బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Feb 11, 2020 , 23:52:32

జాతీయ రహదారిపై దృష్టి సారించండి

జాతీయ రహదారిపై  దృష్టి సారించండి

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: 44వ నంబర్‌ జాతీయ రహదారి అస్తవ్యస్తంగా తయారయిందని మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైవేపై చాలా చోట్ల ఫ్లైవోవర్‌ పనులు నత్తనడకన సాగుతూ.. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. చాలాచోట్ల సర్వీసు రోడ్లు లేక గ్రామాల జనం పడుతున్న అవస్థలు చాలా ఉన్నాయన్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పలు సమస్యలపై ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, రమేశ్‌ పోక్రియాల్‌ను కలిశారు. జాతీయ రహదారి 44 పరిధిలో కొత్తూరు నుంచి కొత్తకోట వరకు  సర్వీసు రోడ్ల నిర్మాణం లేక జనం పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పలుచోట్ల అండర్‌ పాస్‌లు లేక జరుగుతున్న ప్రమాదాల్లో అనేకమంది మృతిచెందిన విషయాన్ని  ఆయనకు తెలిపారు. సర్వీస్‌ రోడ్లు, అండర్‌ పాస్‌ రోడ్‌, అండర్‌ బ్రిడ్జెస్‌ నిర్మాణం చేపట్టాలని కోరారు. కనిమెట్ట, వేముల, ముదిరెడ్డిపల్లి వద్ద అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం అత్యవసరమని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఎంపీ వినతిపత్రం సమర్పించారు. పలు చోట్ల జరుగుతున్న ఫ్లై ఓవర్‌ పనులు వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కొత్తగా జిల్లాలు ఏర్పాటైన తర్వాత నేటివరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఒక్క జవహర్‌ నవోదయ విద్యాలయాన్ని కూడా మంజూరు చేయలేదని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌కు తెలిపిన ఆయన వెంటనే తొలి ప్రాధాన్యంగా మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరక్రద నియోజకవర్గంలో జేఎన్‌వీ ఏర్పాటు చేయాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాలపై కేంద్రం వెంటనే దృష్టి సారించాలని విన్నవించారు. 

దుందుబీ నదిపై బ్రిడ్జి నిర్మించాలి

కల్వకుర్తి ప్రజల చిరకాల కోరిక దుందుబీ నదిపై వంతెన నిర్మించాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. రఘుపతిపేట-రామగిరిని కలుపుతూ తెల్కపల్లి, లింగాలను కలిపే ఈ వంతెన వల్ల రెండు మండలాల ప్రజలు హైదరాబాద్‌ వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. వంతెన నిర్మాణానికి కేంద్రం వెంటనే సహకరించాలని కోరుతూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ఢిల్లీలో కలిశారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల వెనకబడిన ప్రాంతానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని కోరారు. బ్రిడ్జి నిర్మాణం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.45కోట్లు  మంజూరు చేయమని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. 


logo