మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Feb 15, 2020 , 01:58:14

నర్సరీ బెడ్‌లను మార్చుతూ ఉండాలి

నర్సరీ బెడ్‌లను మార్చుతూ ఉండాలి

ధరూరు : మొక్కలను పెంచే నిర్వాహకులు నర్సరీ బెడ్‌లను తరుచూ మార్చుతూ ఉండాలని, దాని వల్ల మొక్కలు పెరగడంతో పాటు పిచ్చి మొక్కలు పెరగకుండా ఉంటాయని శిక్షణ కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ సెక్రటరీ, టెక్నికల్‌ అసిస్టెంట్‌లతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతి, ప్రగతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బూరెడ్డిపల్లి గ్రామంలోని నర్సరీని సందర్శించి నిర్వాహకులతో మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే హరిత నెట్‌లను మొక్కలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మొక్కలలో పెరిగే పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలించాలన్నారు. మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకొని, వాటిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ సందర్శనలో ఆయన వెంట ఎంపీడీవో అబ్దుల్‌ జబ్బార్‌, పంచాయతీ సెక్రటరీలు, టెక్నికల్‌ అసిస్టెంట్స్‌ పాల్గొన్నారు.

విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలుండాలి

కేటీదొడ్డి : విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, దాని కనుగుణంగా ప్రయత్నిస్తే విజయం మన సొంతం అవుతుందని శిక్షణ కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు. మండలంలోని ఐదు ఉన్నత పాఠశాలల నుంచి పదో తరగతి చదువుతున్న నలుగురు చొప్పున విద్యార్థులతో కలిసి లంచ్‌ విత్‌ హర్ష కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తన అనుభవాలను పంచుకుని స్ఫూర్తి నింపారు. విద్యార్థి దశలో ఎలా చదవాలి, ప్రణాళికలు ఎలా రచించుకోవాలి, సమస్యలను ఏ విధంగా ఎదుర్కొవాలి, పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, పునశ్చరణ చేసుకునే విధానం, నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాలపై విద్యార్థులతో మాఖాముఖిగా చర్చించారు. పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులకు గౌరవం తీసుకుని రావాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయం సాధించడానికి తనకు ఎదురైన సమస్యలను విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. అనంతరం విద్యార్థులకు పరీక్షల ప్యాడ్‌లు అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం ఆగస్టీన్‌, ఉపాధ్యాయులు జమ్మన్న, స్వప్న, స్వరూప, అయిలప్ప, వీరేష్‌, రంగస్వామి పాల్గొన్నారు. 


logo
>>>>>>