శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Gadwal - Feb 11, 2020 , 00:45:13

విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి

విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి

గద్వాల, నమస్తే తెలంగాణ: ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదివి అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని, తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల, విద్యార్థినుల సమావేశంలో  ఎమ్మెల్యే తో పాటు జెడ్పీవైస్‌ చైర్మన్‌ సరోజమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి విద్యార్థినీ క్రమశిక్షణతో మెలగాలని, కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి లక్ష్యం చేరుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లాకు పేరు రావడంతో పాటు మీరు అత్యున్నత స్థాయికి ఎదుగుతారని సూచించారు. ఇప్పటికే నియోజకవర్గంలో కేసీఆర్‌ స్టడీ సర్కిల్‌ ద్వారా పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్నామని, భవిష్యత్‌లో ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు అందజేసేందుకు కృషి చేస్తానన్నారు. కళాశాలకు ప్రధానంగా కాంపౌండ్‌, రవాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే ఇంటర్‌ విద్యార్థులకు పుస్తకాలతో పాటు ఎలాంటి ఫీజు లేకుండా విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ విద్యార్థినులు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు. అంతకుముందు వార్డు కౌన్సిలర్లు నాగలత, వెంకటనర్సమ్మ, లక్ష్మీదేవి, గీతమ్మ, దౌలు తదితరులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రఘుపతినాయిడు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, పరుమాల నాగరాజు, కోడిగుడ్ల సలాం, రమేశ్‌నాయిడు, రాముశెట్టి, శ్యాంసుందర్‌రెడ్డి, నాగులుయాదవ్‌ తదిరులు పాల్గొన్నారు.

గుడ్డెందొడ్డిలో బొడ్రాయి ప్రతిష్ఠాపన..

ధరూరు : మండలంలోని గుడ్డెందొడ్డి గ్రామంలోని బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.  ముందుగా ఎమ్మేల్యేకు సర్పంచ్‌ రఘువర్ధన్‌రెడ్డితో గ్రామస్తులు బ్యాండ్‌ మేళాలతో స్వాగతం పలికారు. బొడ్రాయి ప్రతిష్టాపన స్థలానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామీణ వ్యవస్థకు బలమైన నమ్మకం దుర్గం గ్రామంలో స్థాపించేదే బొడ్రాయి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ విజయ్‌, నాయకులు కృష్ణారెడ్డి, సురేశ్‌శెట్టి, జంబూరామన్‌ గౌడ్‌, కోడిగుడ్ల సలాం, శ్రీనాథ్‌ గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo