ఆదివారం 29 మార్చి 2020
Gadwal - Feb 18, 2020 , 01:16:17

ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

గద్వాల, నమస్తే తెలంగాణ: ప్రజావాణికి వచ్చిన సమస్యలపై జిల్లా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30గంటల నుంచి 11గంటల వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ 9 ఫిర్యాదులు స్వీకరించారు. 11గంటల నుంచి ప్రజావాణిలో 63 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అత్యధికంగా ఆసరా పింఛన్‌, రైతుబంధుపై ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్‌ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటన ఫొటోలు తన వాట్సప్‌కు పంపించాలన్నారు.  


సమస్యలు పరిష్కరించుకోవాలి : ఏఎస్పీ

గద్వాల అర్బన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యలను పరిష్కరించుకోవాలని  జిల్లా అదనపు ఎస్పీ కే కృష్ణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజవాణి నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు ఫిర్యాదుదారులతో మాట్లా డి వారి ఫిర్యాదులను స్వీకరించారు. కుటుంబ, ఆస్తి తగాద, చిట్టి డబ్బులు తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. సివిల్‌ సమస్యలు కోర్టులో పరిష్కరించుకోవాలన్నారు.


చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించాలి

గద్వాల, నమస్తే తెలంగాణ: నిత్యం మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా పురపాలక సంఘం కమిషనర్‌ను ఆదేశించారు. సోమవారం పురపాలక సంఘం కమిషనర్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో కలిసి గోన్‌పాడ్‌  వద్ద డంపింగ్‌యార్డు, నది అగ్రహారం దగ్గర పురపాలక సంఘం తరపున కొత్తగా ఏర్పాటు చేసేందుకు నర్సరీ స్థలాన్ని వారు పరిశీలించారు.  గద్వాల పట్టణానికి సరఫరా అయ్యే కృష్ణ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, బీరెళ్లిరోడ్డు వద్ద పార్కు స్థలాన్ని కూడా కలెక్టర్‌ పరిశీలించారు. డంపింగ్‌ యార్డుకు ప్రహరీ ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను వేరు చేసే షెడ్‌ నిర్మించాలని సూచించారు. వచ్చే హరితహారానికి పట్టణానికి కావాల్సిన మొక్కలు అందించేందుకు యుద్ధ ప్రాతిపాదికన నర్సరీ ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టాలని ఆమె పేర్కొన్నారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు,రెండో రైల్వేగేట్‌, బీరెళ్లి రోడ్డు వద్ద ఉన్న పది శాతం ప్రభుత్వ ఖాళీ స్థలంలో నూతనంగా పబ్లిక్‌పార్కులు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. కలెక్టర్‌ వెంట పురపాలక కమిషనర్‌ నర్సింహ, టౌన్‌ప్లానింగ్‌ అధికారి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.


చెట్లు సమృద్ధిగా ఉంటేనే మానవాళికి మనుగడ 

అడవులు, చెట్లు సమృద్ధిగా ఉంటేనే మానవాళికి మనుగడ ఉంటుందని, సీఎం కేసీఆర్‌ అభిమతమని దానికి అనుగుణంగా జిల్లాలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా అన్నారు. కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నా టారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో అటవీ ప్రాంతం ఒకశాతం కన్నా తక్కువగా ఉండడం ఆందోళనకు గురి చేస్తుందన్నారు. జిల్లా అధికారులతో పాటు మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అటవీ ప్రాంతాన్ని పెరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పుష్పమ్మ, కమలాదేవి, నసీమాబేగం, ఇందిరా, ముసాయిదాబేగం, సునీత, ఆదిత్య కేశవసాయి, కృష్ణ, నర్సింహులు, రాములు ఉన్నారు.


అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి

జిల్లాలో అటవీ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానికి అటవీశాఖతో పాటు పోలీస్‌, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ లోని తన చాంబర్‌లో జిల్లా ఎస్పీ అపూర్వరావుతో కలిసి జిల్లా స్థాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని పెంచికలపాడ్‌, ముసలంపల్లి అటవీ ప్రాంతంలో చుట్టు పక్కల ఉన్న తొమ్మిది గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ఎవరైనా చెట్లు నరికినట్లయితై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అటవీలో జంతువులకు హాని కలిగిస్తే 1972ఫారెస్ట్‌ నిబంధన-9 ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చింతలకుంట నుంచి బల్గెర వరకు ఒక రూట్‌ కాగా మాచర్ల నుంచి బల్గెర వరకు రూట్లను గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 17,555 ఎకరాల బీడు భూములను గుర్తించామని, అలాంటి భూముల్లో సామాజిక అడవులను పెంపొందించేందుకు కార్యచరణ రూపొందించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా ఫారెస్ట్‌ అధికారి బాబ్జిరావు, ఆర్డీవో రాములు తదితరులు పాల్గొన్నారు.


పరీక్షలకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

జిల్లాలో ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా విద్యాశాఖ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో వచ్చేనెలలో ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలు అనేవి విద్యార్థుల భవితవ్యంతో కూడుకున్నవని, ఎలాంటి తప్పులు, ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రతి సెంటర్‌లో కుర్చీలు, టేబుళ్లు, ఫ్యాన్లు, విద్యుత్‌ సరఫరా, నీటివసతి తదితర వసతులను ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి హృదయరాజ్‌, అసిస్టెంట్‌  కమిషనర్‌ ప్రభుత్వ పరీక్షల నిర్వాహకుడు శ్రీనివాస్‌ను ఆదేశించారు. పరీక్ష పూర్తి అయిన వెంటనే అదేరోజు పోస్టాఫీస్‌ ద్వారా హైదరబాద్‌కు చేరవేసే విధంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్కాడ్‌ను ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 25వ తేదీ పలు సూచనలు చేసే విధంగా కోఆర్డీనేషన్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతకు ముందే డీఎం ఆర్టీసీ, డీఎంఅండ్‌హెచ్‌వో, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ తదితర శాఖల అధికారులు వారు చేపట్టాల్సిన అంశాలపై అధికారికంగా లేఖలు పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రాములు పాల్గొన్నారు.


logo