శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Feb 03, 2020 , 23:35:57

మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహోత్సవాలకు ఈనెల 4 నుంచి మార్చి 13 వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈవో వెంకటాచారి తెలిపారు. కొండపైన  హనుమద్దాసుల కోనేరులను భక్తులు స్నానాలు చేసుకునేందుకు సర్వం సిద్ధం చేశామని, గతంలో ఈ కోనేరుకు నీటి సదుపాయం లేక పూర్తిగా పాడుబడి ఉండేదన్నారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు కోనేరును అత్యంత సుందరంగా తీర్చిదిద్ది భక్తులు స్నానం చేసేందుకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా కొండపైన మంచినీటి సదుపాయం కోసం నూతనంగా మిషన్‌ భగీరథ, ఓవర్‌ హెడ్‌ ట్యాంకును నిర్మించి  కొండపైన, కింద జాతరకు మంచినీటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఏర్పాట్లు చేశామన్నారు. గతంలో బ్రహోత్సవాలు వస్తే మంచి నీరులేక భక్తులు ఎక్కడెక్కడో తిరిగి నీరు తెచ్చుకొనే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు.  ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పబ్లిక్‌ ట్యాప్‌లను ఏర్పాటు చేసి వాటర్‌ సదుపాయం కల్పించామన్నారు. అలివేలు మంగమ్మ దేవాలయం దగ్గర రూ.2 కోట్లా 70 లక్షలతో కల్యాణ మంటపాన్ని సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిర్మించిందనారు. రూ.3 కోట్లా 70 లక్షలతో 72 విశ్రాంతి గదులను తేరు మైదానం దగ్గర నిర్మించడానికి పనులు వేగవంతంగా చేపడుతున్నామనారు. 70 లక్షలతో కింద ఒబులేశు స్వామి, లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. రాబోయే బ్రహోత్సవాలకు  ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. ఘాట్‌రోడ్డులో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మహబూబ్‌ నగర్‌ నుంచి అలివేలు మంగమ్మ గుడి వరకు ప్రత్యేక మినీ బస్సులను ఆర్టీసీ వారు నడిపి స్తున్నారని పేర్కొన్నారు.  బ్రహ్మోత్సవాల  సందర్భంగా ఆర్టీసీ సంస్థ వారు హైదరాబాదు - మహబూబ్‌నగర్‌ రాయిచూర్‌-నారాయణపేట, వనపర్తి-తాండూర్‌, షాద్‌నగర్‌-పరిగి నుంచి దిగువ కొండ వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారన్నారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు శాఖ వారు ప్రత్యేక ఔట్‌పోస్టులను ఏర్పాటు చేసి భక్తులకు రక్షణ కల్పిస్తున్నారన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం చుట్టూ 5 కిలో మీటర్ల పరిధిలో మత్తు పానీయాలు తాగడం, అమ్మడం, జూదం, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


logo