సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Jan 27, 2020 ,

అటెన్షన్‌

అటెన్షన్‌

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ పోరులో టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. సోమవారం జరిగే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ కౌన్సిలర్లే పదవులు చేపట్టనున్నారు. వడ్డేపల్లి మినహా అన్న స్థానాలూ కైవసం చేసుకునే దిశగా టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 338 వార్డులకు గాను 170 వార్డులను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అదే దూకుడుతో మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌కు 62, బీజేపీకి 49 వార్డులు మాత్రం లభించాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ రెబెల్స్‌ సైతం పలువురు గెలుపొందిన వారిలో ఉన్నారు. కాగా 17 మున్సిపాలిటీలకు గాను 16 స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నేతలు తమ అంచనాలను సిద్ధం చేసుకున్నారు. అవకాశం లేకపోయినా ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలు మానుకోవడంలేదు. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి సింహభాగం ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నందున వారి జాగ్రత్తలో వారు ఉన్నట్లు సమాచారం. నేడు మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 

టీఆర్‌ఎస్‌ పార్టీకే అధిక స్థానాలు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కారు జోరు కొనసాగింది. ఇప్పటికే అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మరోసారి తన సత్తా చాటింది. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఒక్క వడ్డేపల్లి మున్సిపాలిటీ మినహా ప్రతిపక్షాలకు అవకాశమే లభించలేదు. పలు చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ రెబెల్స్‌ వల్ల పార్టీ అభ్యర్థులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. హంగ్‌ వచ్చే స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో అత్యధిక ఎక్స్‌ అఫీషియో సభ్యులు (17) మంది ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ మిగతా వారికి అందనంత అవకాశాలు కలిగి ఉంది. వివిధ సమీకరణాల వల్ల ఆలంపూర్‌ నియోజకవర్గం పరిధిలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ చేజారింది. మిగతా 16 స్థానాల్లో ప్రతిపక్షాలకు కనీసం ఛాన్స్‌ ఇచ్చేందుకు కూడా ఆ పార్టీ నేతలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్‌లో స్పష్టంగా కారు గుర్తుకే దక్కింది. భూత్పూర్‌ మున్సిపాలిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకునే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కల్వకుర్తి, నాగర్‌ కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ పార్టీదే. ఇక కొల్లాపూర్‌లో ఎక్స్‌ అఫీషియో ఓట్లతో టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్‌ మున్సిపాలిటీల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజార్టీతో కైవసం చేసుకోగా.. అమరచింతనూ అధికార పార్టీయే కైవసం చేసుకోనుందని తెలుస్తోంది. గద్వాల జిల్లాలోని గద్వాల, ఆలంపూర్‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టమైన మెజార్టీతో ఉన్నాయి. అయిజలో ఇతరుల సహకారంతో టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు స్పష్టంగా వెల్లడిస్తున్నారు. వడ్డేపల్లి మాత్రం కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకున్నది. నారాయణపేట జిల్లాలో కోస్గి, నారాయణపేట, మక్తల్‌ మున్సిపాలిటీలున్నాయి. వీటిలో నారాయణపేట టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కోస్గిలో 16 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌కు 7, కాంగ్రెస్‌కు 7, ఇండిపెండెంట్స్‌ 2 కైవసం చేసుకున్నారు. ఇండిపెండెంట్స్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ రెబెల్స్‌ కావడంతో ఇక్కడ ఎమ్మెల్యే ఎక్స్‌ అఫీషియో ఓటుతో సులభంగా మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకునే అవకాశాలున్నాయి. మక్తల్‌లో 16 స్థానాలకు  బీజేపీకి 8, టీఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 2, ఇండిపెండెంట్‌ గెలుచుకున్నారు. ఇక్కడ ఇండిపెండెంట్స్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతునిస్తే ఎక్స్‌ అఫీషియో ఓట్ల ద్వారా మక్తల్‌ సులభంగా టీఆర్‌ఎస్‌ వశం కానున్నదని సమాచారం. 

అత్యంత ప్రతిష్టాత్మకంగా..

ఉమ్మడి జిల్లా పరిధిలోని 17 మున్సిపాలిటీల ఎన్నికలను టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. జిల్లాలో ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ, సహా అన్ని ఎన్నికల్లోనూ విజయ దుందుబీ మోగించిన టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదేరీతిన విజయం సాధించింది. 16 స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలు కైవసం చేసుకునేందుకు గాను ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అవసరమైన చోట ఇండిపెండెంట్ల సాయం తీసుకోనున్నారు. చాలామంది టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌ కావడంతో పని సులభంగా పూర్తవనున్నది. అత్యధిక ఎక్స్‌ అఫీషియో సభ్యులున్న టీఆర్‌ఎస్‌ పార్టీ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. సోమవారం జరిగే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల కోసం పార్టీ నేతలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. logo