గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 10, 2020 , 00:24:04

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ డేంజర్‌

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ డేంజర్‌

పెబ్బేరు: వేగం కన్నా ప్రాణం మిన్న.. అతి వేగం ప్రాణానికే ప్రమాదకరం.. ఇలాంటి సూచనలు ఎన్ని పెట్టినా, పోలీసులు, రవాణాశాఖ ఎన్ని తనిఖీలు చేపట్టినా వాహనదారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ప్రమాదాల సంఖ్య ను తగ్గించాలని చూస్తున్న పోలీసులకు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, రాంగ్‌రూట్‌, నిర్లక్ష్య చోదనం తలనొప్పిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ నిండు ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు తీరని దుఃఖం మిగులుస్తున్నారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, రాంగ్‌రూట్‌, నిర్లక్ష్య చోదనం, హెల్మెట్‌, సీటుబెల్టు లేకుండా వాహనాలపై దూసుకెళ్లడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మరి కొందరైతే ఫోన్‌ ఒక చేతిలో, స్టీరింగ్‌ లేదా హ్యాండిల్‌ మరో చేతితో పట్టుకుని చోదనం చేస్తుంటారు. దాదాపుగా 35 ఏళ్లలోపు వాహనదారులే ఇలా కనిపిస్తున్నారు. 


హెల్మెట్‌, సీటుబెల్టు తప్పనిసరి

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ శాతం ద్విచక్రవాహనాదారులు తలకు గాయాలై మృత్యువాత పడుతున్నారు. ప్రాణాలు కాపాడటంలో శిరస్ర్తాణం పాత్ర సింహభాగమని గుర్తించాలి. మన ప్రయాణం ఎంత తక్కువ, దూరమైనా శిరస్ర్తాణం తప్పనిసరిగా ఉపయోగించాలి. వెంట్రుకలు ఊడిపోతాయని, దువ్వుకున్న క్రాప్‌ చెడిపోతుందని, బైక్‌పై వెళ్తుంటే అందరూ నావైపే చూడాలనే ఉద్దేశంతో చాలామంది యువకులు హెల్మెట్‌ ధరించడం లేదు. అదేవిధంగా కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పనిసరిగా ఉపయోగించాలి.


రాంగ్‌రూట్‌.. ప్రమాదకరం

యూటర్న్‌ దూరంగా ఉండటంతో వాహనదారులు అపసవ్య దిశలో వాహనాలు నడుపుతూ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. నిబంధనల మేరకు వెళ్లే సమయం, పెట్రోల్‌ వృథా అవుతుందని చాలామంది రాంగ్‌రూట్‌లో వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చేవారు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.. మహిళలు, పిల్లలను సైతం వాహనాలపై ఎక్కించుకుని రాంగ్‌సైడ్‌లో వెళ్తున్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు, అంతకంటే ఎక్కువగా రాంగ్‌రూట్‌లో అతివేగంతో దూసుకెళ్తున్నారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతుంది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపటంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే మార్గాలలో ఆకతాయిలు ద్విచక్రవానాలపై అతివేగంతో రాంగ్‌రూట్‌లో వెళ్తూ పలువురిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. 


నిబంధనలు పాటిద్దాం.. 

సరదా కోసం అతివేగం వద్దు.

తోటి వాహనాదారులు ఓవర్‌టేక్‌ చేశారనే అహం వద్దు.

ద్విచక్రవాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణం చేయొద్దు.

మలుపుల వద్ద ఓవర్‌టేక్‌ వద్దు.

యూటర్న్‌ తిరుగుతున్న సమ యంలో వెనుక, ముందు వస్తున్న వాహనాలను గమనించాలి.

పిల్లలు డ్రైవింగ్‌ చేయకూడదు. లైసెన్స్‌లేని వారు రోడ్లపైకి వాహ నాలతో రాకూడదు.

రోడ్ల చుట్టుపక్కల ఉన్న గుర్తులు, సంకేతాలు పాటించాలి.

మద్యంతాగి వాహనాలు నడుపొద్దు.

సీటు బెల్ట్‌ పెట్టుకునే డ్రైవింగ్‌ చేయాలి.

అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే.. వేగంగా వెళ్లకుండా పద్ధతిగా ముందే ప్రయాణం ప్రారంభించాలి.


logo