శనివారం 28 మార్చి 2020
Gadwal - Feb 07, 2020 , 00:22:54

ఎదురుచూపులు!

ఎదురుచూపులు!
  • కో-ఆప్షన్‌ పదవుల కోసం నిరీక్షణ
  • ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలు
  • కొత్త చట్టం ప్రకారం ఒక్కో బల్దియాకు నలుగురికి అవకాశం
  • రెండు మైనార్టీలకు, రెండు అనుభవజ్ఞులకు
  • నోటిఫికేషన్‌ వస్తేనే కసరత్తు అంటున్న అధికారులు
  • నేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కో-ఆప్షన్‌ పదవుల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని 17 మున్సిపాలిటీలలో జనవరి 22న ఎన్నికలు జరిగాయి. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, ఫ్లోర్‌ లీడర్ల ఎన్నిక కూడా ముగిసింది. కానీ కో-ఆప్షన్‌ పదవుల ఎంపిక పూర్తి కాకపోవడంతో ఆశావహులు నిరీక్షిస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో నలుగురు సభ్యులను నియమించాల్సి ఉండగా.. ఇద్దరు మైనార్టీలకు, మిగతా ఇద్దరు ప్రజాప్రతినిధులుగా అనుభవం ఉన్న వారికి అవకాశం ఉండనున్నది. ఉమ్మడి జిల్లాలో 68 పోస్టుల్లో నియామకాలు చేపట్టాల్సి ఉంది. గత ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు.. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారు.. పార్టీల విధేయులు.. సీనియర్‌ నేతలు కో ఆప్షన్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్‌ వస్తేనే కసరత్తు మొదలు పెడుతామని అధికారులు చెబుతున్నారు. 


ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో ఇటీవల ఎన్నికలు జరిగాయి. వడ్డేపల్లి, మక్తల్‌ మినహా అన్ని పురపాలికలను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, ఫ్లోర్‌ లీడర్ల ఎన్నికలు ముగిశాయి. వారు పదవులు చేపట్టారు. పాలన సాగిస్తున్నారు. అయితే నేటికీ మున్సిపాలిటీల పరిధిలోని కోఆప్షన్‌ పదవుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. అనేక మంది ఆశావహులు ఈ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త చట్టం మేరకు ప్రతి మున్సిపాలిటీ నుంచి నలుగురు కోఆప్షన్‌ సభ్యులను నియమించాల్సి ఉంది. అంటే ఉమ్మడి జిల్లాలో 68 పోస్టులు. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్న 15 మున్సిపాలిటీలలో 60 పోస్టులకు అవకాశమున్నది. దీంతో కోఆప్షన్‌ పదవులకు నాయకులు పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఈ పోటీ ఊహించని విధంగా ఉన్నది. మున్సిపల్‌ చైర్మన్లు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుని కోఆప్షన్‌ బరిలో విజయం సాధించాలని అనేక మంది ప్రయత్నాలు సాగిస్తున్నారు. 


నేతల చుట్టు ప్రదక్షిణలు

ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల పరిధిలో 68 కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక చేయాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు, మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారు, పార్టీల విధేయులు, సీనియర్‌ నాయకులు కొందరు కోఆప్షన్‌ పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. పలువురిని కో ఆప్షన్‌ ఆశ చూపించి మున్సిపల్‌ ఎన్నికల బరిలో నుంచి తప్పించారు. ఇలా అందరూ తమకు కోఆప్షన్‌ పదవులు కావాలని ప్రయత్నాలు ప్రారంభించారు. మున్సిపల్‌ చైర్మన్లు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆశావహుల తాకిడి తట్టుకోలేకపోతున్నామని నేతలు వాపోతున్నారు. అయితే నేతలు మాత్రం సరైన వ్యక్తులకే పదవులు కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. 


నలుగురికి అవకాశం

గతంలో మున్సిపాలిటీలో గరిష్ఠంగా ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులుండేవారు. అయితే కొత్త మున్సిపాలిటీ చట్టంలో అన్ని మున్సిపాలిటీల పరిధిలో నలుగురు సభ్యులను కో ఆప్షన్‌కు ఎన్నుకోనున్నారు. ప్రమాణ స్వీకారాలు చేసి 10 రోజులు ముగిసిపోయింది. పదవులపై ఆశ పెట్టుకున్న వారు మాత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. పాలకవర్గాల ప్రమాణ స్వీకారం తర్వాత సాధ్యమైనంత త్వరగా కో ఆప్షన్‌ పదవుల భర్తీ చేస్తారని ఎదురుచూపులు చూస్తున్నారు. కొత్తగా ఎన్నికునే నలుగురిలో ఇద్దరు మైనార్టీలకు అవకాశం ఉంటుంది. మిగతా ఇద్దరు ప్రజా ప్రతినిధులుగా అనుభవం ఉన్నవారిని, మాజీ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్‌ ఉద్యోగులకు అవకాశం ఉండనున్నదని సమాచారం. పుర పరిధిలో ఓటరై ఉండి, 21 ఏండ్లు దాటిన వారు అర్హులు. 


నోటిఫికేషన్‌ వస్తేనే కసరత్తు

ఇప్పటికే కోఆప్షన్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారు నోటిఫికేషన్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్‌ వస్తే తప్ప కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాదు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడితే పూర్తి వివరాలు ఇంకా తమకు రాలేదని చెబుతున్నారు. తొలి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వరకు కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాలనే నిబంధన ఏమీ లేదని వనపర్తి కమిషనర్‌ రజనీకాంత్‌రెడ్డి తెలిపారు. నోటిఫికేషన్‌ వస్తే ఆ మేరకు కో ఆప్షన్‌ సభ్యుల నియామకం కోసం కసరత్తు చేపడుతామన్నారు. దీంతో నోటిఫికేషన్‌ ఎప్పుడొస్తుందో తమకు ఎప్పుడు పదవులు వస్తాయో అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.


logo