శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Gadwal - Feb 14, 2020 , 00:33:50

పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి

పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి

కేటీదొడ్డి : గ్రామ పంచాయతీల పరిధిలో డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, నర్సరీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ శ్రుతిఓఝా అధికారులను ఆదేశించారు. గురువారం పల్లెప్రగతి పర్యవేక్షణలో భాగంగా మండలంలోని ఉమిత్యాలతండా, నందిన్నె, పాతపాలెం గ్రామాల్లో పనులను పర్యవేక్షించారు. ముందుగా ఉమిత్యాల తండాను సందర్శించి నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నర్సరీ ప్రారంభం నుంచి సాంకేతికంగా సలహాలు తీసుకుంటూ మొక్కలను పెంచాలన్నారు. ఎలాంటి మట్టి, ఎరువు ఎంత వాడాలి.. పలు అంశాల్లో సాంకేతికను పాటిస్తేనే నాణ్యమైన మొక్కలు వస్తాయన్నారు. ఇందుకు సాంకేతిక సిబ్బంది, అటవీ శాఖ అధికారుల సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు. డంపింగ్‌యార్డును పరిశీలించిన కలెక్టర్‌ అక్కడ సేకరించిన చెత్తను మంట పెట్టి కాల్చి ఉండటాన్ని చూసి పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తడి చెత్తను తిరిగి ఎరువుగా మార్చడం, పొడి చెత్తలోని ప్లాస్టిక్‌ వంటి వ్యర్థాలను పునర్వినియోగానికి అమ్మాల్సి ఉంటుంది తప్ప మొత్తం చెత్తను కాల్చివేయటం ఏంటని ప్రశ్నించారు. వెంటనే చెత్త వేరు చేసే షెడ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మండల అభివృద్ధి అధికారిని ఆదేశించారు. అనంతరం ఉమిత్యాల తండా అంగన్‌వాడీని సందర్శించారు. పప్పు నాణ్యత లేదని గ్రహించి సంబంధిత జిల్లా సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేయాల్సిందిగా తాసిల్దార్‌కు ఆదేశించించారు. నందిన్నె గ్రామ నర్సరీని సందర్శించారు. పాతపాలెం గ్రామంలో డంపింగ్‌యార్డు, శ్మశానవాటికను పరిశీలించిన కలెక్టర్‌ చెరువు కింది భాగంలో స్థలాన్ని ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించారు. మురికి కూపంగా మారిన వైనాన్ని చూసిన కలెక్టర్‌ పంచాయతీ సెక్రటరీ, స్థలం చూపించిన సర్వేయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్థలం మార్చి డంపింగ్‌యార్డు, శ్మశానవాటికలను నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో కృష్ణ, జెడ్పీటీసీ రాజశేఖర్‌, ఎంపీడీవో జయరామ్‌నాయక్‌, తాసిల్దార్‌ సుభాష్‌నాయుడు, ఏపీవో, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.logo