ఆదివారం 29 మార్చి 2020
Gadwal - Feb 17, 2020 , 03:33:01

ప్రణాళికతో మౌలిక వసతులు కల్పించాలి

ప్రణాళికతో మౌలిక వసతులు కల్పించాలి

గద్వాల, నమస్తే తెలంగాణ: నూతన పురపాలక చట్టం ప్రకారం పట్టణాల్లో పారిశుధ్యంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పుర కమిషనర్లు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌ సమావేశపు మందిరంలో గద్వాల జిల్లాలోని నాలుగు పురపాలక సంఘం కమిషనర్లతో పాటు పబ్లిక్‌హెల్త్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతి మాదిరిగానే  త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమవుతుందని, అన్ని పురపాలక సంఘాలు సిద్ధంగా ఉండాలన్నారు. పురపాలక సంఘంలోని ప్రతి వార్డుకు నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశించారు. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉండాలని, ఇందులో మహిళా కమిటీ, యూత్‌కమిటీ, ప్రజాప్రతినిధుల కమిటీ ఈ విధంగా ప్రతి వార్డుకు నాలుగు కమిటీలు సోమవారం వరకు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. నిత్యం ప్రతి ఇంటి నురంచి చెత్తను సేకరించేలా పకడ్బందీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. పట్టణాల్లో పార్కుల అభివృద్ధితో పాటు వాటిని పరిశుభ్రంగా ఉండేవిధంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పురపాలక అధికారులపై ఉందని, పట్టణంలో పార్కులు మంచిగా ఉంటే సాయంత్రం వేళల్లో ప్రజలకు ఆహ్లాద వాతావరణంతో పాటు కాసేపు సేద తీరే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి పురపాలక సంఘంలో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించాలని, అందుకు సరిపడు స్థలం సేకరించాలని దీనితో పాటు శ్మశాన వాటికలకు కూడా స్థలం సేకరించి వాటి నిర్మాణాలకు సంబంధించి నివేదిక తయారు చేయాలన్నారు. 


చెత్త సేకరణకు కావాల్సిన ట్రైసైకిళ్లు, రిక్షాలు, ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైనా తర్వాత అవి లేవు ఇవి లేవని ఎలాంటి సాకులు చెప్ప కూడదన్నారు. మార్చి 31లోగా జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో పబ్లిక్‌ టాక్స్‌ను నూటికి నూరు శాతం వసూలు చేసి పురపాలక సంఘాలను అభివృద్ధి చేసే విధంగా ఉండాలన్నారు. పురపాలక సంఘాల్లో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎప్పటికప్పుడు డ్రైన్‌లను శుభ్రం చేయించి అక్కడక్కడ బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించాలని, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా పారిశుధ్యం లోపిస్తే బాధ్యతలపై కఠిన చర్యలు తప్పవన్నారు. వేసవి సమీపిస్తుండడంతో పురపాలకల్లో ఎక్కడ మంచినీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. స్వచ్ఛ పురపాలక సంఘాలే లక్ష్యంగా అధికారులు ముందుకు సగాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో పురపాలక కమిషనర్లు నరసింహా, మదన్‌మోహన్‌, పార్థసారధి, యాదగిరి తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


logo