శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Feb 14, 2020 , 00:35:58

శివరాత్రికి ముస్తాబైన శ్రీగిరి

శివరాత్రికి ముస్తాబైన శ్రీగిరి

శ్రీశైలం: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమవుతున్నాయని కార్యనిర్వాహణాధికారి కేఎస్‌ రామారావు తెలిపారు. 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామిఅమ్మవార్లకు శాస్ర్తోక్తంగా పూజాధికాలు నిర్వహిస్తూ ప్రతీరోజు ప్రత్యేక వాహనసేవలు జరిపించనున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల రాకపోకలకు వీలుగా 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మన్ననూర్‌ అటవీ ప్రాంతంలో రాత్రివేళ రాకపోకలకు ఉన్న ఆంక్షలు తొలగించనున్నట్లు చెప్పారు. శివదీక్షా స్వాములకు 18వ తేదీ సాయంత్రం వరకు నిర్ణీత సమయాల్లో స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు ఈవో స్పష్టం చేశారు. అదే విధంగా వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులతోపాటు అధికంగా తెలంగాణ కర్నాటక మహారాష్ట్ర యాత్రికులకు కావలసిన మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా మంచినీరు మరుగుదొడ్లు వసతి సౌకర్యాలను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉత్సవ రోజుల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను జయప్రదం చేయాలని గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కోరారు. స్వామివారి లడ్డూ ప్రసాదాల విక్రయ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడమేకాక వివిధ రంగుల బ్యాగులలో 5,10,20 లడ్డూ ప్రసాదాలను అందించేందుకు సిద్ధం చేసినట్లు విభాగాధిపతి శ్రీహరి తెలిపారు. కాలినడక వచ్చే భక్తులకు మార్గమధ్యంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు 9440668108 నంబరుకు సమాచారం ఇవ్వవలసిందిగా సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం నుంచి స్పర్శ దర్శనాలు ఆర్జిత సేవలు రద్దు చేస్తూ ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఏఈఓ కృష్ణారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవల్లో భాగంగా 20 నుండి 22 వరకు మద్యం దుకాణాలను మసివేయాలని తెలంగాణ ఆంధ్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులను కోరినట్లు తెలిపారు. బెల్ట్‌ షాపులు నిర్వహించే వారు అక్రమంగా మద్యం విక్రయించేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శివరాత్రి ముందురోజుతోపాటు లింగోద్భవ దర్శనం వరకు సుమారు ఐదు లక్షల మంది భక్తులు రావచ్చునని డీఎస్పీ వెంకట్రావు అన్నారు. వీరికి తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంనేందుకు హైవే అధారిటీ ఆర్‌టీఏ అధికారులతో కలిసి ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. శివరాత్రి పండుగకు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే భక్తులు అటవీ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవిధంగా సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆర్టీసీ, ట్రాఫిక్‌, వైద్య శాఖల అధికారలతోపాటు అమ్రాబాద్‌ పోలీస్‌ శాఖ అధికారులు తగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాగా శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్‌కు చెందిన సి ఎల్లయ్య దంపతులు రూ.1,00,000లు (లక్ష రూపాయలు) విరాళంగా ఇచ్చారు. గురువారం ఆలయ  అధికారి వెంకటేశ్వరావుకు విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. logo