సోమవారం 30 మార్చి 2020
Gadwal - Feb 02, 2020 , 00:55:17

నేత్రానందం గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం

నేత్రానందం గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం

జడ్చర్ల రూరల్ : మండలంలోని గంగాపూర్‌లో వెలసిన కలియుగ దైవం లక్ష్మీచెన్నకేశవ స్వామి రథోత్సవాన్ని వేదపండితులు భక్తుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిపించారు. శనివారం రథసప్తమి సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి ఉదయం నుంచే పెరిగింది. వారం రోజుల జరుగుతున్న జాతర సందర్భంగా ఆలయప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి పూలరథోత్సవం నిర్వహించగా శనివారం రథసప్తమిని పురస్కరించుకుని వందల ఏండ్ల చరిత్ర గల రథంలో స్వామివారిని గ్రామంలో ఊరేగించారు. రెండు రోజులుగా స్వామివారి జాతర ప్రధాన ఘట్టాలు నిర్వహిస్తుండడంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. చెన్నకేశవుడికి భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు ఆవులను, దూడలను తీసుకొస్తుండడంతోపాటు దాసంగాలు సమర్పంచేందుకు కుమ్మరులు చేసిన కుండలు సిద్ధంగా ఉన్నాయి. కొందరు కుండలలో ప్రసాదం చేసి బోనాలు తిప్పుతూ మొక్కులు తీర్చుకుంటుండగా మరికొందరు భక్షాలు చేసి నైవేద్యాలు పెడుతున్నారు. రైతులు తమ కుటుంబ సభ్యులతోపాటు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆదివారం శకటోత్సవానికి తమ ఎడ్లబండ్లను సిద్ధం చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి ప్రత్యేక పూజలు   

రథసప్తమి సందర్భంగా  లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ లకా్ష్మరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ ప్రధాన అర్చకులు  స్వాగతం పలికి అర్చన, తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. చెన్నకేశవస్వామి జాతర సందర్భంగా వచ్చే భక్తులకు చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆలయ ధర్మకర్తల మండలికి సూచించారు. వైద్యం, తాగునీరు, పారిశుధ్యం తదితర చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో సంగీత, నాటక మండలి చైర్మన్ బాద్మిశివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, ఎంపీపీ లక్ష్మీశంకర్‌నాయక్, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాములు, బ్రహ్మలింగం, బాలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


logo