శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Feb 11, 2020 , 23:49:28

ఆర్డీఎస్‌ ఆనకట్టకు నీటి విడుదల

ఆర్డీఎస్‌ ఆనకట్టకు నీటి విడుదల

అయిజ : కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్‌ ఆనకట్టకు నీటి విడుదల చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు టీబీ బోర్డు అధికారులు ఆర్డీఎస్‌ నీటి వాటాలో 2,500 క్యూసెక్కులను విడుదల చేశారు. ఈ నెల 9న తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ ఆర్డీఎస్‌ నీటి వాటా కింద 1.537 టీఎంసీల నీటి 10 రోజుల పాటు విడుదల చేయాలని టీబీ బో ర్డుకు ఉత్తరం రాశారు. నాలుగు రోజుల పాటు 2,500 క్యూసెక్కులు, 6 రోజులు 1,300 క్యూసెక్కులు విడుదల చేసి, అలంపూర్‌ నియోజకవర్గంలోని ఆర్డీఎస్‌ ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చాలని ఈఎన్‌సీ కోరారు. దీంతో మంగళవారం టీబీ బోర్డు అధికారులు డ్యాం నుంచి ఆర్డీఎస్‌ ఆనకట్టకు తుంగభద్ర నది ద్వారా నీటిని విడుదల చేశారు. ఏపీలోని కేసీ కెనాల్‌, ఆర్డీఎస్‌ నీటి వాటా కింద జాయింట్‌గా నీటిని విడుదల చేయాలని కోరినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఇండెంట్‌ పెట్టకపోవడంతో కేవలం ఆర్డీఎస్‌ ఇండెంట్‌ను మాత్రమే విడుదల చేశామని టీబీ డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. మంగళవారం టీబీ డ్యాం నుంచి విడుదలైన నీరు ఈ నెల 16వ తేదీ నాటికి ఆర్డీఎస్‌ ఆనకట్టకు చేరుకుని ఆయకట్టుకు చేరుతుందని ఆర్డీఎస్‌ ఏఈ ఆంజనేయులు తెలిపారు. 


logo