బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Feb 10, 2020 , 00:25:02

హిందూ ధర్మరక్షణకు పాటుపడాలి

హిందూ ధర్మరక్షణకు పాటుపడాలి

గద్వాల టౌన్‌: సనాతన హిందూధర్మం ఎంతో ఉన్నతమైనదని, హిందూ ధర్మరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉందని మంత్రాలయ పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామివారు పేర్కొన్నారు. భూలక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవానికి స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు, నిర్వహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రామాలయం, భూలక్ష్మిచెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారికి పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. గత ఏడాది ఉత్సవాల్లో రామాలయానికి పూర్వ వైభవం తెచ్చామని, అదేవిధంగా వచ్చే ఏడాది నిర్వహించే ఉత్సవాల నాటికి కృష్ణాలయాన్ని కూడ పునః ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే గద్వాలను ధార్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఆలయానికి ప్రముఖ ద్వారం అవసరమని ద్వారం ఏర్పాటుకు, మఠంకు సంబంధించిన ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టతలచామని అందుకు ఎమ్మెల్యే సహకారం ఎంతో అవసరమన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై తనకు నమ్మకం ఉందని త్వరలో పనులను పూర్తిచేస్తారని ఆశిస్తున్నామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర  అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌ కృషి ఎనలేనిదన్నారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. 

అభివృద్ధికి కృషి.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మంత్రాలయ పీఠాధిపతిని దర్శించుకుని ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటలోని ఆలయాల అభివృద్ధికి పీఠాధిపతి చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. తనవంతు బాధ్యతగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పీఠాధిపతిని దర్శించుకుని ఆశీర్వచనాలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ విచారణకర్త ప్రభాకర్‌, మేనేజర్‌ సంప్రతి మోహన్‌ తదతరులు పాల్గొన్నారు.


logo
>>>>>>