శనివారం 28 మార్చి 2020
Gadwal - Feb 11, 2020 , 00:48:10

పురపాలక అభివృద్ధే ఎజెండా

పురపాలక అభివృద్ధే ఎజెండా

గద్వాల, నమస్తే తెలంగాణ:  గద్వాల మున్సిపల్‌ చైర్మన్‌గా బీఎస్‌ కేశవ్‌ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న కేశవ్‌ను ఎమ్మెల్యేలు పూలే బొకేలతో అభినందించారు. పురపాలక ప్రజలకు మంచి సేవలు అందించి పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, నా వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అనంతరం మున్సిపాలిటీ ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన కేశవ్‌ మిత్రులు, వ్యాపారస్తులు, మున్సిపల్‌ ఉద్యోగులు, కౌన్సిలర్లు కేశవ్‌కు అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు. తనపై పుర ప్రజలు నమ్మకం ఉంచి రెండో సారి చైర్మన్‌గా పట్టం కట్టారని, పురపాలక అభివృద్ధే ఎజెండాగా పని చేస్తానని కేశవ్‌ పేర్కొన్నారు. కౌన్సిలర్లు కూడా వారి వార్డుల పరిధిలో సమస్యలు ఎప్పటి కప్పుడు గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని, నావంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఆర్వోబీ నిర్మాణం ఆలస్యం కావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రెండు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో అందరూ కౌన్సిలర్లతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు పరుమాల నాగరాజు, రమేశ్‌నాయిడు, రాజశేఖర్‌, కోడిగుడ్లసలాం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పద్మాదేవేందర్‌రెడ్డి ఎమ్మెల్యే ఇంటికి రాగా ఆమెకు పురపాలక చైర్మన్‌తో పాటు ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు.


logo