమ భాగంలో కిలోమీటరు దూరంలో నిర్మించిన సంగమేశ్వర ఆలయంలో కూడా మహా శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు.  ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. 


ఆలయానికి రూట్‌ ఇలా..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 210 కిలోమీటర్ల దూరంలో, ఉమ్మడి జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి 70కిలో మీటర్ల దూరంలో పవిత్ర తుం గభద్రానది తీరంలో అలంపూర్‌ క్షేత్రం వెలసింది. 44వ జాతీయ రహదారికి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. రోడ్డు, రైలు మార్గం ద్వారా జోగుళాంబ రైల్వే హాల్ట్‌లో దిగితే అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉన్నది. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం శాఖ వారు వారం రోజులకోసారి యాత్రికుల కోసం టూర్‌ ప్యాకేజీ కూడా ఏర్పాటు చేశారు.


ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

20వ తేదీన  ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయాలను అన్ని విధాల  ముస్తాబు చేశారు. భక్తులకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలు సమకూర్చారు. శివరాత్రి రోజు భక్తులు జాగారం చేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. చలువ పందిళ్ళు, అదనపు ప్రపాదం కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక అదనపు క్యూలైన్‌లు ఏర్పాటు చేయనున్నారు.logo