శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Jan 30, 2020 , 01:26:37

జోగుళాంబా పాహిమాం

జోగుళాంబా పాహిమాం
  • కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
  • చండీహోమం, కుంకుమార్చనలు
  • నేడు ఆలయంలో శాంతి కల్యాణం
  • నేటితో ముగియనున్న ఉత్సవాలు

అలంపూర్‌,నమస్తే తెలంగాణ: అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో నాలుగు రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారి ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. చండీహోమం, పవమాన సూక్త పారాయణ హోమం, ఆవాహిత దేవతా హోమం, మండపారాధన, నీరాజన మంత్ర పుష్పముల పూజా కార్యక్రమాలు  నిర్వహించారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. ఆలయంలో కుంకుమార్చన, ఖడ్గమాల, త్రిశతి అర్చన నిర్వహించారు. యాగశాలలో నిర్వహించిన హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆలయాలను తెలంగాణ రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌ వీరబ్రహ్మం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆలయ విశిష్టత, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. 

ప్రత్యేక పూజలు ఇలా..

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో గురువారం త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు అమ్మవారి మూలమూర్తికి నిర్వహించే సహస్రఘటాభిషేకంలో పాల్గొనదలచిన వారు  రూ.200 చెల్లించి  అభిషేక కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. అభిషేక రుసుం ఆలయ దేవస్థానంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో మాత్రమే నేరుగా రుసుం చెల్లించి టికెట్‌ తీసుకోవాలని ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. అభిషేకం అనంతరం సాయంత్రం 4 గంటలకు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వార్ల శాంతి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో  ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోత్సవాల చివరిరోజు విశేషమైన రోజు కావడంతో భక్తులు వేలాదిగా పాల్గొనే అవకాశం ఉంది. ఆ దిశగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వలంటీర్ల సహాయ సహకారాలు అందించనున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. ప్రత్యేక రుసుంతో శీఘ్ర దర్శన ఏర్పాటు అందుబాటులో ఉందన్నారు.


logo