గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 02, 2020 , 23:56:10

నడిగడ్డ ఇలావేల్పు జములమ్మ

నడిగడ్డ ఇలావేల్పు జములమ్మ
  • రేపు పుట్టినింటికి ఎడ్లబండిపై పయనం
  • ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
  • మాఘశుద్ధ పౌర్ణమి నుంచి ఉత్సవాలు
  • తిరిగి 5న మెట్టినింటికి అమ్మవారి రాక
  • మాఘశుద్ధ పౌర్ణమి నుంచి ఉత్సవాలు

గద్వాలటౌన్‌:  జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం జమ్మిచేడులో వెలసిన జములమ్మ అమ్మవారిని మంగళవారం భాజాభజంత్రీల మధ్య తన పుట్టినిల్లయిన గుర్రంగడ్డ(దివిసీమ)కు ఆలయ సిబ్బంది సాంప్రదాయబద్దంగా తీసుకెళ్లనున్నారు. పుట్టిలో అమ్మవారిని తీసుకెళ్లి గుర్రంగడ్డ వద్ద ప్రత్యేక పూజలు చేసి తిరిగి అమ్మవారిని 5న మెట్టినిల్లు(జమ్మిచేడు)కు సాంప్రదాయబద్దంగా తీసుకొస్తారు. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే మంగళవారం అమ్మను పుట్టినింటికి సాగనంపి తిరిగి మరుసాటి రోజున మెట్టినింటికి తొలుకొస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏటా మాఘశుద్ధ పౌర్ణమి ఈ నెల 9న అమ్మవారిని కొలిచేందుకు లక్షలాది మంది భక్తులు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మద్రాస్‌, ముంబై తదితర ప్రాంతాల నుంచి తరలొస్తారు. 


1983లో జరిగిన యదార్థ సంఘటన

జూరాల నిర్మాణం తర్వాత జములమ్మ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రిజర్వాయర్‌గా మార్చారు. దీంతో ఆలయం లోతట్టుకు చేరింది. ఆలయం అవతలి వైపు ఉన్న నీరు వెలుపలికి రావడం మొదలుపెట్టింది. దీంతో ఆలయం లోతట్టులో ఉండటం శ్రేయస్కరం కాదని భావించిన కొందరు సురక్షితమైన ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని తలంచారు. వెంటనే మూల విగ్రహాన్ని తొలగించేందుకు  పనులు ప్రారంభించారు. దాదాపు 10అడుగులు లోతు తవ్విన మూల విగ్రహం చివరి కనబడ లేదు. దీంతో విగ్రహం తొలగించేందుకు పూనుకున్న వారు అసహనం కోల్పోయారు. విగ్రహాన్ని అటు ఇటు ఊపడం మొదలుపెట్టారు. ఇంతలో వారి కళ్లు మూసుకుపోయి చీకటిమయంగా మారింది. అక్కడే గ్రామ పెద్దలు అమ్మను అక్కడినుంచి తరలించడం ఎవరి తరం కాదని యదావిధిగా ఉంచాలని సూచించారు. అమ్మను వేడుకోమ్మని చెప్పారు. అమ్మను వేడుకుని కొలిచారు. అంతలోనే వారికి కళ్లు తిరిగి వచ్చాయి. వెనువెంటనే అప్పటి అధికారులు స్పందించి ఆలయంలోకి నీరు చేరకుండా ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. ఇదంతా 1983లో జరిగిన యదార్థ సంఘటన అని అక్కడి గ్రామ పెద్దలు, అక్కడ పనిచేసిన వారు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు.


మొదటి పూజలు జములమ్మకే..

నడిగడ్డలోని ఏ ఇంటిలో శుభకార్యం జరిగినా, పండుగ, జాతర, ఉత్సవాలైనా మొదటి మొక్కు అమ్మకు చెల్లుతుంది. అమ్మకు మొదటి మొక్కు చెల్లించాకే కార్యక్రమాలు ప్రారంభించడం నడిగడ్డ ప్రజల ఆనవాయితీ. అమ్మను మొదటగా కొలిస్తే ఎలాంటి విజ్ఞాలు కలుగకుండా చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయన్నది భక్తుల నమ్మకం.


logo
>>>>>>