సోమవారం 30 మార్చి 2020
Gadwal - Feb 11, 2020 , 23:56:29

ఎన్నికలేవైనా ఏకపక్షమే..

ఎన్నికలేవైనా ఏకపక్షమే..

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎన్నికలు ఏవైనా ఫలితాలు మాత్రం టీఆర్‌వైపే ఉంటున్నాయి. సర్పంచ్‌ నుంచి తీసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న సహకార సంఘాల ఎన్నికల వరకు అన్నింటా విజయం టీఆర్‌ఎస్‌ పార్టీదే ఉంటోంది. పార్టీ గుర్తుతో పోటీ చేసినా.. టీఆర్‌ఎస్‌ మద్దతుదారుడిగా బరిలో ఉన్నా ఫలితాలు మాత్రం గులాబీ జెండా వెంటే ఉంటున్నాయి. రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు, పేదల పక్షపాతిగా ఉన్న సర్కారు.. వెరసి ఎన్నికల ఫలితాల్లో గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటోంది. ప్రస్తుతం జరుగుతున్న సహకార సంఘాల ఎన్నికల్లో ఉపసంహరణలు ముగిసిన తర్వాతే చూసుకుంటే ఉమ్మడి జిల్లాలోని 76 సంఘాలకు గాను 17 సంఘాలు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకునడం విశేషం. ఈ నెల 15న పోలింగ్‌ జరిగే మిగతా 59 సంఘాల పరిధిలోనూ ఇప్పటికే చాలాచోట్ల 6 స్థానాల వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకున్నారు. అంటే పోలింగ్‌ అనంతరం వెలువడే ఫలితాల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ రికార్డు విజయం సాధించేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌ వల్లే ఫలితాలన్నీ వన్‌ సైడ్‌ అవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 988 డైరెక్టర్‌ స్థానాలుంటే 285 ఏకగ్రీవం అయ్యాయి. అందులో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులే 248 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఏక పక్ష ఫలితాలు

సహకార సంఘాల ఎన్నికల్లోనూ ఫలితాలు ఏకపక్షం అవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సహకార సంఘాల్లో పోలింగ్‌ కంటే ముందే టీఆర్‌ఎస్‌ పార్టీ బోణీ కొట్టింది.  జిల్లాలోని మొత్తం 76 సొసైటీలకు గాను గులాబీ పార్టీ 17 సొసైటీలను కైవసం చేసుకుంది. ప్రతిపక్షాలు కనీసం ఒక్క సొసైటీ సైతం కైవసం చేసుకునలేకపోగా.. కనీసం ప్రభావం చూపించలేకపోయాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17 సొసైటీలకు గాను 10 సొసైటీలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. ఈ పదింటిలో రెండు చోట్ల అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 8 చోట్ల మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నది. ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 23 విండోలకు గాను రెండు చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. వనపర్తిలో రేచింతల విండో టీఆర్‌ఎస్‌ పరమైంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని పుటాన్‌దొడ్డి, మానవపాడు, క్యాతూరు సొసైటీల్లో మెజార్టీ స్థానాలు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులకు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఈ మూడు విండోలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ కానున్నారు. నారాయణపేట జిల్లా తీలేరు సొసైటీ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ 9 మంది టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీమయ్యారు. ఇలా ఉమ్మడి జిల్లాలో పోలింగ్‌కు ముందే టీఆర్‌ఎస్‌ పార్టీ 17 సొసైటీలను కైవసం చేసుకున్నది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు ఈ సొసైటీల పరిధిలో టీఆర్‌ఎస్‌ బలపర్చిన వారే కానున్నారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 988 డైరెక్టర్‌ స్థానాలకు గాను 285 ఏకగ్రీవం కాగా.. ఇందులో 248 మంది టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకోవడం విశేషం. ప్రతిపక్షాలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కలిపి కేవలం 37 స్థానాల్లో మాత్రమే ఏకగ్రీవంగా గెలుపును సొంతం చేసుకున్నారు. ఈ నెల 15న జరిగే పోలింగ్‌లో ప్రతిపక్షాలకు మైండ్‌ బ్లాక్‌ అయ్యే ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

దేవరకద్రలో టీఆర్‌ఎస్‌ వైపే..

దేవరకద్ర నియోజకవర్గంలో 9 సహకార సంఘాలున్నాయి. ఇందులో 117 డివిజన్లకు గాను 40 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన అన్నింటినీ టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఇంకా 75 స్థానాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉన్నది. ఈ స్థానాల్లోనూ మెజార్టీ స్థానాలు తమ వైపే ఉంటాయని పార్టీ నేతలు అంటున్నారు. ఇక మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం (గండీడ్‌ కలుపుకొని) పరిధిలో 39 స్థానాలు ఏకగ్రీవం కాగా.. అందులో 38 టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. 


logo