సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Feb 01, 2020 , 00:46:50

ఇద్దరిపై పీడీ యాక్ట్‌

ఇద్దరిపై పీడీ యాక్ట్‌

గద్వాల అర్బన్‌ : పదే పదే గొర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వ రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె తెలియచేస్తూ జిల్లా పరిధిలోని మల్దకల్‌, కేటీదొడ్డి, ధరూర్‌ తదితర మండలాలతో పాటు సీసీకుంట, మక్తల్‌ మండలాల్లో పదే పదే గొర్ల దొంగతనాలకు పాల్పడుతున్న వనపర్తి జిల్లా అమరచింత మండలం తుక్యా నాయక్‌ తండాకు చెందిన వర్తా ప్రకాశ్‌ నాయక్‌(36), హాస్టల్‌ తండాకు చెందిన దేవ్‌ సావత్‌ రెఖ్యా నాయక్‌(35)లపై పీడీ యాక్ట్‌ అమలు చేసినట్లు గురువారం ఉతర్వులు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు గద్వాల్‌ సీఐ జక్కుల హన్మంత్‌, మల్దకల్‌ ఎస్సై కృష్ణ ఓబుల్‌ రెడ్డి నిందితులపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేసి హైదారాబాద్‌ చంచల్‌గూడా కేంద్ర కారాగారంలో నిందితులను జైలర్‌ సమక్షంలో పీడీ యాక్ట్‌ నిర్భంద ఉత్తర్వులను అందజేసి నిందితులను జైలులో అప్పగిం చారు. 


పీడీ యాక్ట్‌ కేసు నమోదు అయిన ఇద్దరు నిందితులు మరో ఐదుగురు నిందితులతో కలిసి సులభంగా డబ్బులు సంపాధించాలనే ఉద్దేశంతో మల్దకల్‌ కేంద్రంతో పాటు మండలం పరిధిలోని మంగంపేట గ్రామం, ధరూర్‌ మండలం ఉప్పేర్‌ గ్రామం, కేటీదొడ్డి మండల కేంద్రంలో గతం నుంచి పొలాల్లో, ఖాళీ స్థలాలో రాత్రి సమయంలో నిలుపుకుంటున్న గొర్రెల మందల నుంచి గొర్రెల కాపరుల కళ్లు కప్పి గొర్రెలను దొంగలించారని పేర్కొన్నారు. వీరిమీద ఆయా పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయన్నారు. అదే తరహాలో మహబుబ్‌నగర్‌ జిల్లా సీసీ కుంట మండలం, నారాయన్‌పేట జిల్లాలో మక్తల్‌ మండలంలో కూడా గొర్రెల దొంగతనాలకు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇకపై ఇలాంటి చోరీలకు పాల్పడే వారితో పాటు ఎవరైనా దొంగతనాలకు, భూ కబ్జాలకు, మత్తు పదార్థాలు అమ్మడం, ఆర్గనైస్‌ నేరాలు మరియు ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై కూడా పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 


logo