బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Feb 03, 2020 , 23:36:40

వాడి వేడిగా మండల సర్వసభ్య సమావేశం

వాడి వేడిగా మండల సర్వసభ్య సమావేశం

మల్దకల్‌ : మండల కేంద్రంలో మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికి మూడు సమావేశాలు జరిగినా వాటికి హాజరుకాని విద్యుత్‌, విద్యాశాఖ అధికారులపై కలెక్టర్‌, జెడ్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఎంపీపీ రాజారెడ్డితోపాటు వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశపు హాలు నందు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాజారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్‌, విద్యా శాఖలు రెండు ఎంతో ముఖ్యమైనవని ఎంపీటీసీ పరుషరాముడు అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఆయా శాఖ అధికారులకు విన్నవించుకుందామంటే వారు హజరు కాకపోవడం చాలా విచిత్రంగా ఉందన్నారు. ఆయా శాఖల అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు నిర్మించాలని ఏపీ సీడీపీవో హేమలత ప్రజాప్రతినిధులకు సూచించారు. అదేవిధంగా ఇంటింటికీ ఇంకుడుగుంత తప్పకుండా నిర్మించుకోవాలని ఎంపీడీవో రాజారమేశ్‌ పేర్కొన్నారు. దాసరిపల్లి గ్రామంలో డంపింగ్‌యార్డు కోసం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని సర్పంచ్‌ కోరారు. మల్లెందొడ్డికి వీఆర్‌వో రావడం లేదని ఎంపీటీసీ పరుషరాముడు సభ దృష్టికి తీసుకురాగా రైతులకు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకుంటానని తాసిల్దార్‌ హామీ ఇచ్చారు. మండలంలోని చాలా గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు రావడం లేదని పాల్వయి, మల్దకల్‌, విఠలాపురం, తదితర గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తెచ్చారు. ఫోన్‌ చేసినా సమస్యపై సరిగ్గా స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ ఇకపై ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయం, పంచాయతీ రాజ్‌, వైద్య తదితర శాఖల అధికారులు తమ ప్రగతి పట్ల సభకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, తాసిల్దార్‌ అజంఅలీ, ఎంపీడీవో రాజారమేశ్‌, ఈవోఆర్డీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకటేశ్వర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, శివరామిరెడ్డి, యాకోబు, భరత్‌రెడ్డి, లక్ష్మన్న, పద్మమ్మ, ఎంపీటీసీలు పరుషరాముడు, పెద్దగోపాల్‌రెడ్డి, ఇతర గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర శాఖల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.


logo
>>>>>>