శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Feb 18, 2020 , 01:17:46

ఉత్కంఠ భరితంగా పీఏసీసీఎస్‌ చైర్మన్ల ఎన్నిక

ఉత్కంఠ భరితంగా పీఏసీసీఎస్‌ చైర్మన్ల ఎన్నిక

అలంపూర్‌,నమస్తే తెలంగాణ : అలంపూరు సొసైటీలో ఆదివారం నిర్వహించిన అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో  కోరం లేక వాయిదా పడిన అలంపూరు సహకార ఎన్నికలు సోమవారం ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక సందర్భంగా పోలీసులు బారి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల వారు గెలుపు తమదే అన్న ధీమా వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు ఉన్న పరిణామాలు మధ్యాహ్నం తర్వాత మార్పు చెందాయి. అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి చింతల మహేశ్వరరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి మోహన్‌రెడ్డిలు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఉపాధ్యక్ష పదవికి టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి మద్దిలేటికి పోటీగా మరో నామినేషన్‌ వేయక పోవడంతో ఉపాధ్యక్ష ఎన్నికను అధికారులు ఏకగ్రీవంగా ప్రకటిం చారు. మధ్యాహ్నం తర్వాత ఎన్నికల అధికారులు నిర్వహించిన రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ పద్ధతిలో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి మోహన్‌రెడ్డి అధ్యక్షుడిగా,మద్దిలేటి ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. ఎన్నికల కార్యాలయం వద్ద ఇన్‌చార్జి సీఐ గోపి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఎన్నిక కొనసాగిందిలా...

సోమవారం ఉదయం 09 నుంచి 11 గంటల గంటలకు అభ్యర్థుల  నుంచి అధికారులు నామినేషన్‌లు స్వీకరించారు. 11:30 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్‌ల పరిశీలన, మధ్యాహ్నం 2 గంటలకు గుర్తులు కేటాయించి బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేశారు. 3 గంటలకు ఓటింగ్‌ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల అధికారులు మోహన్‌, చెన్నారెడ్డి ఫలితాలు వెల్లడించారు. అనంతరం డైరెక్టర్లందరికీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యాలయ సిబ్బంది సీఈవో కేశవరెడ్డి, నూతనంగా ఏర్పడిన పాలక వర్గ సభ్యులకు పూలమాలలు, శాలువాలు వేసి సన్మానించారు. ఇదిలా ఉండగా సహకార కార్యాలయం ముందు ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం, జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త తిరుపతయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు. ఫలితాలు వెలువడ టంతో పటాకులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం సహకార సంఘం చైర్మన్‌ మోహన్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మద్దిలేటి, డైరెక్టర్‌లను ఎమ్మెల్యే కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. 


ధరూరు పీఏసీసీఎస్‌ అధ్యక్షురాలుగా మహాదేవమ్మ 

ధరూరు : ఆదివారం వాయిదా పడిన సహకార చైర్మన్‌ ఎన్నికను తిరిగి సోమవారం ఎన్నికల అధికారి ఆర్‌. రాజా నందం నిర్వహించారు. ఉదయం నామినేషన్స్‌ సమయం లోపు ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్స్‌ వేశారు. బీజేపీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన కుర్వ మహాదేవమ్మ నామినేషన్‌ వేయగా, టీఆర్‌ఎస్‌ నుంచి పెద్ద వెంకటన్న నామినేషన్‌ వేశారు. ఆర్‌.రాజానందం 11 గంటల నుంచి నామినేషన్ల పరీశీలన నిర్వహించి నిర్ధారణ చేసుకున్న తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు ఓటింగ్‌ నిర్వహించారు. డైరెక్టర్‌ అభ్యర్థులు ఓట్‌ను రహస్య ఓటింగ్‌ పద్దతిలో వినియోగించుకున్నారు. అనంతరం కౌంటింగ్‌ ప్రక్రియను నిర్వహించగా వెంకటన్నకు 5 ఓట్లు పోలవగా, కుర్వ మహాదేవమ్మకు 8 ఓట్లు పోలవడంతో బీజేపీ అభ్యర్థి మహాదేవమ్మ విజయం సాధించారు.  అనంతరం ఆర్‌. రాజానందం అభినందన కార్యక్రమం నిర్వహించి అధ్యక్ష, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లను సన్మానించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం చైర్మన్‌గా ఎన్నికైన అధ్యక్షురాలిని, ఉపాధ్యక్షుడిని మాజీ మంత్రి డీకే అరుణ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి కృష్ణకుమార్‌, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
logo